
ఇటలీ, స్వీడన్, జర్మనీ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 8 రోజులపాటు కచ్చితంగా స్వీయ నిర్బంధంలో ఉండాల్సి ఉంటుంది.
సాక్షి, న్యూఢిల్లీ : యూరప్‌లో ప్రాణాంతక కరోనా వైరస్ కేసులు తగ్గకపోగా మరింతగా పెరుగుతుండడంతో బ్రిటిష్ ప్రభుత్వం ఇటలీ, స్వీడన్, జర్మనీ దేశాలను ‘క్వారంటైన్’ జాబితాలో చేర్చింది. అదే సమయంలో 14 రోజుల క్వారెంటైన్ పీరియడ్‌ను 8 రోజులకు తగ్గించే విషయాన్ని పరిశీలిస్తోంది. ఇటలీ, స్వీడన్, జర్మనీ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 8 రోజులపాటు కచ్చితంగా స్వీయ నిర్బంధంలో ఉండాల్సి ఉంటుంది. ఎనిమిదవ రోజున కరోనా పరీక్షలు నిర్వహించి నెగటివ్ వస్తే స్వీయ నిర్బంధం ముగిసినట్లే. కరోనా పరీక్షలో పాజిటివ్ అని వస్తే మరో వారం రోజుల పాటు స్వీయ నిర్బంధాన్ని పొడిగిస్తారు.
బ్రిటన్‌లో కరోనా కేసులను కట్టడి చేయడంలో భాగంగా రాత్రి పది గంటలకే అన్ని బార్లు, పబ్బులు, క్లబ్బులను మూసివేయాలంటూ తాజా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఐర్లాండ్ దేశంలోనయితే మరోసారి 15 రోజుల లాక్‌డౌన్‌ను అమలు చేయాలంటూ అక్కడి వైద్య నిపుణుల బృందం సిఫార్సు చేసింది. ఇక 5,15,571 పాజిటివ్ కేసులతో యునైటెడ్ కింగ్‌డమ్ 12 స్థానంలో కొనసాగుతోంది. తొలి మూడు స్థానాల్లో అమెరికా, భారత్, బ్రెజిల్ దేశాలున్నాయి. యూకే కరోనా బారినపడి ఇప్పటివరకు 42,369 మంది మరణించారు.
(చదవండి: ట్రంప్‌పై నెటిజన్లు ఫైర్, బాధ్యతలేకుండా...)