‘తపాలా బండి గంటల చప్పుడుకు ఏ పడుచు పిల్లయినా నిద్ర లేచినా మళ్లీ అటు తిరిగి పడుకుని తియ్యటి కలలు కంటుంది’ అని ఉంటుంది చెహోవ్ రాసిన ‘ఒక చలి రాత్రి’ కథలో! ఊహించండి. దట్టమైన చలికాలం. రాత్రి మూడు గంటల సమయం. ఏ వెధవ ప్రాణమైనా ముడుక్కుని పడుకుని కాసింత సుఖాన్ని అనుభవించే వేళ. ఒడలు మరిచే వేళ. వెచ్చదనమూ భోగమే అని భావించే వేళ.
పొట్టకూటి కోసం, రోజూ చేయాల్సిన పని కోసం తపాలా మూటలను బగ్గీలో వేసుకుని స్టేషనుకు చేర్చక తప్పని మెయిల్‌మేన్ మనసులో ఎలా ఉంటుంది? నిశ్శబ్దాన్ని కప్పుకొని గాఢ సుషుప్తిలో ఉన్న ఊరి వీధుల గుండా అతడొక్కడే చలికి వణుకుతూ, కన్ను పొడుచుకున్నా కానరాని చీకటిలో వెళుతూ ఉంటే అతడి అంతరంగ జగాన ఏముంటుందో ఆ సమయాన ఇళ్లల్లోని గదుల్లో రగ్గుల చాటున శయనిస్తున్న మనుషులకు తెలుస్తుందా?
శ్రీమంతులు కూడా భలే వాళ్లులే! చలి రాత్రుళ్లలో వారికి మజాలు చేయాలనిపిస్తుంది. అతిథులను పిలవాలనిపిస్తుంది. పార్టీలూ గీర్టీలూ. పనివాళ్లను తొందరగా ఇళ్లకు పోండి అంటారా ఏమి? లేటు అవర్సు వరకూ పని చేయాల్సిందే! బయట చలి ఉంటుంది. పాకల్లో పసిపిల్లలు ‘కప్పుకోవడానికి ఇవాళైనా దుప్పటి కొనుక్కుని రా నాన్నా’ అని కోరడం గుర్తుకొస్తూ ఉంటుంది. ఒంటి మీదున్న ఈ కనాకష్టం బట్టలతో ఇంతరాత్రి చలిలో ఇంటికి ఎలా చేరాలనే భీతి ఉంటుంది.
వెచ్చటి ద్రవాలు గొంతులో ఒంపుకునే శ్రీమంతులు ‘ఒరే... ఆ రగ్గు పట్టుకుపో’ అంటారా? ‘ఈ పాత స్వెటరు నీ కొడుక్కు తొడుగు’ అని దయతో పారేస్తారా? ఆ సోయి ఉంటే కొందరు ఎప్పటికీ శ్రీమంతులు కాలేరు. పాపం పనివాడు రంగడు పార్టీలో యజమాని ఉండగా ఆ అర్ధరాత్రి రగ్గు దొంగిలిస్తాడు. పేదవాణ్ణి దొంగను చేసింది లోపలి పెద్దమనిషా... బయటి చలా? డి.వెంకట్రామయ్య ‘చలి’ కథ ఇది.
దర్శకుడు బి.నరసింగరావు కథలు కూడా రాశారు. ‘చలి’ అనే కథ. నగరానికి వచ్చిన వెంటనే మొగుడు పారిపోతే ఆ వలస కూలీ చంకన బిడ్డతో వీధుల్లో తిరుగుతూ చలిరాత్రి ఎక్కడ తల దాచుకోవాలా అని అంగలారుస్తుంటుంది. అక్కడ నిలబడితే ఎవరో కసురుతారు. ఇక్కడ నిలబడితే ఎవరో తరుముతారు. నోరూ వాయి లేని చెట్టు ‘పిచ్చిదానా... నిలుచుంటే నిలుచో. నీకేం వెచ్చదనం ఇవ్వలేను’ అని చిన్నబోతూ చూస్తుంది.
చెట్టు కింద తల్లీబిడ్డా వణుకుతుంటారు. చలి. చెట్టు కింద తల్లీ బిడ్డా కొంకర్లు పోతూ ఉంటారు. శీతలం. చెట్టు సమీపంలోని చాటు అటుగా వచ్చి ఆగిన కారులోని యువతీ యువకులకు మంచి ఏకాంతం కల్పిస్తుంది. బయట చలి మరి. ఒకే తావు. చెట్టు కింద చావుకు దగ్గరపడుతూ తల్లీబిడ్డ. అదే తావులో ఏమీ పట్టని వెచ్చని సరస సల్లాపం. చలి ఒకటే! బహు అర్థాల మానవులు.
శతకోటి బీదలకు అనంతకోటి ఉపాయాలు. పేదవాడు బతకాలంటే నోరు పెంచాలి. లేదా కండ పెంచాలి. కండ పెంచిన మల్లయ్య రైల్వేస్టేషన్ దగ్గర సగం కట్టి వదిలేసిన ఇంటి వసారాను ఆక్రమించుకుంటాడు. తక్కిన కాలాల్లో దాని వల్ల లాభం లేదు. చలికాలం వస్తే మాత్రం రాత్రిళ్లు తల దాచుకోవడానికి అలగా జనాలు ఆ వసారా దగ్గరికి వస్తారు. తలకు ఒక్కరూపాయి ఇస్తే వెచ్చగా పడుకునేందుకు చోటు.
కొందరి దగ్గర ఆ రూపాయి కూడా ఉండదు. దీనులు. పేదవాడు మల్లయ్య దయ తలుస్తాడా? తరిమి కొడతాడు. లేచిన ప్రతి ఆకాశహర్మ్యం నా ప్రమేయం ఏముందని నంగనాచి ముఖం పెట్టొచ్చుగాని అది ఎవడో ఒక పేదవాడిలో మంచిని చంపి రాక్షసత్వం నింపుతుంది. వి. రాజా రామమోహనరావు ‘చలి వ్యాపారం’ కథ ఇది.
చలిరాత్రి ఎప్పటికీ అయిపోదు. అది పేదవాళ్లకు తామెంత నగ్నంగా జీవిస్తున్నారో గుర్తు చేయడానికే వస్తుంది. చలికి వణికే కన్నబిడ్డల్ని చూపి బాధ పెట్టడానికే వస్తుంది. మనందరం మధ్యతరగతి వాళ్లమే. ఇంటి పనిమనిషిని అడుగుదామా ‘అమ్మా... నీ ఇంట ఒక గొంగళన్నా ఉందా... పిల్లలకు ఉన్ని వస్త్రమైనా ఉందా?’.... ‘చలికి వ్యక్తి మృతి’ అని వార్త.
మనిషి చలికి ఎందుకు చనిపోతాడు? ప్రభుత్వం అతనికి ఇస్తానన్న ఇల్లు ఇవ్వకపోతే, ఇల్లు ఏర్పాటు చేసుకునేంత ఉపాధి చూపకపోతే, నీ దిక్కులేని బతుకును ఇక్కడ వెళ్లదీయమని వింటర్ షెల్టరైనా చూపకపోతే, తన నిర్లక్ష్యాన్ని తోడు చేసుకుని చలి హత్యలు చేయగలదని గ్రహించకపోతే అప్పుడు ఆ వ్యక్తి ‘చలికి చనిపోయిన వ్యక్తి’గా వార్తలో తేలుతాడు. విలియమ్ సారోయాన్ అనే రచయిత రాస్తాడు– చలి నుంచి కాపాడటానికి కనీసం శవాల మీదున్న వస్త్రాలనైనా తీసివ్వండ్రా అని! అతని కథలో ఒక యువకుడు ఆకలికి తాళలేక ఓవర్‌కోట్ అమ్మి చలితో చచ్చిపోతాడు.
పగిలిన గాజుపెంకుతో కోసినట్టుగా ఉంటుందట చలి. అదంత తీవ్రంగా ఉండేది మను షుల్లో నిర్దయను పెంచడానికా? కాదు! దయను పదింతలు చేయడానికి! పాతదుప్పట్లో, పిల్లలు వాడక వదిలేసిన స్వెటర్లో, నాలుగు కంబళ్లు కొనేంత డబ్బు లేకపోలేదులే అని కొత్తవి కొనో వాటిని స్కూటర్లో, కారులో పడేసి ఆఫీసు నుంచి వచ్చేప్పుడు ఒక్కరంటే ఒక్కరికి ఇచ్చి వస్తే ఎలా ఉంటుందో ఈ చలికాలంలో చూడొద్దా? ఉబ్బెత్తు బ్రాండెడ్ బొంతలో నిద్రపోయే వేళ మన చేతి ఉన్నివస్త్రంతో ఒక్కరైనా నిద్ర పోతున్నారన్న భావన పొందవద్దా? అదిగో... అర్థమైందిలే... మీరు అందుకేగా లేచారు!
మీ చేతి ఉన్నివస్త్రం
Published Mon, Nov 25 2024 12:12 AM | Last Updated on Mon, Nov 25 2024 12:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment