• రూ.10 లక్షల కోట్ల ఖనిజ నిక్షేపాలు
• వచ్చే ఆర్థిక సంవత్సరంలో వేలం ప్రక్రియ
న్యూఢిల్లీ: పెద్ద ఎత్తున గనుల వేలానికి కేంద్ర సర్కారు సమాయత్తం అవుతోంది. రూ.10 లక్షల కోట్ల విలువజేసే ఖనిజ నిక్షేపాలతో ఉన్న 280 గనులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో వేలం వేసేందుకు ప్రణాళిక సిద్ధమైందని కేంద్ర గనుల శాఖ సెక్రటరీ బల్వీందర్‌కుమార్ బుధవారం ఢిల్లీలో విలేకరులకు తెలిపారు. మరో 83 గనులు వివాదంలో ఉన్నాయని, కోర్టుల తీర్పులకు అనుగుణంగా వాటి వేలం ఆధారపడి ఉంటుందన్నారు. రూ.94,000 కోట్ల ఖనిజ నిల్వలు ఉన్న 21 గనుల లీజులను ఇప్పటి వరకు వేలం వేసినట్టు తెలిపారు.
గనుల తనిఖీకి, టోపోగ్రఫీ మ్యాప్‌ల రూపకల్పనకు డ్రోన్ టెక్నాలజీ వినియోగం ఈ నెలలోనే ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రస్తుతం మనుషుల సాయంతో టోపోగ్రఫీ మ్యాపుల రూపకల్పనకు రోజుల సమయం తీసుకుంటుండగా, డ్రోన్ల వినియోగంతో ఆ పనిని గంటల్లోనే పూర్తి చేసేయవచ్చన్నారు. ఎంత మొత్తం ఖనిజాల తవ్వకం జరిగిందీ గంటలోనే తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వం వేలానికి తీసుకురానున్న గనులు జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ఉండగా, వీటిలో ఐరన్‌ఓర్, బాక్సైట్, సున్నపురాయి కలిగినవీ ఉన్నాయి.