పెళ్లీడుకొచ్చిన యువతులు.. వివాహం చేసుకొని భర్తతో సుఖ, సంతోషాలతో ఉండాలని కలలు కంటారు. అచ్చం అలాంటి అలోచనలతో యువకులు కూడా.. మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని భార్యతో సంతోషంగా జీవించాలనుకుంటారు. అంతే ఆనందంతో ఇటీవల ఓ యువకుడు పెద్దల సమక్షంలో ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. అంతా బాగానే జరిగిందనే లోపు ఆ యువతి చేసిన పనికి కుటుంబమంతా ఆస్పత్రి పాలైంది. పెళ్లైన రెండు రోజులకే ఇంటిల్లిపాదికి అన్నంలో విషం పెట్టి.. నగలు, డబ్బుతో అక్కడి నుంచి పరారైంది. ఈ ఘటనలో ఆలస్యంగా రాజస్తాన్‌లో వెలుగులోకి వచ్చింది.
జైపూర్ జిల్లా కోట్‌పుట్లీ ప్రాంతానికి చెందిన నందు పట్వా ఫిబ్రవరి 22న పూజారాణి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు వివాహమైన తర్వాత ఆమె అత్తగారి ఇంటి(నందు పట్వా ఇల్లు)కి వచ్చింది. వివాహం జరిగిన రెండు రోజులకు ఆమె వంట చేసి.. భర్త, అత్త, మామలకు అన్నం పెట్టింది. అయితే ఆమె చేసిన వంట తిన్న కుటుంబ సభ్యులు(భర్తతో సహా) స్పృహ కోల్పోయారు. వారు మరుసటిరోజు ఎంతకూ నిద్రలేవకపోవడంతో స్థానికులు తలుపులు పగలగొట్టి చూడగా అందరూ స్పృహ కోల్పోయి కనిపించారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆస్పత్రి పాలు కావడానికి గల కారణం తెలియగానే కోలుకున్న కుటంబసభ్యులు షాక్‌కు గురయ్యారు.
ఆ యువతి పక్కా ప్లాన్ వేసి.. విషం కలిసిన వంటను తాను తినకుండా భర్తతో పాటు అత్త, మామకు తినిపించింది. కుటుంబ సభ్యులు ఆ అన్నం తిని స్పృహ కోల్పోయిన తర్వాత ఇంట్లో ఉన్న నగలు, డబ్బు పట్టుకొని ఉడాయించింది. ఈ ఘటనపై నందు పట్వా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దొంగ వధువు పట్టుకోవడం కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సదరు యువతిని ఓ మధ్యవర్తి చూపించాడని, అతనికి సుమారు రూ. లక్ష ముట్టజెప్పినట్లు ఫిర్యాదులో నందు కుటుంబం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment