సీక్వెల్‌కు రెడీ అయిన హిట్‌ సినిమాలివే! | South Indian Tamil Upcoming Sequel Movies | Sakshi
Sakshi News home page

సీక్వెల్‌కు రెడీ అయిన హిట్‌ సినిమాలివే!

Published Fri, Oct 13 2023 12:03 AM | Last Updated on Fri, Oct 13 2023 12:23 PM

South Indian Tamil Upcoming Sequel Movies  - Sakshi

ఒక కథ హిట్టయితే... ఆ కథని కంటిన్యూ చేస్తే బాగుంటుందని ఆ కథలోని హీరో, ఆ కథని తెరకెక్కించిన దర్శకుడు, తీసిన నిర్మాత, చూసే ప్రేక్షకులు అనుకోవడం సహజం. కానీ ఆ కథను కొనసాగించడానికి స్కోప్‌ ఉంటేనే ఇంకో కథ రెడీ అవుతుంది. అలా కొనసాగింపుకి ఆస్కారం ఉన్న కొన్ని కథలు రెడీ అయ్యాయి. ఇలా తమిళంలో పదికి పైగా రానున్న చిత్రాల రెండో భాగం విశేషాలు తెలుసుకుందాం.  

సేనాపతి తిరిగొస్తున్నాడు 
కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఇండియన్‌’ (‘భారతీయుడు’ – 1996) బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసింది. ఎప్పట్నుంచో ఈ సినిమాకు సీక్వెల్‌ తీయాలని ప్లాన్‌ చేస్తున్న శంకర్‌ 2017లో ‘ఇండియన్‌ 2’ని ప్రకటించారు. షూటింగ్‌ సెట్‌లో జరిగిన ప్రమాదం, నిర్మాణపరంగా నెలకొన్న సమస్యలను అధిగమించుకుని, ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. లైకా ప్రోడక్షన్‌తో కలిసి ఉదయనిధి స్టాలిన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 1920 నేపథ్యంలో సాగే ‘ఇండియన్‌ 2’ వచ్చే ఏడాది విడుదల కానుంది.

‘ఆయిరత్తిల్‌ ఒరువన్‌ 2’ పోస్టర్‌

మూడు సీక్వెల్స్‌లో ధనుష్‌ 
పుష్కరకాలం క్రితం విడుదలైన ‘ఆయిరత్తిల్‌ ఒరువన్‌ (‘యుగానికి ఒక్కడు’ – 2010) సంచలన విజయం సాధించింది. కార్తీ, రీమా సేన్, ఆండ్రియా, పార్తిబన్‌ లీడ్‌ రోల్స్‌ చేయగా, సెల్వ రాఘవన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఆయిరత్తిల్‌ ఒరువన్‌  2’ను ప్రకటించి, హీరోగా తన తమ్ముడు ధనుష్‌ నటిస్తారని, 2024లో ఈ సినిమాను విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నామని తెలిపారు సెల్వ రాఘవన్‌. ఇంకా ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం కాలేదు. అలాగే హీరో ధనుష్‌–దర్శకుడు వెట్రిమారన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘అసురన్‌’, ‘వడ చెన్నై’ చిత్రాలకు వీరి కాంబినేషన్‌లోనే సీక్వెల్స్‌కి ప్లాన్‌ జరుగుతోందని సమాచారం. 

రెండు సీక్వెల్స్‌లో కార్తీ 
‘ఖైదీ’ (2019)గా కార్తీ సూపర్‌ హిట్టయ్యారు. లోకేశ్‌ కనగరాజ్‌ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రానికి సీక్వెల్‌ తీయాలనుకుంటున్నారు. మరోవైపు పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన ‘సర్దార్‌’ కూడా హిట్‌ ఫిల్మ్‌. ‘సర్దార్‌ 2’ కూడా దాదాపు ఖరారైంది. కార్తీ ప్రస్తుత కమిట్‌మెంట్స్‌ పూర్తి కాగానే ‘సర్దార్‌ 2’ మొదలవుతుంది. ఈలోపు రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కించనున్న  చిత్రాన్ని పూర్తి చేసి, ‘ఖైదీ 2’ సీక్వెల్‌ కథ రెడీ చేస్తారట లోకేశ్‌. అలాగే భవిష్యత్‌లో ‘జైలర్‌ 2’, కమల్‌హాసన్‌తో ‘విక్రమ్‌ 2’, ‘బీస్ట్‌ 2’ చిత్రాలను తెరకెక్కించే ఆలోచన కూడా లోకేశ్‌ కనగరాజ్‌కి ఉందట. 

‘తుప్పరివాలన్‌’లో విశాల్‌

మళ్లీ డిటెక్టివ్‌.. 
విశాల్‌ కెరీర్‌లో ఉన్న ఓ డిఫరెంట్‌ హిట్‌ ఫిల్మ్‌ ‘తుప్పరివాలన్‌’ (‘డిటెక్టివ్‌’ – 2017). మిస్కిన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో హిట్‌ సాధించింది. ఆ తర్వాత విశాల్, మిస్కిన్‌ల కాంబినేషన్‌లోనే ‘డిటెక్టివ్‌’కు సీక్వెల్‌గా ‘డిటెక్టివ్‌ 2’ను ప్రకటించారు. నిజానికి ‘డిటెక్టివ్‌ 2’ ఈపాటికే విడుదల కావాల్సింది. కానీ ఈ సీక్వెల్‌ స్క్రిప్ట్, బడ్జెట్‌ విషయాల్లో విశాల్‌కు, మిస్కిన్‌కు భేదాభిప్రాయాలు తలెత్తడంతో ‘డిటెక్టివ్‌ 2’ షూటింగ్‌ నిలిచిపోయింది. ‘డిటెక్టివ్‌ 2’కు తానే దర్శకత్వం వహించి, నటిస్తానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు విశాల్‌. ఈ సినిమా షూటింగ్‌ ప్రధానంగా విదేశాల్లో జరగనుంది. 

‘తని ఒరువన్‌’లో నయనతార, ‘జయం’ రవి

ఎనిమిదేళ్ల తర్వాత...  
‘జయం’ రవి కెరీర్‌లో ‘తని ఒరువన్‌’ (ఈ సినిమా తెలుగు రీమేక్‌ ‘«ధృవ’లో రామ్‌చరణ్‌ హీరోగా నటించారు) బ్లాక్‌బస్టర్‌. ‘జయం’ రవి అన్నయ్య, దర్శకుడు మోహన్‌ రాజా ఈ సినిమాను తెరకెక్కించారు. 2015లో విడుదలైన ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించాలని ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నారు మోహన్‌ రాజా. ఫైనల్‌గా ‘తని ఒరువన్‌’ విడుదలై, ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 28న సీక్వెల్‌ను ప్రకటించారు. తొలి భాగంలో నటించిన ‘జయం’రవి, నయనతారలే మలి భాగంలోనూ నటిస్తారు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్‌ ఆరంభం కానుంది. 

‘మాయవన్‌’లో సందీప్‌ కిషన్‌

మరో మాయవన్‌
ఐదేళ్ల క్రితం సందీప్‌ కిషన్‌ హీరోగా సీవీ కుమార్‌ దర్శకత్వంలో ‘మాయవన్‌’ అనే సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్‌ రూపొందిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ‘మాయవన్‌’కు సీక్వెల్‌గా  ‘మాయవన్‌ 2’  తీస్తున్నారు మేకర్స్‌. సందీప్‌ కిషన్, సీవీ కుమార్‌ కాంబినేషన్‌లోనే ఈ చిత్రం రూపొందుతోంది.  

‘సార్పట్ట’లో  ఆర్య

పరంపర కొనసాగుతోంది 
టెడ్డీ, సార్పట్ట పరంపర.. ఆర్య కెరీర్‌లో ఈ రెండూ సూపర్‌హిట్‌ సినిమాలే. అయితే ఈ రెండు చిత్రాలూ డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదల అయ్యాయి. అయితే ఈ రెండు సినిమాల సీక్వెల్స్‌ను మాత్రం వెండితెరపైనే చూపించనున్నారు. ‘సార్పట్ట పరంపర’కు దర్శకత్వం వహించిన పా. రంజిత్‌తోనే ఇటీవల ‘సార్పట్ట పరంపర 2’ను ప్రకటించారు ఆర్య. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ఆరంభం కానుంది.  ఇక దర్శకుడు శక్తి సౌందర్‌ రాజన్‌తోనే ‘టెడ్డీ’ సినిమా సీక్వెల్‌ను ఆర్య ప్లాన్‌ చేస్తున్నారని కోలీవుడ్‌ సమాచారం. 

‘7/జి...’లో రవికృష్ణ

బృందావన కాలనీ ప్రేమ 
దాదాపు 20 ఏళ్ల క్రితం వచ్చిన ‘7/జి బృందావన కాలనీ’ (2004) యూత్‌ని బాగా ఆకట్టుకున్న విషాద ప్రేమకథ. సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో రవికృష్ణ, సోనియా అగర్వాల్‌ జంటగా నటించిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌. కాగా, ‘7/జి బృందావన కాలనీ’కి సీక్వెల్‌ ప్లాన్‌ చేశారు సెల్వ రాఘవన్‌. తొలి భాగంలో హీరోగా నటించిన రవికృష్ణ మలి భాగంలోనూ నటిస్తారు. కథానాయిక పాత్ర కోసం ఇవానా, దర్శకుడు శంకర్‌ కుమార్తె అదితీ శంకర్‌ పేర్లను పరిశీలిస్తున్నారట. తొలి భాగాన్ని నిర్మించిన ఏఎమ్‌ రత్నం సీక్వెల్‌ని కూడా నిర్మించనున్నారు. 

జిగర్తాండ 2 
కోలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద 2014లో విడుదలైన సినిమాల్లో హిట్‌గా నిలిచినవాటిలో ‘జిగర్తాండ’ ఒకటి. సిద్ధార్థ్, బాబీ సింహా, లక్ష్మీ మీనన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌’ తెరకెక్కింది. రాఘవా లారెన్స్, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా దీపావళి సందర్భంగా విడుదల కానుంది. 

జెంటిల్‌మేన్‌ మారారు 
దర్శకుడు శంకర్‌ తెరకెక్కించిన తొలి చిత్రం ‘జెంటిల్‌మేన్‌’ (1993). యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ హీరోగా నటించారు. ఈ చిత్ర నిర్మాత కేటీ కుంజుమోన్‌ ఇటీవల ‘జెంటిల్‌ మేన్‌ 2’ని ్రపారంభించారు. అయితే ఈ సీక్వెల్‌కి దర్శకుడు, హీరో మారారు. ఏ. గోకుల్‌ కృష్ణ దర్శకత్వంలో చేతన్‌ శ్రీను హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీత దర్శకుడు.అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో అరుళ్‌ నిధి హీరోగా రూపొందిన ‘డిమాంటీ కాలనీ’కి సీక్వెల్‌ వీరి కాంబినేషన్‌లోనే రానుంది. ఇంకా సీక్వెల్‌ లిస్ట్‌లో మరికొన్ని చిత్రాలు ఉన్నాయి.   


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement