నిజాయతీగా కష్టపడే వారి విజయాన్ని ఎవరూ ఆపలేరనడానికి ‘పోహెవాలా’ ఫుడ్ స్టార్టప్ వ్యవస్థాపకులు, మహారాష్ట్రకు చెందిన చాహుల్ బల్పాండే, పవన్ వాడిభాస్మే ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచారు. చాహుల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాక, పవన్ ఎంబీఏ డిగ్రీ అందుకున్నాక ఒక కంపెనీలో ఉద్యోగాల్లో చేరారు. సదరు కంపెనీ వారికి సకాలంలో జీతాలు ఇవ్వలేదు. దీంతో ప్రతి నెలా డబ్బుకు ఇబ్బంది ఎదురయ్యేది.
దీంతో వారిద్దరూ పగటిపూట అదే ఆఫీసులో పనిచేస్తూ, రాత్రి పూట నాగపూర్‌లో పోహె విక్రయాలు ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే వీరు తయారు చేసే పోహెకు ఆహార ప్రియుల నుంచి విశేష ఆదరణ లభించింది. దీంతో వీరిద్దరూ 2018లో తమ ఉద్యోగాలను వదిలేసి, పూర్తిస్థాయిలో పోహె విక్రయాలు ప్రారంభించారు. వీరు తమ బ్రాండ్‌కు ‘పోహె వాలా’ అనే పేరు పెట్టారు. అనంతరం అనేక రకాల పోహెలను అందుబాటులోకి తీసుకువచ్చారు. కేవలం ఆరు సంవత్సరాలలో, వారు దేశంలోని 15 నగరాల్లో తమ అవుట్‌లెట్‌లను ప్రారంభించారు. ప్రస్తుతం పవన్, చాహుల్ ప్రతి నెలా రూ.60 లక్షలకు పైగా మొత్తాన్ని సంపాదిస్తున్నారు.
చాహుల్, పవన్‌లు ఫుడ్ స్టార్టప్ ప్రారంభించాలని అనుకున్నప్పుడు తొలుత రాత్ర వేళ చిన్నగా పోహె విక్రయాలు ప్రారంభించారు. దీంతో ఈ వ్యాపారంలో సాధ్యాసాధ్యాలను తెలుసుకోవడంతో పాటు కస్టమర్లు ఏం కోరుకుంటున్నారనేది గ్రహించారు. 2018 మేలో వీరు నాగ్‌పూర్‌లో తమ పోహె వ్యాపారాన్ని ప్రారంభించారు. మొదట్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పోహె విక్రయించేవారు. ఇది వారికి మార్కెట్‌పై లోతైన అవగాహన కలిగేందుకు ఉపయోగపడింది. ప్రస్తుతం భారీ స్థాయిలో వ్యాపారం సాగిస్తున్న వీరు మొత్తం 13 రకాల పోహెలను తయారు చేస్తుంటారు. ఆర్గానిక్ పోహె అమ్మకాలు ప్రారంభించినది కూడా వీరే కావడం విశేషం. నేడు పోహెవాలా బ్రాండ్ పనీర్ పోహె, ఇండోరి పోహె, నాగ్‌పూర్ స్పెషల్ తారీ పోహె, చివ్దా పోహె, మిశ్రా పోహె చాలా ప్రసిద్ధి చెందాయి.
ఒక ఇంటర్వ్యూలో చాహుల్ బాల్పాండే మాట్లాడుతూ నిజానికి ఏ వ్యాపారానికీ హెచ్చు తగ్గులుండవని, వ్యాపారం విజయవంతం కావడానికి వినూత్న ఫార్ములా, నాణ్యత, మార్కెటింగ్ నైపుణ్యాలు అవసరమని అన్నారు. వ్యాపారాన్ని ప్రారంభించే ముందు సరైన వ్యూహాన్ని రూపొందించడం ముఖ్యమన్నారు. వీరు ‘పోహెవాలా’కు సొంత వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. దీని సాయంతో ఆన్‌లైన్‌లోనూ పోహె విక్రయాలు కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment