నాడు చిన్నారి పెళ్లి కూతురు..నేడు డాక్టర్‌గా..! Child Bride to Being a Doctor The Stoy Of Rupa Yadav | Sakshi
Sakshi News home page

నాడు చిన్నారి పెళ్లి కూతురు..నేడు డాక్టర్‌గా..!

Published Thu, Jun 13 2024 1:51 PM | Last Updated on Thu, Jun 13 2024 2:10 PM

Child Bride to Being a Doctor The Stoy Of Rupa Yadav

బాల్య వివాహాల కారణంగా ఎంతోమంది అమ్మాయిల జీవితాలు చిదిగిపోతున్నాయి. వయసుకు మించిన కుటుంబ బాధ్యతలతో అనారోగ్యం పాలై జీవితాలను కోల్పోతున్నారు. అందుకే ప్రభుత్వం సైతం ఇలాంటి వాటిని కట్టడి చేసేలా చట్టాలు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా అవగాహాన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయినా భారత్‌లోని ఇంకా కొన్ని గ్రామాల్లో నేటికి బాల్య వివాహాలు జరుగుతూనే ఉంటున్నాయి. అలానే రూపా యాదవ్‌ అనే మహిళకు ఎనిమిదేళ్ల వయసులోనే పెళ్లైపోయింది. నిజానికి రూపా చిన్ననాటి నుంచే మంచి మెరిటి స్టూడెంట్‌ కావడంతో ఉన్నత చదువులు చదవాలని ఎన్నో కలలకు కంది. కానీ ఈ పెళ్లితో తన ఆశలన్నీ కల్లలైపోకుండా అన్ని రకాల ఒత్తిడులను తట్టుకుంటూ అనుకున్నది సాధించింది. పైగా తన గ్రామానికి, కుటుంబానికి ఆదర్శంగా నిలిచింది.

రాజస్థాన్‌లోని కరిరి అనే చిన్న గ్రామానికి చెందిన రూపా యాదవ్‌ ఎనిమిదేళ్ల ప్రాయంలోనే వివాహం అయిపోయింది. ఆమె పెదనాన్న రూపా మామాగారి ఇద్దరు కొడుకులకు తనను, ఆమె అక్కను ఇచ్చి పెళ్లి చేస్తామని వాగ్దానం చేశారు. దీంతో రూపాకి చిన్న వయసులోనే పెళ్లి అయిపోయింది. అయితే రూపా తండ్రికి ఆమెను బాగా చదివించాలనే కోరిక ఉండేది. కానీ తన అన్న ఇచ్చిన మాట కారణంగా ఏమి చేయలని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. అయితే ఆమె చిన్నిపిల్ల కావడంతో మెచ్యూర్‌ అయ్యేంత వరకు పుట్టింట్లోనూ ఉండేలా పెద్దలు నిర్ణయించడంతో పదోతరగతి వరకు పుట్లింట్లో హాయిగా నిరాటకంగా చదువుకుంది. 

పదోతరగతిలో ఏకంగా 86 శాతం మార్కులతో పాసయ్యి అందర్నీ ఆశ్చర్యపరించింది. ఆ గ్రామంలో ఎవరికి ఇన్ని మార్కులు రాకపోవడంతో ఒక్కసారిగా గ్రామం అంతా రూపాను గౌరవంగా చూడటం మొదలుపెట్టింది. అంతేగాదు ఎన్నో అవార్డులు, ప్రశంసలు వచ్చాయి. బాగా చదివించమని గ్రామ ప్రజలంతా రూపా తండ్రిని ప్రోత్సహించారు. ఇంతలో రూప పెద్ద మనిషి అవ్వడం అత్తారింటికి వెళ్లేందుకు ఏర్పాట్లు జరగడం అన్ని చకచక జరిగిపోయాయి. ఇక ఇక్కడితో ఆమె చదువు ఆగిపోతుందని తండ్రి బాగా దిగులు చెందాడు. అయితే రూపా బావగారు ఆమె చదువుకు ఎలాంటి ఆటంకం రానివ్వమని ఆమె తండ్రికి హామి ఇచ్చారు.

ఆ వాగ్దానాన్ని రూపా మెట్టినిల్లు నిలబెట్టుకుంది. అప్పులు చేసి మరీ ఆమెను ఉన్నత చదువులు చదివించారు. ఇలా చేస్తున్నందుకు సమజం నుంచి హేళనలు, అవమానాలు ఎదురయ్యేవి కూడా. అయినా వాటిని పట్టించుకోకుండా కోచింగ్‌ క్లాస్‌లకు పంపించి మరి మంచి చదువులు చదివించారు. అలా బ్యాచిలర్‌ ఆఫ్‌​ సైన్స్‌లో చేరి చదువుకుంటూ నీట్‌ ఎగ్జామ్‌లకు ప్రిపేర్‌ అయ్యింది. ఆమె ఫీజుల కోసం రూపా భర్త, బావగారు ఎక్కువ గంటలు పని చేయాల్సి వచ్చేది కూడా. అంతలా రూపాకు తన కుటుంబం నుంచి మంచి ప్రోత్సహం లభించింది. వారి ప్రోత్సహానికి తగ్గట్టుగానే రూపా బాగా చదివి నీట్‌లో పాసై బికినీర్‌లోని సర్దార్‌ పటేల్‌ మెడికల్‌ కాలేజ్‌లో అడ్మిషన్‌ పొందింది. 

అలా తన తన అత్తమామలు, భర్త, బావగారి సాయంతో డాక్టర్‌ అవ్వాలనే కలను సాకారం చేసుకుంది. ఐదేళ్ల ఎంబీబీఎస్‌ కోర్సును ఆ కళాశాలలో సాగిస్తుండగా..రెండేళ్లు హాయిగా గడిచిపోయాయి. లాక్‌డౌన్‌ సమయంలో ఇంటి వచ్చాక మూడో ఏడాది ఫైనల్‌ పరీక్షల టైంలో ప్రెగ్నెంట్‌ అయ్యింది. అయితే ఆమె ఇంకా రెండేళ్ల చదువు సాగించాల్సి ఉంది. అయినా ఆమె చదువుని, మాతృత్వాన్ని రెండింటిని వదులుకోకుడదని గట్టిగా నిశ్చయించుకుంది. ఫైనలియర్‌ పరీక్షల టైంలో రూపా కుమార్తె వయసు కేవలం 25 రోజులు. 

అలానే బాలింతరాలిగా కాలేజ్‌కి వచ్చి పరీక్షలు రాసి మంచి మార్కులతో పాసయ్యింది. తన కూతురు పుట్టిన రోజున శస్త్ర చికిత్సకు సంబంధించిన చివరి పరీక్ష..మూడు గంటల్లో పరీక్ష రాసి వచ్చి తన కూతురు పుట్టిన రోజుని జరుపుకుంది రూపా. ఎక్కడ అటు కుటుంబ బాధ్యతలను, కెరీర్‌ పరంగా తన చదవుకి ఆటంకం రానివ్వకుండా రెండింటిని చాలచ‍క్యంగా బ్యాలెన్స్‌ చేసింది. అలా ఆమె 2022లో సర్టిఫైడ్‌ డాక్టర్‌ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కి సన్నద్దమవుతూనే డాక్టర్‌ వృత్తిని కొనసాగిస్తుంది. 

ఈ మేరకు రూపా మాట్లాడుతూ..మనం కోరుకున్నది చేయాలి అనుకుంటే ఎలాంటి స్థితిలోనూ వదిలిపెట్టని పట్టుదల ఉంటే అనుకున్నది సాకారం చేసుకోగలరు. అంతేగాదు ఆ పట్టుదలే ఆ ఆటంకాలు, అవాంతరాలని పక్కకు పోయేలా చేస్తుంది అని చెబుతోంది రూపా యాదవ్‌. చివరిగా ఎవ్వరికీ ఏది కష్టం కాదని, ప్రతిఒక్కరూ అన్ని సాధించగలరని అందుకు తానే ఓ ఉదాహరణ అని అంటోంది రూపా. రియల్లీ రూపా గ్రేట్‌ కదూ.! తన కలను సాకారం చేసుకుంది, అలాగే తన అత్తమామలకు, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టి మంచి పేరు తెచ్చుకుంది.

(చదవండి: సివిల్స్‌లో విజయం సాధించిన మిస్‌ ఇండియా ఫైనలిస్ట్‌! కోచింగ్‌ లేకుండా తొలి..)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement