అది అమెరికా, అలబామాలోని ఆబ్‌విల్ పట్టణం. అక్కడ సూర్యాస్తమయం తర్వాత.. పిల్లలున్న ప్రతి ఇంట్లోనూ ఓ హెచ్చరిక జారీ అవుతుంది. ‘మోలీ వస్తోంది.. అల్లరి చేస్తే తీసుకెళ్లిపోతుంది, మోలీ వస్తోంది.. మాట వినకపోతే లాక్కుపోతుంది’ అని! మోలీ.. ఓ దయ్యం పేరు. ఆమె 7 అడుగుల ఎత్తుతో బలిష్ఠంగా ఉంటుందని.. నల్ల దుస్తులు ధరిస్తుందని చూసినవాళ్లు, తెలిసినవాళ్లు చెబుతుంటారు. ఆమె తలకు ముసుగు లేదా తలపాగా లేదా టోపీ పెట్టుకుని.. భయపెట్టే రూపంలో ఉంటుందని వర్ణిస్తుంటారు.
చీకటి వేళ చల్లగాలిలో అమాంతం దూసుకొస్తుందట మోలీ. ఎంత వేగంగా పారిపోవడానికి ప్రయత్నించినా వెంటాడి పట్టుకోగలదట. ముఖ్యంగా ఆమె టార్గెట్ పిల్లలేనట. తరిమి తరిమి పట్టుకున్న తర్వాత గట్టిగా కౌగిలించుకుని.. చెవిలో చాలా పెద్దగా అరిచి.. అదృశ్యమవుతుందట. అంటే ‘ఆమె హానికరమైన దయ్యం కాదు’ అనేది అక్కడి వారి మాట. అయితే పిల్లల్ని అదుపు చేయడానికి పెద్దలు మాత్రం మోలీ పేరు చెప్పి బెదరగొడుతూంటారు. మోలీ ఎదురుపడిందంటూ.. రెండుమూడు రోజులు మంచం పట్టిన పిల్లలు కూడా ఉన్నారు.
అయితే ఈ మోలీ గతం గురించి చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం మోలీ బాలింతగా ఉన్నప్పుడు.. తన పసిబిడ్డను కొంతమంది పిల్లలు ఎత్తుకుని, కౌగిలించుకున్నప్పుడు ఇన్ఫెక్షన్ సోకి ఆ బిడ్డ చనిపోయిందని.. అప్పటి నుంచి పిచ్చిదైపోయిన మోలీ.. ఆ తర్వాత చనిపోయి, దయ్యమైందని చెబుతారు. ఆ దయ్యమే ఇలా పిల్లల వెంటపడుతుందని కొందరు నమ్ముతారు. అయితే మరికొందరు మాత్రం.. మోలీ ఒక స్కూల్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసేదని.. ఆమెకు పిల్లలంటే చాలా ఇష్టమని.. అందుకే చనిపోయిన తర్వాత దయ్యమై.. రాత్రి పూట పిల్లల్ని భద్రంగా కాపాడటానికి తాపత్రయపడుతుందని చెబుతుంటారు.
1900 సంవత్సరం నుంచి ఈ కథలు వినిపిస్తూనే ఉన్నాయి. అంటే మోలీ.. సుమారు నూటపాతిక ఏళ్ల నాటి దయ్యమన్నమాట. అయితే ఈ కథల్లో ఏది నిజం? ఎంతవరకు నిజం అనేదానిపై స్పష్టత లేదు. ఏది ఏమైనా.. మోలీ ఊసెత్తితే.. చాలామంది పెద్దలు కూడా ఉలిక్కిపడుతుంటారు. ఎందుకంటే తమ బాల్యంలో తమనూ మోలీ వెంటాడి పట్టుకుందని, చెవిలో గావుకేక పెట్టిందని చెబుతుంటారు. ఏదీ ఏమైనా నిజంగానే మోలీ ఆత్మ రూపంలో అక్కడ వీథుల్లో తిరుగుతోందా? లేక కేవలం భ్రమలు, పుకార్లేనా? అనేది నేటికీ మిస్టరీనే.
(చదవండి: ఆ గుహలోకి వెళ్లడమంటే.. ప్రాణాలపై ఆశ వదిలేసుకోవడమే!)
Comments
Please login to add a commentAdd a comment