'బేరం'.. బెండకాయలెంత కిలో..? | Beram Funday Story Written By M Dhanalakshmi | Sakshi
Sakshi News home page

'బేరం'.. బెండకాయలెంత కిలో..?

Published Sun, Sep 1 2024 1:48 AM | Last Updated on Sun, Sep 1 2024 1:48 AM

Beram Funday Story Written By M Dhanalakshmi

‘బెండకాయలెంత కిలో?’ బుట్ట తీస్తూ అడిగింది అమ్మ.
‘నలభై రూపాయలమ్మ’
‘నలభై రూపాయలా!’ సాగదీస్తూ పావుకేజీ చికెన్‌ వస్తుంది తెలుసా.. నలభైకి’ అంది.
‘పోనీ అదే కొనుక్కోండమ్మా.. నేనేం మిమ్మల్ని పిలవలేదుగా!’ దురుసుగా సమాధానం వచ్చింది అటు నుండి.
‘అదేనా సమాధానం చెప్పే పద్ధతి?’ అమ్మ కోపం ఎక్కువైంది.
‘ఎందుకు ఉమా ఆ బేరాలు? కావల్సినవి తీసుకో డబ్బుల సంగతి నీకెందుకు?’ సలహా ఇచ్చారు నాన్న.
‘ఏం ఇంట్లో ఏమైనా డబ్బుల చెట్టు నాటరా ఏంటి? అసలందుకే మిమ్మల్ని నాతో రావద్దంది’ కూరగాయలావిడ మీద కోపం నాన్న మీదకి మళ్లించింది ఘాటుగా.

ఇదెప్పుడూ ఉండేదే! నాన్నకసలు నోరు ఊరికే ఉండదు వద్దన్నా సలహాలిస్తూనే ఉంటారు. ‘కాసేపు కామ్‌గా ఉండొచ్చు కదా నాన్న! ఎందుకిక్కడ కూడా యుద్ధం?’ సలహా ఇచ్చా! నాది కూడా నాన్న పోలికెనేమో?
‘నేనా మాత్రం కలుగజేసుకోకుంటే ఈ రోజంతా వాళ్లతో బేరాలాడుతూ ఇక్కడే ఉంటుంది’
‘ఉఫ్‌.. ఎప్పటికి పూర్తవుతుందో?’ ఆలోచిస్తూ ఆసీనురాలినయ్యా బెంచ్‌ మీద. మార్కెట్‌ అంతా తిరిగి, కూరగాయల వాళ్లతో బేరాలాడి.. వాళ్లను విసిగించి, తనూ విసుక్కుని మొత్తానికి రెండు గంటల తర్వాత వచ్చింది.
‘ఉమా ఎంత మిగిలించావ్‌? ఛ.. రెండు గంటలు వేస్ట్‌.. ’ నుదురు రుద్దుకున్నారు నాన్న.
‘నా టైమ్‌ అంత ఖరీదైనది కాదు కానీ పదండి’ అంటూనే ఓ కవర్‌ నాన్న చేతిలో, మరో కవర్‌ నా చేతిలో పడేసి ఆటోస్టాండ్‌ వైపు నడిచింది. నోరు మూసుకుని అమ్మని అనుసరించాం. ‘మరో ఘట్టం మొదలవుతుందిప్పుడు’ మెల్లగా అన్నారు నాన్న.
‘ఈ రోజుకిదే చివరి అంకమేమో’ అంతే మెల్లగా చెప్పాను.
 

‘శ్రీరాం నగర్‌ కాలనీకి ఎంత తీసుకుంటావ్‌?’
‘అరవై రూపాయలమ్మ’
‘నలభై రూపాయలే కదా?’
‘పోనీ యాభై ఇవ్వండమ్మ’
‘లేదు, లేదు నలభై రూపాయలే’ బేరం సాగీ, సాగీ ఇంటికెళ్లేసరికి పది గంటలు దాటింది.
‘దేవుడా!’ అనుకుంటూ సోఫాలో పడిపోయాం నీరసంగా.
‘ఉమా! నువ్వెంత మిగిల్చావో
నాకు తెలియదు కానీ ఈ టైమ్‌ తప్పిన భోజనంతో నా షుగర్‌ కూడా కంట్రోల్‌ తప్పుతుంది. ఆ మిగిలించిన డబ్బంతా నా హాస్పిటల్‌ బిల్‌కి సరిపోతుంది’ అరిచారు నాన్న.

‘అవునులే అలా మిగిలించిన డబ్బుతోనే ఈ నగలన్నీ చేయించుకున్నాను’
వాదన మొదలైంది. ఇదిప్పట్లో ఆగదు. ఎందుకో గానీ ఈసారి నాన్నకి సపోర్ట్‌ చేయాలనిపించలేదు. అమ్మది మాత్రం ఏం తప్పుంది? సగటు మధ్యతరగతి గృహిణిలానే ఆలోచిస్తోంది. ఆ చేసేదంతా ఎవరి కోసం? ఇంటి కోసం.. ఇంట్లో ఉన్న మా కోసమేగా? నాన్న పూర్తిగా వ్యతిరేకం అమ్మకి. బేరం అనే పదం కూడా నచ్చదు. సమయం వృథా, అంతకన్నా ముఖ్యంగా అలా బేరమాడటం ఆ వస్తువుల విలువను తగ్గించటమే అని వాదన. ఎవరి కోణంలోంచి చూస్తే వాళ్ళదే సరనిపిస్తుంది.

‘ఏంటా ఆలోచన? దేని కోసం?’ ఉలిక్కిపడి చూశాను నాన్న వైపు.
‘మీ ఇద్దరి గురించే..’
‘మా గురించా?’ అర్థంకానట్టు చూశారు.
‘అవును, అసలు మీ ఇద్దరూ గొడవపడకుండా ఉన్న రోజేదైనా ఉందా?’ అని నవ్వాను.
‘అది కష్టమమ్మా! ఇంకా చెప్పాలంటే అసాధ్యం కూడా!’ గట్టిగా నవ్వారు నాన్న కూడా.
‘అసాధ్యం కాదే మీ నాన్నని మౌనవ్రతం చేయమను’ లోపలి నుండి వచ్చింది అమ్మ.
‘ అప్పుడు మాత్రం నీ నోరు ఊరుకుంటుందంటావా?’ 
‘అయితే ఇద్దరూ చేయండి. నాకు మనశ్శాంతిగా ఉంటుంది చెప్తూనే లోపలికి పరిగెత్తాను.
‘దానర్థం నోరు మూసుకుని ఉండమనేగా?’ మాటలు బాగా ఎక్కువయ్యాయి. రూమ్‌లోకెళ్లినా అమ్మ మాటలు వినిపిస్తున్నాయి.

‘రేపు క్లాస్‌ లేదుగా?’ లోపలికొస్తూ అడిగారు నాన్న.
‘ఎందుకు? స్పెషల్‌ క్లాస్‌ ఉంది, రికార్డ్‌ వర్క్‌ కూడా ఉంది’ 
‘నీతో కొంచం వర్క్‌ ఉంది. ఎక్కువసేపు కాదు, మహా అయితే ఓ గంటన్నర అంతేలే’
‘అది సరే కానీ ఆ గంటన్నర ఏం చేయాలి?’ విసుగొచ్చింది. 
‘నోరు ముసుకుని, కుదురుగా కూర్చోవాలి’
‘ఎక్కడ? ఎందుకు?’ విసుగు ఎక్కువైంది. 
‘పెళ్లిచూపుల్లో’ నవ్వేసి వెళ్లిపోయారు.

నాకు మాత్రం నవ్వు రాలేదు. ఉత్సాహం, కుతూహలం ఏవీ రాలేదు. గొప్ప కార్యక్రమం మరి! తలనొప్పికి బోనస్‌గా మెడనొప్పి కూడా. ‘ఇప్పుడప్పుడే ఇలాంటి ప్రోగ్రామ్స్‌ వద్దని చెప్పా కదా? ఇంజనీరింగ్‌ అవలేదు, జాబ్‌ రాలేదు. మీకెందుకంత తొందర?’ ఇలాంటి డైలాగ్స్‌ నాన్న మీదకేం విసరాలనిపించలేదు. అలాంటి వాటి వల్ల ప్రయోజనమేం ఉండదు. పైగా నాన్న సంగతి నాకు తెలియంది కాదు. ఎలాంటి వారినైనా ఒప్పించగల నైపుణ్యం కలిగిన వారు. ‘చూద్దాం ఏం జరుగుతుందో?’ అనుకోవటమే నాకు మిగిలిన ఆప్షన్‌.
‘హరీ టైమెంతయిందో తెలుసా?’ సూర్యుడు పూర్తిగా డ్యూటీ ఎక్కక ముందే లేపింది అమ్మ.
‘అబ్బా! వాచ్‌ చూడొచ్చుకదమ్మా! లేపి మరీ అడగాలా?’ తలకొట్టుకున్నాను.
‘వేశావులే పెద్ద జోక్, నోరు మూసుకుని లేచి రెడీ అవ్వు’ బాత్రూమ్‌లోకి తోసింది.

వాళ్లొచ్చేసరికి పదిన్నర దాటుతుంది. ఇప్పుడింకా ఆరు కూడా కాలేదు. ఇప్పటి నుండి రెడీ అవుతూ ఉండాలా? ఈ దృక్పథం ఎప్పటికి మారుతుంది? అసలు మారుతుందా?
‘ఏంటమ్మా ఉదయం నుండి అమ్మ చెప్పిందంతా కీ ఇచ్చిన బొమ్మలా చేస్తున్నావు? ఏంటో?’ దీర్ఘం తీశారు నాన్న.  
చేయకపోతే తిట్లు, చేస్తే అనుమానాలు. వాళ్లెంత మంది వస్తారో? ఎన్ని ప్రశ్నలడుగుతారో? ఆలోచిస్తుండగానే వాళ్లు రావటం, అతిథి సత్కారాలు, మరబొమ్మలా వాళ్ల ముందు కూర్చోబెట్టడం.. అన్నీ సెకెన్ల ముల్లులా చకాచకా సాగిపోయాయి. పెద్దల ప్రశ్నలు, నా సమాధానాలు సాగుతూన్నాయి.

ఈ అబ్బాయికి మాటలు రావా? మొహమాటమా? నోరే విప్పటం లేదు. మరీ తెగించి చూడటం బాగుండదేమో? ఏవేవో సినిమా సన్నివేశాలు చకచకా కదిలిపోతున్నాయి. ఎంత మధురంగా ఉంటాయో పెళ్లి చూపుల సన్నివేశాలు! నాలాగే చాలా మంది అమ్మాయిలు వాటిని చూసి అలాగే ఉంటాయని భ్రమపడి, పెళ్లి చూపులయ్యాక నిరాశపడతారు.
‘ఏరా? అమ్మాయితో ఏమైనా మాట్లాడతావా?’ పెళ్లికొడుకు తండ్రనుకుంటా.. ఎంత దర్పమా గొంతులో!
అప్రయత్నంగా కళ్లు తిప్పాను నాన్న వైపు. ఇప్పుడు నాన్న కూడా అబ్బాయితో మాట్లాడతావా? అంటే అందరి మొహాలు ఎలా ఉంటాయో? ఒక్కసారిగా షాకవుతారేమో?
‘మాట్లాడకపోతే.. పోనీ నచ్చిందో? లేదో?’ చెప్పు సీరియస్‌గా అడిగాడాయన.
‘మీ ఇష్టం నాన్నా’ మంద్రంగా వినిపించిందో స్వరం.
ఏం సమాధానం..? అవుననా? కాదనా? ఇప్పుడు నేను షాకయ్యాను. అసలెలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రుల మాట మీద గౌరవం ఎక్కువనా? తనకి వ్యక్తిత్వం తక్కువనా?

ఏ మూలో మిగిలున్న కాస్త ఆసక్తి కూడా ఎగిరిపోయింది. ముళ్ళ మీద కూర్చున్న ఫీలింగ్‌!
‘నువ్వేమంటావమ్మా?’ దగ్గర్లో గట్టి వస్తువులేం లేవు కానీ, ఉండుంటేనా వాటితో తల కొట్టుకోవాలనిపించింది.
అంతా నా వైపే చూస్తున్నారు. ‘మా నాన్న ఇష్టం’ అనే నా డైలాగ్‌ కోసం. అలా అంటేనే కదా అమ్మానాన్నల పెంపకాన్ని పదిమందీ మెచ్చుకునేది! వాళ్ళ మెప్పు కోసం, అమ్మానాన్నల ఆనందం కోసం అలా చెప్పటం కరెక్టా కాదా? మరి నా సంగతేంటి తన గురించి ఏం తెలియకుండా ఎలా నిర్ణయించుకోవాలి? ఎక్కువ సమయం తీసుకుంటే బాగుండదు. ఏం తెలియటంలేదు. 
‘పర్లేదు చెప్పమ్మా..’ మరోసారి అడిగేసరికి నాన్న వైపు చూశాను నిస్సహాయంగా.
‘ఉమా! తనని లోపలికి తీసుకెళ్లు’ నాన్న మాటకి నిజంగానే ప్రాణం వచ్చినట్టయింది. లోపలికెళ్తూ నెమ్మదిగా కళ్లు తిప్పాను అబ్బాయి వైపు. ఓ నవ్వు కాదుకదా! కనీసం చూడను కూడా చూడలేదు. 
‘మొహమాటమంటే ఒప్పుకుంటాను. కానీ దీపు చాలా మంచివాడు చిన్నప్పటి నుండి చూస్తున్నా కదా! ఒక్క చెడలవాటు కూడా లేదు’ ఆపకుండా చెప్పుకుపోతోంది అమ్మ.
 

‘చిన్నప్పటి నుండి చూస్తున్నావా?’ ఇంకో షాక్‌ నాకు.
‘ఆ! ఎప్పుడైనా ఏ ఫంక్ష¯Œ కైనా, పెళ్లికైనా వస్తేగా చుట్టాలో, స్నేహితులో తెలియడానికి! ఎంతసేపూ ఇంటినే అంటిపెట్టుకునుంటే ఏం తెలుస్తుంది?’
‘అమ్మా! ఒక ప్రశ్నకి మరో ప్రశ్న సమాధానమా?’
‘వాడు నాకు మేనల్లుడి వరస. మా పెద్దమ్మ కొడుకు తెలుసు కదా.. శేఖరన్నయ్య.. వాడి కొడుకు. మంచి ఉద్యోగం కూడా! ఒప్పుకోవచ్చు కదే?’
కిటికీ తెరిచి దీపు వైపు చూశాను. హుందాగా ఉన్నా అమాయకత్వం నిండి ఉన్న మొహం. అమ్మ సర్టిఫికేట్‌కి తిరుగులేదు. 
‘పైగా తనకి నువ్వంటే చాలా ఇష్టం కూడా ’ అనేసి వెళ్లిపోయింది.
అదేంటో ఇప్పటి వరకూ ఉన్న చిరాకంతా టక్కున మాయమైపోయింది. 
‘ఏంటి బావా? వీళ్లిద్దరూ సరిగ్గా చెప్పకుండా దాటేస్తున్నారు. ఏం చేద్దాం?’ వాళ్ల మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.

‘మౌనం అంగీకారమేనేమో?’ ఇంకెవరో అన్నారు. ‘అంతవరకూ లాంఛనాల గురించి ఒక మాటనుకుంటే సరిపోతుందేమో?’ మరొకరి సలహా.
‘అబ్బాయిది గవర్నమెంట్‌ ఉద్యోగం. ఉన్న ఆస్తికి ఒక్కడే వారసుడు. మీరెంత వరకు ఇద్దామనుకుంటున్నారు?’
‘మా అమ్మాయిది డిగ్రీ అవుతుంది. తెలివైనది కూడా!’ మా పిన్ని నన్ను పొగడటం మొదలుపెట్టింది.
‘ఇరవై లక్షలు, అబ్బాయికి నాలుగు తులాల బంగారం. అమ్మాయి కెంత బంగారం పెడతారో మీ ఇష్టం, బైక్‌ ఎలాగూ పెడతారుగా?’
బట్టీ పట్టిన సమాధానంలా టకటకా చెప్పేశాడు మధ్యవర్తి. 
‘అదేంటి బావా? మా స్థాయి తెలిసి కూడా..’ ఆపేశారు నాన్న. ‘పదిలక్షల వరకూ అయితే పరవాలేదు’ ఓ క్షణమాగి మెల్లగా అన్నారు.

భూకంపం వచ్చిన ఫీలింగ్‌. మొదటిసారి వింటున్నా నాన్న బేరమాడటం. ఆటో డ్రైవర్ల కష్టానికి విలువనిచ్చే నాన్న, కూరగాయలకి విలువిచ్చి బేరమాడని నాన్నేనా.. ఈ రోజు నా గురించి బేరమాడుతోంది!? అదేంటో చిత్రంగా కోపం రాలేదు.. నవ్వొచ్చింది. నా జీవితంలో ఎప్పటికీ చూడలేననుకున్నది చూశాను. దీపక్‌ అలాగే కూర్చున్నాడు విగ్రహంలా! ఆ బేరసారాలలో పాలుపంచుకోలేదు. 
అరగంటసేపు సాగుతూనే ఉందా కార్యక్రమం. నాన్నకి నా మీదెంత ప్రేమున్నా తలకి మించిన భారాన్నెలా మోయగలరు?
మరోవైపు నా జీవితం.
కేవలం నా కోసమేగా తనకిష్టంలేని బేరమాడింది! పోనీ నా కోసమేదైనా చేస్తారని ఎంతలా సముదాయించుకున్నా ఏదో గుచ్చుతోంది మనసులో.

నాన్న నా విలువను తగ్గించారా? అంగీకరించలేని నిజం!
దీపక్‌ని నేను కొనుక్కుంటున్నానా? లేదు, లేదు డబ్బిచ్చి మరీ నన్నే అమ్ముతున్నారా? బాగుంది వాళ్ళ కొనుగోలు, నాన్న అమ్మకం!
క్రమక్రమంగా మాట్లాడే ధోరణి నుండి బతిమాలే స్థాయికి దిగిన నాన్న గొంతు. అమ్మాయిగా పుట్టినందుకు మొదటిసారి కలిగిన బాధ! నా కారణంగానే నాన్న తగ్గాల్సి వచ్చిందన్న గిల్టీ ఫీలింగ్‌!
నాలాగే ప్రతి అమ్మాయి ఎప్పుడో ఒకసారి ఎదుర్కోవాల్సిన సందర్భమేమో!
‘కంగ్రాట్స్‌ హరీ’ అరుస్తున్నట్టే లోపలికొచ్చింది అమ్మ. ‘అదృష్టమంటే నీదేనే ..’ ఇంకా ఏదేదో చెప్తున్నా ఆ మాటలేం వినిపించట్లేదు.
‘నాకు నచ్చలేదు’ సూటిగా, స్పష్టంగా చెప్పేశాను.
‘ఏంటి?’ కోపంగా మారిపోయింది అమ్మ గొంతు. ‘ఏం నచ్చలేదే?’   
‘ఈ బేరం, బేరంలో కూర్చున్న ఆ అబ్బాయి’
‘నోరు మూసుకో.. అర్థంలేని మాటలు’
‘అమ్మా! ప్లీజ్‌ నన్నిలా వదిలేస్తావా?’ నా గొంతు నరాలు తెగిపోయాయేమో అన్నంత గట్టిగా వచ్చిందా అరుపు.
‘ఉమా! దాన్నింకా విసిగించకు’ నాన్న అమ్మని తీసుకెళ్ళారు.

ఎందుకీ విపరీతమైన అలజడి? గందరగోళం మనసంతా! నాకు తెలుసు. ఈ కోపం అమ్మ మీద కాదు, నాన్న మీదా కాదు, దీపు మీదసలు కాదు. మరెవరి మీద? ఆలోచిస్తూండిపోయానలా ఎంతసేపో?!
‘హరీ..’ మంద్రమైన అమ్మ పిలుపు ఈ లోకానికి తీసుకొచ్చింది నన్ను. ‘నిన్ను అర్థం చేసుకోగలను కానీ మార్పు నువ్వనుకున్నంత సులభంగా రాదు. దానికి ఎన్నో ఏళ్ల కష్టంకావాలి. జడివానలా ఒక్కసారిగా వస్తుందనుకున్నావా? చిరుజల్లులా నిదానంగానే వస్తుంది. నీ కోపం పక్కన పెట్టి ఒక్కసారి ఆలోచించు’ చెప్పి వెళ్లిపోయింది.
నిజమే మార్పు ఆవేశం వలనో, ఆక్రోశం వలనో రాదు. రాజారామ్మోహన్‌ రాయ్, కందుకూరి వీరేశలింగం వంటి మహానుభావులు పుట్టిన దేశంలో అబ్బాయిలందరూ దీపక్‌ లాగానే ఉంటారనుకోవటం నా పొరపాటు. తల్లిదండ్రులపై గౌరవంతో పాటు భార్య వ్యక్తిత్వానికి విలువనిచ్చే వారూ ఉంటారు. అమ్మాయిలు వంటిల్లు దాటి ఉద్యోగం దాకా రావటానికి  శతాబ్దకాలం పట్టింది.  కట్నకానుకలు, బేరసారాలు లేకుండా పెళ్లి జరగటానికి మరో రెండు శతాబ్దాలు పూర్తవ్వాలేమో .. ఆలోచిస్తూ కొత్త ప్రాజెక్ట్‌ హెడ్డింగ్‌ పెట్టాను..
‘40 వ శతాబ్దం.. భారతీయ వివాహా వ్యవస్థ!’ – ధనలక్ష్మి. ఎమ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement