![T20 World Cup 2024 ENG VS SCO: England Never Won On European Teams In T20 World Cup Tourneys](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/06/5/eng1.jpg.webp?itok=OSvooAc0)
టీ20 వరల్డ్‌కప్‌ల్లో తమ ఖండానికి (యూరప్) చెందిన జట్లపై విజయం సాధించడం ఢిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు తీరని కలగా మిగిలిపోయింది. ఇంగ్లండ్ ఇప్పటివరకు జరిగిన ప్రపంచకప్ పోటీల్లో సొంత ఖండానికి చెందిన జట్లపై ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేకపోయింది. పొట్టి ప్రపంచకప్‌లో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఇంగ్లండ్.. సొంత ఖండానికి చెందిన జట్లైన నెదర్లాండ్స్, ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్లను ఇప్పటివరకు నాలుగు సందర్భాల్లో ఎదుర్కొంది.
ఇందులో మూడింట ఊహించని పరాజయాలు ఎదుర్కోగా.. ఓ మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. 2009, 2014 ఎడిషన్లలో నెదర్లాండ్స్ చేతిలో పరాభావాలు ఎదుర్కొన్న ఇంగ్లండ్.. 2022 ఎడిషన్‌లో ఐర్లాండ్ చేతిలో చావుదెబ్బ తింది. తాజాగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ నిన్న సహచర యూరప్ జట్టైన స్కాట్లాండ్‌తో తలపడింది.
ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ప్రపంచకప్‌లో సొంత ఖండానికి చెందిన జట్టుపై గెలవాలన్న ఇంగ్లండ్ కల కలగానే మిగిలిపోయింది. యూరోపియన్ దేశాల్లో టెస్ట్ హోదా కలిగిన ఎకైక దేశమైన ఇంగ్లండ్ సొంత ఖండ జట్లు, క్రికెట్ పసికూనలపై ఇప్పటివరకు ఒక్క విజయం సాధించలేకపోవడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
కాగా, టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బార్బడోస్ వేదికగా ఇంగ్లండ్- స్కాట్లాండ్ మధ్య నిన్న జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. మ్యాచ్‌కు ముందే వర్షం ప్రారంభం కావడంతో టాస్ ఆలస్యంగా పడింది. టాస్ గెలిచిన స్కాట్లాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. ఈ సమయంలో మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మ్యాచ్ రద్దయ్యే సమయానికి జార్జ్ మున్సే (41), మైఖేల్ జోన్స్ (45) క్రీజ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment