
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి గడగడలాడిస్తోన్న సంగతి తెలిసిందే. చైనాలోని వుహాన్ నుంచి పుట్టిన వైరస్ క్రమంగా యూరోప్ దేశాలకు విస్తరించి పెద్ద విలయాన్ని సృష్టించింది. ఇప్పటివరకు కరోనా బారీన పడి 14లక్షల కేసులు నమోదవ్వగా, 83వేలకు పైగా మృతి చెందారు. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లో వేలాది సంఖ్యలో కరోనా మహమ్మారికి బలయ్యారు. ఇప్పటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇంకా తగ్గడం లేదు. తాజాగా అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో యూరోప్ దేశాలలో కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆంక్షలు సడలించాలని ఆయా దేశాలు అనుకుంటున్నాయి.
(కరోనా అతన్ని బిలియనీర్ చేసింది)
దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరోప్ రీజనల్ డైరెక్టర్ హాన్స్ కుల్జీ స్పందిస్తూ.. 'ఇది ఆంక్షలు సడలించాల్సిన సమయం కాదు. ఒకవేళ అదే జరిగితే ఇప్పుడిప్పుడే యూరోప్ దేశాల్లో కరోనా కేసులు తగ్గుతున్న వేళ మొదటికే ప్రమాదమొస్తుంది. కరోనా మహమ్మారి అణిచివేతకు సమాజంలోని ప్రతీ ఒక్కరూ మాతో కలిసి మూడు రెట్లు శక్తివంతగా పనిచేయాల్సిన సమయం ఇదంటూ' పేర్కొన్నారు. అంతేగాక కరోనా బారిన పడిన దేశాలన్ని కరోనాను తరిమికొట్టేందుకు మూడు విస్తృత మార్గాలు ఏంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందులో మొదటిది.. కరోనాపై పోరాటం చేస్తున్న వైద్య రంగానికి మరింత ఆధునాతన పరికరాలను అందించేందుకు ప్రతీ ఒక్కరు ముందుకు రావాల్సి ఉంటుంది. ఇక రెండోది ఏంటంటే.. కరోనా లక్షణాలు, అనుమానితుల కేసుల నుంచి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులను దూరంగా ఉంచాలన్నారు. దీనివల్ల కొత్త కేసులు నమోదయ్యే అవకాశాలు తక్కువైతాయన్నారు. ఇక మూడవది ఆయా దేశాల్లో ప్రభుత్వం, అధికారులు నిరంతర కమ్యూనికేషన్ సంబంధాలను ఏర్పరచుకోవాలన్నారు.
కాగా దేశంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేసే ఆలోచన తమకు లేదని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రోజునే ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను కరోనాపై మరింత అప్రమత్తం కావాలని హెచ్చరించింది. అయితే కరోనా కేసులు తక్కువగా ఉన్న కొన్ని దేశాల్లో ఆంక్షలను సడలించుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతునిచ్చింది. అందులో ఆస్ట్రియా, డెన్మార్క్, నార్వే దేశాలు ఉన్నాయి. కాగా ఇండియాలో లాక్‌డౌన్ మార్చి 25నుంచి నిరంతరాయంగా కొనసాగుతుంది. భారత్‌లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5వేలకు పైగా కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 150కి చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment