ఇదో కథ. తరతరాలుగా తెలిసిందే. ఎంతోమంది రాజకీయ నేతలకు తరచూ అనుభవంలోకి వచ్చిన కథే. తరం తర్వాత తరం... ఇలా తర్వాతితరానికి తెలియాలనే ఉద్దేశంతో విచిత్ర వింత తంత్ర, కాతంత్ర, కుతంత్ర, బహుళతంత్రాలు రాసిన మహామునుల్లాంటి రాజకీయ విశ్లేషకులు దీన్ని గ్రంథస్థం చేసిన కథ. కేవలం ప్రైవేట్ సర్క్యులేషన్‌లో ఉంచిన ఈ ఓపెన్ సీక్రెట్‌గాథ సారాంశమేమిటంటే...
అనగనగనగా ఓ రాజకీయనేత. రాజులాంటి ఆ రా.కీ. నేతకు ఏడుగురు కొడుకులు. ఓ రోజున రా.కీ. నేత ఇలా అన్నాడు. ‘‘కుమారులారా... ఎన్నాళ్లు నా పంచనబడి ఇలా బతికేస్తారు. ఇక మీరు కూడా స్వతంత్రంగా ఓటర్లకు గాలమేసి, వాళ్లను చేపల్లా పట్టుకునే టైమొచ్చింది’’ అని చెప్పాడు. ఇలా చెబుతూనే..ఓటర్ల ను చేపల్లా పట్టేసి, తమ ‘బుట్టలో పడేయడానికి’ ఏమేమి ఎర వేయాలో, ఎలాంటి ఎరలు వాడాలో లాంటి టెక్నిక్స్ కూడా వివరించాడు.
ఏడుగురు కొడుకులూ గేలాలు తీసుకుని, ఓటర్ల వేటకు బయల్దేరారు. (ఒకడైతే మరీనూ. చేపల్లాంటి తన ఓటర్లను తాను ‘కాల్చుకు తినడాని’కంటూ ఓ ప్రెషర్ కుక్కర్‌నూ వెంట తీసుకొని బయల్దేరాడు. సదరు కుక్కరు..చేపల్నీ వండుతుంది, పనిలోపనిగా అది వేసే విజిళ్లతో తనకు ఎంకరేజ్‌మెంటూ దక్కుతుందనేది అతడి వాదన. ఒకే పనిలో బహుళ ప్రయోజనాల కోసం ప్లానింగ్ చేసే, అలాంటివాడే తనకు సరైన వారసుడంటూ మురిసిపోతాడా నేత. అది వేరే కథ). ఆరుగురు రా.కీ.నేత కుమారులకు ఓటర్లు పడ్డారుగానీ... ఒకడికి మాత్రం పడలేదు. అప్పుడా రా.కీ.నేత కుమారుడిలా ప్రశ్నించాడు.
‘‘ఓటరూ..ఓటరూ..నా గేలానికి నువ్వు ఎందుకు పడలేదు?’’
‘‘నువ్వు నీ గేలానికి డబ్బు ఎరగా వేయలేదు’’
అతడు మళ్లీ తన పీఏ దగ్గరికెళ్లి అడిగాడు.
‘‘పీయ్యే..పీయ్యే.. గేలానికి ఎరగా డబ్బును ఎందుకు పెట్టలేదు?’’
‘‘అదే టైముకు ఈడీ, ఇన్‌కమ్‌ట్యాక్సు వాళ్లు దాడులు చేసి, డబ్బు ఫ్రీజ్ చేశారు’’ అని జవాబిచ్చాడు పీయ్యే.
ఈసారి రా.కీ. నేత కుమారుడు ఈడీ, ఇన్‌కమ్‌ట్యాక్స్ వాళ్ల దగ్గరికి వెళ్లి అడిగాడు.
‘‘ఈడీ వాళ్లూ, ఐటీ వాళ్లూ... మా మీద దాడి ఎందుకు చేశారు?’’
‘‘మా పైవాళ్లు మాకు ఆదేశాలు ఇచ్చారు’’ చెప్పారు ఈడీ, ఐటీ సిబ్బంది.
‘‘పైవాళ్లూ..పైవాళ్లూ..ఇలా ఆదేశాలు ఎందుకిచ్చారు?’’
‘‘సార్... మేమేముంది చిన్న చీమల్లాంటి వాళ్లం. మీకు అధిష్టానం ఉన్నట్లే మాకు ప్రధానమైన పైపైవాళ్లు ఒకరుంటారు. వారిని కాదంటే మమ్మల్ని చీమల్లా నలిపేయగలరు కాబట్టి ‘చీమల్లాంటివాళ్లం’ అంటూ మమ్మల్ని మేము అభివర్ణించుకున్నాం.
ఆ పైపైవారంటే.. వాళ్లు గతంలోలా కాంగ్రెస్ కావొచ్చు, లేదా ఇప్పట్లోలా బీజేపీ కావొచ్చు. అలా పవర్‌లో ఉన్నది యూపీఏ అయినా, లేదా ఎన్‌డీఏ అయినా..కుట్టాల్సింది పొరుగునున్న కర్ణాటక అయినా, పక్కనున్న మహారాష్ట్ర అయినా మరో రాష్ట్రమైనా ఫరక్ పడేదీ ఏదీ ఉండదు, ప్రాసెస్ సేమ్ టు సేమ్. అసలు కేంద్రంలో అధికారంలో ఉన్నది ఏ ప్రభుత్వమైనా..వాళ్ల స్టార్ క్యాంపెయినర్లం మేమే. ఆ అధికారగణాల బంగారు పుట్టలో ఎవరైనా వేలు పెడితే..వాళ్లను మేం కుట్టకుండా ఉంటామా?’’ అంటూ గుట్టు విప్పి, గుసగుసగా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment