అతను మోసపూరితంగా రూ. 200 కోట్లు కొల్లగొట్టాడు. తీహార్ జైలులో ఉంటూ కూడా తన హవాను చాటుతున్నాడు. పలువులు హీరోయిన్లను తన వలలో బంధించాడు. లంచాలిచ్చి ప్రభుత్వ ఉద్యోగులను కొనేస్తాడనే ఆరోపణలున్నాయి. వీటిపై కించిత్తు కూడా స్పందించనట్టు కనిపిస్తాడు. ఈ రోజుకీ జైలు గోడల మధ్య ఉంటూనే తన ప్రియురాలికి ఉత్తరం రాశాడు.. అతను మరెవరో కాదు.. దేశంలో అతిపెద్ద మోసగాని(బ్లఫ్ మాస్టర్)గా పేరున్న సుఖేష్ చంద్రశేఖర్. ఇప్పుడు సుఖేష్ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు రాసిన ప్రేమలేఖ చర్చనీయాంశంగా మారింది.
నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై అమితమైన ప్రేమ
హిందీ బాషలో రాసిన ఈ ఉత్తరంలో సుఖేష్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై తనకున్న ప్రేమను వ్యక్తం చేశాడు. ‘జీవితంలోకి ఎందరో వస్తుంటారు. అయితే కొందరు మాత్రమే మనసులో నిలిచిపోతుంటారు. వారిలో మీరొకరు’ అని ఆ ఉత్తరంలో రాశాడు. దీనికి ముందు సుఖేష్ మరో నటి నోరా ఫతేహీపై కూడా ఇదేవిధంగా తన ప్రేమను వ్యక్తం చేశాడు. 2015లో నటి లీనా మారియాను వివాహం చేసుకున్న సుఖేష్ చంద్రశేఖర్ భార్యతో కలసి మోసాలకు పాల్పడేవాడు.
రాజకీయ నేత కుమారుడినని నమ్మబలికి..
సుఖేష్ చంద్రశేఖర్ బెంగళూరు వాస్తవ్యుడు. తన 17 ఏళ్ల వయసు నుంచే మోసాలకు పాల్పడుతూ వస్తున్నాడు. సుఖేష్ బెంగళూరులోని బిషప్ కాటన్ బాయిస్ స్కూలులో ప్రాథమిక విద్యను పూర్తిచేశాడు. అనంతరం మధురై యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేశాడు. ఆ తరువాతి నుంచి మోసాల్లో మునిగితేలాడు. బెంగళూరుకు చెందిన ఒక కుటుంబం నుంచి సుఖేష్ కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. తాను ఒక పెద్ద రాజకీయ నేత కుమారుడినని చెప్పి, వారికి కావలిసిన పనులు చేయిస్తానని నమ్మబలికి, వారి నుంచి డబ్బులు లూటీ చేశాడు. ఈ ఘటనలో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. అయినా సుఖేష్ తన తీరు మార్చుకోకుండా మోసాలు కొనసాగిస్తూ వచ్చాడు.
మంత్రి మనుమడినని నమ్మించి..
ఈ ఉదంతం అనంతరం సుఖేష్ తాను ఒక మంత్రి మనుమడినని చెప్పి, కొంతమంది దగ్గర వారి పనులు చేయిస్తానని చెప్పి వారి నుంచి డబ్బులు వసూలు చేశాడు. చిన్నప్పటి నుంచి ధనవంతుడిని కావాలని తాపత్రయపడే సుఖేష్ లగ్జరీ లైఫ్ కోసం మోసపూరిత సామ్రాజ్యాన్ని ఏర్పరుచుకున్నాడు. ఈ నేపధ్యంలోనే 2017లో సుఖేష్ మరోమారు అరెస్టయ్యాడు. పార్టీ ఎన్నికల గుర్తు కేటాయిస్తానని చెబుతూ కొందరు నేతలను మోసగించాడు. ఈ కేసులో పోలీసులు అతనిని ఒక ఫైవ్‌స్టార్ హోటల్‌లో అరెస్టు చేశారు.
అతనిని జైలు నుంచి విడిపిస్తానని..
ఆ తరువాత కూడా సుఖేష్ చంద్రశేఖర్ మోసాలు కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. బెయిలుపై బయటకు వచ్చిన సుఖేష్ ఫార్టీస్ హెల్త్‌కేర్‌కు చెందిన ప్రొఫెసర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్‌ను మోసగించాడు. ఆ సమయంలో ఏదో కేసులో శివిందర్ సింగ్ జైలులో ఉన్నాడు. అతనిని జైలు నుంచి విడిపిస్తానని చెప్పి అదితి సింగ్ నుంచి రూ. 200 కోట్లు కొల్లగొట్టాడు. ఈ కేసులో సుఖేష్ చంద్రశేఖర్‌ను పోలీసులు మరోమారు అరెస్టు చేశారు.
తీహార్ జైలులో ఊచలు లెక్కబెడుతూ..
ఎన్నోసార్లు అరెస్టయినా సుఖేష్ చంద్రశేఖర్ తన తీరుతెన్నులను మార్చుకోలేదు. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ అక్కడ కూడా విలావంతమైన జీవితాన్ని గడుపుతున్నాడనే ఆరోపణలున్నాయి. ఇటీవలే బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఆమె పుట్టినరోజు సందర్భంగా ప్రేమ లేఖ రాశాడు. దీనికిముందు ఈస్టర్ రోజున కూడా జాక్వెలిన్‌కు లవ్ లెటర్ పంపాడు.
ఇది కూడా చదవండి: అందం.. నేర సామ్రాజ్యంలోకి అడుగిడితే.. లేడీ డాన్ లవ్ స్టోరీస్!
Comments
Please login to add a commentAdd a comment