సాక్షి, హైదరాబాద్: గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ (ఎంఎండీఆర్) చట్ట సవరణ–2015 అమల్లోకి వచ్చాక రాష్ట్రంలో తొలిసారిగా మేజర్ గనుల బ్లాకులకు వేలం నిర్వహించనున్నారు. సూర్యాపేట జిల్లా పరిధిలో 3 సున్నపురాయి గనుల బ్లాకులకు వేలం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
గతంలో ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వారికి అన్న పద్ధతిలో గనుల కేటాయింపు జరిపేవారు. యూపీఏ ప్రభుత్వం ఈ విధానం కింద జరిపిన బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో ఈ కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఈ–వేలం విధానంలో గనుల కేటాయింపులు జరపాలని ఎంఎండీఆర్ చట్టానికి సవరణలు చేసింది.
రాష్ట్రంలో తొలిసారిగా..
ఈ చట్ట సవరణ తర్వాత తొలిసారిగా రాష్ట్రం లో గనుల బ్లాకులకు వేలం జరగనుంది. సూర్యాపేట జిల్లా పరిధిలోని సుల్తాన్‌పూర్, సైదుల్‌మాను(జాన్‌పహాడ్), పసుపుల అటవీ ప్రాంతాల్లో 3 సున్నపురాయి గనుల బ్లాకులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. సుల్తాన్‌పూర్‌లో 80 మిలియన్ టన్నులు, సైదుల్‌మాను బ్లాకులో 71 మిలియన్ టన్నులు, పసుపుల బ్లాక్‌లో 60 మిలియన్ టన్నుల సున్నపు రాయి నిక్షేపాలున్నట్లు రాష్ట్ర గనుల శాఖ ఆధ్వర్యంలో జరిపిన పరిశీలనలో తేలింది.
ఈ మూడు బ్లాకులకు ఈ–వేలం నిర్వహించాలని కేంద్ర గనుల శాఖను రాష్ట్రం ఇటీవల కోరింది. ఎస్‌బీఐ క్యాపిటల్ సహకారంతో ఈ బ్లాకులకు కేంద్ర గనుల శాఖ వచ్చే నెలలో ఆన్‌లైన్ వేలం నిర్వహించనుందని రాష్ట్ర గనుల శాఖ అధికారవర్గాలు తెలిపాయి. వేలం ద్వారా రాష్ట్రానికి రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశాలున్నాయని ప్రభుత్వం అంచనా వేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో మూడు నెలల వ్యవధిలో ఈ మూడు ప్రాంతాల్లో సున్నపురాయి నిక్షేపాలున్నట్లు రాష్ట్ర గనుల శాఖ నిర్ధారించింది.
సూర్యాపేట జిల్లాలో మూడు సున్నపురాయి బ్లాకులకు వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు సోమవారం జరిగిన అంతర్జాతీయ మైనింగ్ సదస్సులో కేంద్ర గనుల శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ దృష్టికి తీసుకెళ్లగా, వేలం ప్రక్రియలో రాష్ట్రానికి పూర్తిగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment