రాజేంద్ర సింగ్.. మొదట భారత ఆర్మీలో సైనికుడు. తరువాత బ్యాంకులో సెక్యూరిటీ గార్డు. ఇప్పుడు బ్యాంకులో క్లర్కు. 51 ఏళ్ల వయసులో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి.. విజయానికి వయసు అడ్డంకి కాదని నిరూపించాడు.
వయసు మీదపడ్డాక మరోసారి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన రాజేంద్ర సింగ్ రాజస్థాన్‌లోని సికార్ జిల్లా లక్ష్మణగఢ్ పట్టణంలో కుటుంబంతో పాటు ఉంటున్నాడు. రాజేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ తన కుటుంబ సభ్యులలోని ఐదుగురు భారతీయ సైన్యంలో చేరారని, మొదట తన తండ్రి, తరువాత ముగ్గురు సోదరులు, ఇప్పుడు తన పెద్ద కుమారుడు సైన్యంలో చేరారన్నారు.
ఇండియన్ ఆర్మీలో 18 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన తర్వాత రాజేంద్ర సింగ్ వీఆర్ఎస్ తీసుకున్నారు. తర్వాత 2014లో ఎస్‌బీఐ లక్ష్మణ్‌గఢ్‌లో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు ఆల్వార్ అండ్ సికార్ జోన్‌లోని బ్యాంకులో క్లర్క్ పోస్ట్ దక్కించుకున్నారు. ఇందుకు నిర్వహించిన పోటీ పరీక్షలో రాజస్థాన్‌లో నాల్గవ ర్యాంక్ సాధించారు.
సైన్యం నుంచి రిటైర్ అయ్యాక చాలామంది ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతారు. అయితే రాజేంద్ర సింగ్ తన భార్య అమృతా దేవి ప్రోత్సాహంతో 51 ఏళ్ల వయస్సులో మరోమారు ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించారు. ఇందుకోసం ఎస్‌బిఐ నిర్వహించిన పోటీ పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. తన సక్సెస్ క్రెడిట్ అంతా తన భార్యకే దక్కుతుందని రాజేంద్ర సింగ్ తెలిపారు.
రాజేంద్ర సింగ్ 1991లో భారత సైన్యంలో సైనికుడిగా నియమితులయ్యారు. సైన్యంలో 18 ఏళ్లపాటు సేవలందించిన తర్వాత 2009లో హవల్దార్ పదవి నుంచి వీఆర్‌ఎస్ తీసుకున్నారు. 2014లో ఎస్‌బీఐలో గార్డ్‌గా నియమితులయ్యారు. 2024, మార్చి 28న జరిగిన ఎస్‌బీఐ బ్యాంక్ క్లర్క్ పరీక్షకు హాజరై, ఉత్తీర్ణత సాధించారు. రాజేంద్ర సింగ్‌కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నితేష్ బీఎస్ఎఫ్‌లో సైనికుడు. చిన్న కుమారుడు కార్తీక్ బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment