‘ఎంత ఇంజినీర్ అయితే మాత్రం.. విస్తరిలో ప్రాజెక్ట్ కట్టాలా?’ అన్నాడు చందర్. గతి తప్పిన ఆలోచనలతో నా చేయి నా ప్రమేయం లేకుండానే విస్తరిలో అన్నాన్ని ఇష్టమొచ్చినట్టు అక్కడక్కడా చిన్నచిన్న ముద్దలుగా పేర్చింది. ప్రతిదాన్నీ కళాదృష్టితో చూసే చందర్‌కి ఆ ముద్దలు ఇరిగేషన్ ప్రాజెక్టులా కనిపించడంలో తప్పు లేదనిపించింది. దానికి తోడు విస్తరిలో వడ్డించిన పప్పులో పప్పు కన్నా ఎక్కువున్న నీళ్ళు ఆ ముద్దల మధ్య నుండి ఎత్తు నుండి పల్లానికి ప్రవహిస్తున్న తీరు కూడా చందర్ మాటలను సమర్థిస్తున్నట్టుగా ఉంది.
‘అరేయ్.. విజ్జూ..’ అని చందర్ మళ్లీ నా భుజం తట్టడంతో ఊహల్లో నుండి బయటపడ్డ నేను త్వరత్వరగా భోజనం ముగించి అప్పుడే వేసిన పెళ్ళి పందిరి కింద మూలన ఉన్న కుర్చీలో ఒరిగి కూర్చున్నా. చూస్తుండగానే మండుటెండలో కూడా కునుకు పట్టేసింది.
నా పక్కన కూర్చుని, పెళ్ళి పందిరి కింద కునుకు తీస్తున్న నాకు నిద్రాభంగం చేస్తూ ‘పొద్దున్నుండి ఎందుకలా ఉన్నావ్?’ అంది నా భార్య శారద. ‘ఏమీ లేదు’ అన్నాన్నేను ఏదో ఉన్నట్టు. ‘ఈ రోజు డాన్స్ చేయాల్సొస్తుందనా!!’ నాకళ్ళల్లోకి చూస్తూ అంది తను. అడ్డంగా తలూపాను ‘కాదు’ అన్నట్టు. వెంటనే ఏదో అర్థం అయినట్టు ‘మన పెళ్ళికి తప్పించుకున్నావ్! మీ చెల్లి పెళ్లికి కూడా నోరు చేసి పక్కకు జరిగావ్. చివరికి నీ కొడుకు మొదటి పుట్టినరోజు.. మీ అమ్మతో నాకు చెప్పించి జారిపోయావ్.
కాని రేపు మా తమ్ముడి పెళ్ళి.. ఈరోజు రాత్రి హల్దీలో నేను డాన్స్ చేయాల్సిందే! నేను చేస్తే నువ్వూ నాతో పాటు చేయాలి. ఒకవేళ నువ్ చేయలేదనుకో.. ఆ గుంపులో ఎవడు నా చేయిపట్టుకుని డాన్స్ చేస్తే వాడితో వెళ్ళిపోతా’ అంది శారద నా చెవిలో మెల్లిగా. ఇంతకుముందు అయితే నన్ను డాన్స్ చేయమని అడగడానికి భయపడేది తను. బెదిరిస్తే వింటాడు అనుకుందో లేదా నన్ను బతిమిలాడి విసిగిపోయిందో తెలీదుగాని, నా మనసు చివుక్కుమనేలా మాట్లాడింది ఇప్పుడు.
ఏం చెప్పాలో తెలీక ‘సరే’ అన్నాను.. తన కళ్ళల్లోకి చూడకుండా నా కళ్ళల్లో పైకి ఉబికి వస్తున్న నీళ్ళను ఆపుకుంటూ. ఓ రెండు నిమిషాల తర్వాత ‘ఆ అన్నూ కూడా డాన్స్ చేస్తోంది బాబు..’ అంది శారద.. ఫోన్లో ఏదో డాన్స్ వీడియో చూస్తూ. అన్నూ.. నా అక్క కూతురు. తన వయసు రెండు సంవత్సరాలు. రెండు సంవత్సరాల పాపకు చేతనైంది కూడా నీకు చేతగాదా అన్నట్టు ఉన్నాయి శారద చూపులు, మాటలు. నేనేం మాట్లాడలేదు. కొన్నిసార్లు మౌనమే మేలు అనుకుని మౌనంగా ఉండిపోయాను. ఏమీ మాట్లాడకుండా ఉన్నానే గాని, రాత్రి జరగబోయే హల్దీ ఫంక్షన్ గురించిన ఆలోచనలతోనే నా మైండ్ అంతా నిండి పోయింది.
‘ప్రతి ఫ్యామిలీ ఫంక్షన్లో నేను చేయకున్నా తనొక్కతే డాన్స్ చేస్తుంది. కాని తమ్ముడి పెళ్ళి కాబట్టి ఈసారి నాతో జంటగా చేయాలనుకుని ముచ్చట పడుతోంది. నేను చేస్తే నాతో పాటు చేస్తుంది.. లేకపోతే..’ నా మెదడు ఆ ప్రశ్నను పూర్తిచేయడానికి కూడా ఇష్టపడలేదు. ఉండబట్టలేక, వెంటనే ‘నేను చేయకుంటే ఎవరితో చేస్తావ్?’ అంటూ అడిగాను శారదను.
ఓ ఐదుసెకన్ల నిశ్శబ్దం. అడిగానే గాని ఆమె వైపు నేను కూడా చూడలేదు. చూసే ధైర్యం లేదు. తను ఎప్పుడూ నన్ను అనే ‘నువ్వు పిరికివాడివి’ అన్న మాటలు ఇంకోసారి గుర్తొచ్చాయి. ఐదుసెకన్ల తర్వాత ‘నీలాంటి వాడితోనే’ అంది.. ఫోన్లోనే మొహం పెట్టి. ‘నాలా ఉంటాడా!!’ ‘అవును నీలాగే ఉంటాడు. కాని మొహంలో కళ ఉంటుంది. నీలా ఎప్పుడూ ఏదో కొల్పోయిన వాడిలా ఉండడు. నవ్వుతూ ఉంటాడు. నేనేం చెప్పినా కాదనడు.’ ‘నిజమా?’ ‘నీ మీద ఒట్టు బాబు!’ శారద గొంతులో వెటకారం, పెదవులపై ఆపుకుంటున్న నవ్వు.
ఆ మాటలతో నేల మీద ఓ కన్నీటి బొట్టు రాలింది. అది నాదే అని నేలతల్లికి కూడా తెలిసినట్టుంది.. ‘నేనైనా నీ పరువు కాపాడుతా’ అన్నట్టు ఓ రెండుసెకన్లలో దాన్ని తనలో కలిపేసుకుని మాయం చేసింది. ‘తమ్ముడితోనా.. ఉహూ అయ్యుండదు.. మరెవరు? ఎప్పుడూ వదినా వదినా అంటూ వెంటతిరిగే కిరణా? అవునేమో.. వాడు డాన్స్ బాగా చేస్తాడు. నాలా కాకుండా అందరితో ఇట్టే కలిసిపోతాడు. మంచి స్టైల్ మెయింటేన్ చేస్తాడు. ఫుల్ పోష్‌గా కనిపిస్తాడు. అన్నింటికీ మించి నాలా పిసినారి కాడు. ఆడవాళ్ళు ఇష్టపడే అన్ని లక్షణాలు ఉన్నాయి వాడిలో. అయితే మాత్రం నా శారు..’ అంటూ నా మెదడు మళ్ళీ తనకు తానే ప్రశ్నలు వేసుకుంది.
తన కుడి చేతితో ఎవరి చేయినో గట్టిగా పట్టుకుంది శారు. నా హృదయం తట్టుకోలేక పోయింది. కాళ్ళు ఒక్కసారిగా వణికాయి. ‘నేను పిరికివాణ్ణి కాదు’ అని నాకు నేను చెప్పుకుని. ధైర్యం తెచ్చుకుని తలకొద్దిగా పైకిలేపేసరికి అక్కడ కనిపించింది చూసి ఆశ్చర్యపోయాను.
శారు ‘వేరేవాడితో వెళ్ళిపోతా’ అన్న మాటలు నా మనసుని ముక్కలు చేస్తే, బాధతో నాకు నేను వేసుకుంటున్న ప్రశ్నలు నా మెదడుని మొద్దుబార్చేశాయి. వెంటనే ఒక్కసారిగా కళ్ళు మూతలు పడ్డాయి. దానికితోడు అస్పష్టంగా కిరణ్ గొంతు మళ్ళీ ‘వదినా.. వదినా’ అంటూ ఎక్కడో వినిపించడంతో.. ఒక్కసారిగా విచక్షణ జ్ఞానం కోల్పయినట్టయింది.
కుర్చీలో ఉన్న నాకు, సినిమాలో లాగా చేయి నేలకు తాకించగానే ఏదో రాయిలాంటి ఆయుధం దొరికింది. అంతే ఒక్కసారిగా పిడికిలి బిగించి.. పళ్లుకొరికి ఉన్న శక్తినంతా కూడదీసుకుని ‘రేయ్..’ అంటూ పైకి లేచి చేతిలో ఉన్న రాయిని విసురుగా విసిరేశాను... బరువుగా కళ్ళు తెరిచేసరికి అంతా చీకటి.. ‘నేను శారుని చూసి బాధపడకూడదని నా కాళ్ళు తీసేశారా?’ అతికష్టం మీద అనగలిగాను.
‘అబ్బబ్బ.. డాన్స్ చేయాల్సొస్తుందని ఇంత నాటకాలెందుకురా?’ అంది నా చెల్లి సోని.. రూమ్‌లో లైట్‌వేస్తూ. నా కాలికి చిన్న కట్టు కనిపించింది. ‘ఏంటీ ఇది?’ అని అడిగితే.. ‘ఏంటా? చూడు ఎంత అమాయకుడిలా అడుగుతున్నావో అన్నయ్యా.. బాగా తిని నీ బావమరిది పెళ్ళి పందిరి కింద కుర్చీలో కూర్చుని.. కుంభకర్ణుడిలా నిద్రపోయావా మధ్యాహ్నం అంతా! అదే వింత అనుకుంటే.. ఇంకో వింతలా వదిన చిన్న డాన్స్ చేయమంటే కళ్ళు మూసుకుని దయ్యం పట్టినట్టు ఏదేదో వాగావ్! ఆ తర్వాత ఇదిగో ఈ రాయితో నీ కాలిని నువ్వే పొడుచుకున్నావ్. నీ పిరికితనంతో మా పరువు తీస్తున్నావ్ రా అన్నయ్యా..’ అంటూ రాయి చూపించింది.
అందరూ నన్నే నిందిస్తున్నట్టు అనిపించి తట్టుకోలేకపోయాను. అందుకే ‘నేను ఈరోజు డాన్స్ చేయకపోతే మీ వదిన వేరేవాడితో డాన్స్ చేస్తా అందిరా!’ అన్నాను. ‘అవునా.. ఆ అందగాడి పోలికలు కూడా చెప్పి ఉంటుందే!’ ‘అవును.. నీకేలా తెలుసు?’ ఆశ్చర్యపోయాన్నేను. ‘వాడు నాక్కూడా రెండేళ్ళ నుండి తెలుసు. రా చూపిస్తాను ఆ అందగాడిని!’ అంటూ సోని నన్ను మెల్లిగా వాకిట్లోకి తీసుకెళ్ళింది.
వాకిలి మొత్తం రంగురంగుల లైట్లతో మెరిసిపోతుంటే.. డీజే పాటలకు బంధువులు అందరూ ఊగిపోతున్నారు. నా కళ్ళు మాత్రం నా శారు కోసం ఆత్రంగా వెతికాయి. నరాలు తెగే ఉత్కంఠలాగా అనిపించింది. అందరి మొహాలకు పసుపు ఉండడంతో శారుని అంతమంది మధ్యలో గుర్తుపట్టలేక పోయాను. ఇంతలో ‘అదిగో వదిన’ అంటూ సోని గుంపు మధ్యలోకి చేయి చూపించింది. ఆ చేయి వెంబడి చూసిన నాకు.. అదిగో అక్కడ కనిపించింది నా శారు.
అందరితో కలిసి నవ్వుతూ.. తన తమ్ముడి పెళ్ళికి ఉత్సాహంగా డాన్స్ చేస్తోంది. కానీ నా దృష్టి తను పట్టుకున్న చేయి వైపు మళ్ళింది. తన కుడి చేతితో ఎవరి చేయినో గట్టిగా పట్టుకుంది శారు. నా హృదయం తట్టుకోలేక పోయింది. కాళ్ళు ఒక్కసారిగా వణికాయి. ‘నేను పిరికివాణ్ణి కాదు’ అని నాకు నేను చెప్పుకుని. ధైర్యం తెచ్చుకుని తలకొద్దిగా పైకిలేపేసరికి అక్కడ కనిపించింది చూసి ఆశ్చర్యపోయాను.
‘అదిగో ఆ అబ్బాయే.. వదిన డాన్సింగ్ పార్ట్‌నర్’ అంది సోని నా రెండేళ్ళ కొడుకుని చూపిస్తూ. అప్రయత్నంగా నా కళ్ళ నుండి నీళ్ళు.. నోటి నుండి ‘శారు’ అన్న మాట బయటకొచ్చింది. వినిపించినదానిలా నా వైపు చూసిన శారు ఓ నవ్వు నవ్వింది. ఆ నవ్వు ‘ఇంత అమాయకుడివైతే ఎలా బాబు’ అని నన్ను ప్రశ్నిస్తున్నట్టనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment