
తీసింది రెండే రెండు సినిమాలు. స్టార్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరడంతోనే ప్రశాంత్ నీల్ ఆగిపోలేదు. కె.జి.యఫ్ లాంటి క్రేజీ ప్రాజెక్టుతో పాన్‌ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. కేవలం డబ్బు సంపాదన కోసమే సినిమాలు తీయాలనే ఆలోచనతో ఫిల్మ్‌మేకింగ్ కోర్సులో చేరాడు ప్రశాంత్. అయితే.. సినిమా అనే సముద్రం యొక్క లోతు అతని ఆలోచనని మార్చేసింది. ఎలాగైనా కన్నడ సినిమాను ఏలేయాలన్న కసితో అడుగులు వేయించింది.
మొదట్లో రెండు, మూడు చిన్న సినిమాలకు స్క్రీన్‌ప్లే రైటర్‌గా పని చేశాడు. ఆ టైంలోనే సొంతంగా ఓ కథ రాసుకుని సినిమా తీయాలనుకున్నాడు. కొత్తవాడు.. పైగా ‘రొటీన్’ కథ. అందుకే హీరోలెవరూ కాల్షీట్లు ఇవ్వలేదు. దీంతో తన బావ, హీరో శ్రీమురళిని పెట్టి సినిమా తీశాడు ప్రశాంత్. రిజల్ట్.. ‘ఉగ్రం’(2014) హిట్ టాక్‌తో కన్నడనాట ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ మూవీతోనే ఊరమాస్ డైరెక్టర్‌గా ప్రశాంత్‌కి పేరొచ్చింది.
షోలే ఇన్‌స్పిరేషన్‌తో..
‘ఉగ్రం’ తరువాత ప్రశాంత్‌తో సినిమా చేస్తామని అడిగినోళ్లంతా కన్నడ స్టార్ హీరోలే. కానీ, ఈ సైలెంట్ డైరెక్టర్ మాత్రం హీరోల బాడీలాంగ్వేజ్‌కి తగ్గట్లే కథ రాసుకుంటాడు. అందుకే అప్పటికే యశ్ కోసం కె.జి.యఫ్ స్టోరీ రెడీ చేసుకున్నాడు. ఈ కథకి ప్రశాంత్‌కి ఇన్‌స్పిరేషన్ ఇచ్చింది బాలీవుడ్ కల్ట్‌క్లాసిక్ ‘షోలే’. 70వ దశకంలో హిందీ సినిమాలు తనలో ఎంతో మార్పులు తీసుకొచ్చాయని, సినిమాను చూసే విధానంలో తనలో మార్పులు తీసుకొచ్చాయని, కె.జి.యఫ్ కథ తయారు చేసుకోవడంలో స్ఫూర్తి ఇచ్చిందని నీల్ అంటున్నాడు.
ప్రత్యేకించి ఆ టైంలో యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా పేరున్న అమితాబ్ బచ్చన్ స్ఫూర్తితోనే యశ్ రాకీ క్యారెక్టర్‌ను తీర్చిదిద్దానని నీల్ తెలిపాడు.
భారీ బడ్జెట్.. అయినా వెనకడుగు వేయలేదు
నిజానికి మొదట ఒక ఫ్యామిలీ స్టోరీతో ప్రొడ్యూసర్ విజయ్ కిరగండూర్(హోంబల్ ఫిల్మ్స్)ని అప్రోచ్ అయ్యాడు ప్రశాంత్. ఫైనల్‌గా భారీ బడ్జెట్ కథ కె.జి.యఫ్తో కన్విన్స్ అయ్యారు. కన్నడలో కోలార్ బంగారు గనుల మీద ఇంతదాకా ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే ‘కాంట్రవర్సీల’ భయాన్ని లెక్కచేయకుండా డేర్‌గా ప్రశాంత్–విజయ్–యశ్‌లు ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించారు.
ఐదు భాషల్లోనూ భారీ సక్సెస్‌తో కన్నడ సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది. అంతేకాదు అప్పటిదాకా హయ్యెస్ట్ కలెక్షన్ల కరువుతో ఉన్న శాండల్‌వుడ్ దాహాన్ని కె..జి.యఫ్ ఛాప్టర్–1తో తీర్చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.
#KGF first look @NimmaYash #HombaleFilms #PrashanthNeel #Massssss pic.twitter.com/xWjXR0Apfg
— Karthik Gowda (@Karthik1423) May 3, 2017
సగం బలం అతనే!
అమ్మ సెంటిమెంట్, పవర్‌ఫుల్ డైలాగులు, హీరో ఎలివేషన్, సినిమాకు తగ్గట్లు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ, నటన, టేకింగ్.. ఇవన్నీ ఒక వైపు ఉంటే.. సంగీతం ఈ సినిమాకు మిగతా సగం బలం. ప్రశాంత్ నీల్ తీసిన మూడు సినిమాలకు(కె.జి.యఫ్ ఛాప్టర్–2తో కలిపి).. ప్రభాస్‌తో తీయబోయే ‘సలార్’కి మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కరే. అతని పేరు రవి బస్రూర్. రవికి తన రెండో మూవీ ‘ఉగ్రం’తోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరొచ్చింది.
అయితే వీళ్లిద్దరి కాంబో మూవీస్ సక్సెస్‌లో మ్యూజిక్ మామూలు రోల్ పోషించదు. ప్రత్యేకించి సీన్ ఎలివేషన్ కోసం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం ప్రాణం పెడతాడు రవి. ఆ అవుట్‌ఫుల్ జనాలను సీటు అంచుకి తీసుకొస్తుంది కూడా.
కె.జి.యఫ్ ఛాప్టర్ 2 రిలీజ్ సందర్భంగా.. సాక్షి వెబ్ ప్రత్యేకం
Comments
Please login to add a commentAdd a comment