చాలా చిన్న విషయమే ఇది. ఏం లేదు... ఫలానా ఊళ్లో నివసించే ఒక రచయిత తన ఊళ్లో పూర్తిగా గుంతలు పడ్డ రోడ్లు చూసి ‘చిల్లుల కంబళి’ అనే కథ రాయాలనుకున్నాడు. కొంచెం వ్యంగ్యం రాయగలడు. మాట విరుపులో అందె వేసిన చేయి. ఈ గుంతలకు కారకులెవరో నేరుగా చెప్పకుండా కాకినీ, పిచ్చుకనూ పాత్రలుగా చేసి మొత్తం కథ చెప్పేయగలడు. అయినా సరే చిన్న సంశయం వచ్చింది. కథ ఎట్లాగూ తన ఊళ్లోని ఘోరమైన రోడ్ల గురించి.
మరి అచ్చయ్యాక మునిసిపల్ కమిషనర్ గారికి ఈ కథ ఎవరైనా చూపిస్తేనో! ఎం.ఎల్.ఏ సముఖాన ఎవరైనా చదివి వినిపిస్తేనో! పార్టీ కార్యాలయంలో ఔత్సాహికులైన కార్యకర్తలు దీనిని రెడ్‌ఇంక్‌తో మార్క్ చేస్తేనో! పాఠకులు చదివి ధర్నాకు ప్లాన్ చేస్తారని పోలీసు వారికి సందేహం వస్తేనో! ఎందుకొచ్చిన గొడవ. ‘చిల్లుల కంబళి’ని మూల పడేశాడు. ఆ తర్వాత ఏ కథా రాయలేక పోయాడు. రైటర్స్ బ్లాక్.
‘ఎక్స్’ మతం, ‘వై’ మతం, ‘జడ్’ మతం గురించి ఒక రచయిత ఎంతో అధ్యయనం చేశాడు. మతాల సకారాత్మక, నకారాత్మక చర్యలను, ప్రపంచవ్యాప్తంగా వాటి మధ్య ఘర్షణను, దరిమిలా స్థానిక ప్రతిఫలనాలను విశదం చేసే 500 పేజీల నవల రాయదలిచి మూడు సంవత్సరాలు సెంట్రల్ లైబ్రరీలో మెటీరియల్ కోసం కూసాలు కదుల్చుకున్నాడు. మతాల కంటే ముందు మనిషే ఉంటా డని మనిషిని దాటి దాటి దాటి మతాల దగ్గరకు రావాలని తన నవలకు ‘ఏ టు ఆర్’ అని పేరు పెట్టుకున్నాడు.
నవల చివరలో మార్క్స్‌ను ప్రస్తావిస్తూ ‘మతం ఒక మత్తుమందు’ అని కూడా రాస్తా డట. మిత్రుడు అంతా విని తక్కిందంతా ఓకేగాని ఈ చివరి వాక్యాన్ని పట్టుకుని తమ వ్యాపారాన్ని దెబ్బ తీసేందుకే ఈ నవల రాశావని ‘డిస్టిలరీల జాతీయ సమాఖ్య’ వ్యాజ్యం వేస్తే ఏం చేస్తావ్? అన్నాడు. అంతే. సదరు రచయిత ఆ నవలను అటక ఎక్కించేశాడు. తర్వాత ఏమీ రాయలేదు. రైటర్స్ బ్లాక్.
‘సగటు పట్టణం’ అనే పట్టణానికి ఢిల్లీ ఎంతో దూరమైనా నిజానికి ఢిల్లీ దూరంగా లేదని అక్కడ నివసించే మరొక రచయితకు తెలిసొచ్చింది. అతడు రాయదలిచింది ‘హాయి నడక’ అనే కథను! అందులో పెట్రోలు పోయించుకోలేక ఒక సగటు ఉద్యోగి స్కూటర్ మాని ఆఫీసుకు నడక మీద వెళ్లడం మొదలెడతాడు. తొలత ఇబ్బందిగా ఉన్నా తర్వాత నడకలో ఏదో హాయి ఉందని గ్రహిస్తాడు. దారిలో తన లాంటి వాళ్లే పదిమంది కలవడంతో వారి మధ్య స్నేహం చిగురిస్తుంది.
వారంతా వాట్సప్ గ్రూప్ పెట్టుకుంటారు. ఈ కథ అచ్చుకు ముందు చదివిన విమర్శక మిత్రుడు ‘మంచి కథే గాని స్నేహానికి కొత్త వార«ధే గాని వాళ్లంతా ఎప్పుడైతే వాట్సప్ గ్రూప్ పెట్టారో అప్పుడే దేశానికి ప్రమాదకరంగా మారారు. కథ అచ్చయ్యాక కేంద్ర జాగరూకత సంస్థ వచ్చి దేశ సార్వ భౌమత్వానికి విఘాతం కలిగించడానికే ఆ పది మందీ వాట్సప్ గ్రూప్ పెట్టుకున్నారని అంటే కాదని ఎలా నిరూపిస్తావ్’ అన్నాడు. కథ చిరిగిపోయింది. ప్రస్తుతం ఆ రచయిత సగటు పట్టణంలో సగటు బతుకు బతుకుతున్నాడు. రైటర్స్ బ్లాక్.
దుప్పి పిల్లల్ని, అప్పుడే పుట్టిన లేడి కూనల్ని నోట కరిచి అవి ఆర్తనాదాలు చేస్తున్నా నిశ్చలంగా ఉండగలిగే పులులను ‘క్షమాభిక్ష’ పేరుతో బోన్ల నుంచి విడిచి పెడతారు. పర్యావరణ హితం కోరే ఒక రచయితకు కథ రాయాలనిపిస్తుంది. రాయలేడు. మిట్ట మీద ఉండే వర్గం వారు పల్లంలో ఉండే వర్గం వారికి కంచె కట్టి ఇబ్బంది పెడతారు. హింసిస్తారు. వివక్షను నిరసించే ఒక రచయితకు కథ రాయాలనిపిస్తుంది. రాయలేడు. కోర్టుకెక్కిన ఫలానా ప్రజావ్యాజ్యంలో న్యాయం ఇదేనని అందరికీ తెలిసినా తీర్పు ఎందుకు ఆలస్యమవుతోంది అని ఒక రచయితకు అసహనం కలుగుతుంది.
కథ రాయాలనుకుంటాడు. రాయలేడు. ఆడవాళ్ల బాధలు, ఆదివాసుల బాధలు, ఉద్యోగాలు రాక ఖర్చులకు డబ్బులు లేక కటకటలాడే నిరుద్యోగుల వేదనలు, పేదల పెను ఆర్తనాదాలు, మూలకు నెట్టివేయబడేవారి మూల్గులు, తల్లితండ్రుల చేత చిక్కి ర్యాంకుల వేటలో అల్లాడుతున్న పిల్లల శోకాలు, విస్తారమైన దేశ సంపదలో ఆవగింజంత భాగం కూడా దొరకని కోట్లాది దీనుల మాట పడిపోవడాలు, 12 గంటల చాకిరీకి పొందే చిల్లర జీతాల దీనుల ఈసురోలు, పెను సర్పాలను పట్టి చంపే శక్తిని మరిచిన చలిచీమల మతిమరుపులు... ఇవి కథలు రాయాలని ఉంటుంది చాలామంది రచయితలకు. కానీ రాయలేకపోతున్నారు. రైటర్స్ బ్లాక్.
మామూలుగా అయితే ఏదైనా రాయాలనుకుని రాయలేకపోవడం, రాసేందుకు ఆలోచన, ఆసక్తి సన్నగిల్లిపోవడాన్ని ‘రైటర్స్ బ్లాక్’ అంటారు. కాని సత్యం çపలకక పోవడం వల్ల, పలకలేని వాతావరణం ఉండడం వల్ల బలవంతపు రైటర్స్ బ్లాక్‌కు నేడు రచయితలు గురవుతున్నారు. రచయితలు అప్రియమైన సత్యాలు పలికేది జనం పట్ల ఉన్న ప్రియత్వం వల్లే! పాలకుల పట్ల ఉన్న బాధ్యత వల్లే! సత్యం వినే ఓర్పు ఉండాలి. సత్యం లేని చోట చీకటి చోటు చేసుకుంటుంది.
సరే! మరి రైటర్స్ బ్లాక్ రిస్క్ వద్దనుకునే వారికి రాయడానికి ఏం మిగులుతాయి? ఎన్నో! శృంగార కథలు, ఉద్రేక నవలలు, నేరగాథలు, అత్తాకోడళ్ల కీచులాటలు, వెకిలి హాస్యాలు, కాలక్షేప బఠాణీలు, కన్నీటి చుక్కకుగాని ఆలోచనా వీచికకు గాని వీలు లేని శుష్క వైకల్యాలు. జాతి సత్యం వైపు ఉండాలా? శుష్కతలో మునిగి తేలాలా? ఎచ్చట రైటర్స్ బ్లాక్ లేకుండా ఉండునో... అచ్చట ధర్మం ఒక పాదానైనా నడుచును!!
Comments
Please login to add a commentAdd a comment