రామ్‌గోపాల్‌వర్మ ‘కథ–స్క్రీన్‌ప్లే–దర్శకత్వం: అప్పల్రాజు’ సినిమాలో రాఖీ డైలాగు...‘డైరెక్టర్ కావాలంటే ఊరకే కథలు మాత్రమే రాస్తే సరిపోదయ్యా’ కట్ చేస్తే... సినీ కలల యువతరం ఇప్పుడు ఊరకే కథలు రాస్తూ, కలలు కంటూ మాత్రమే కూర్చోవడం లేదు. చిత్రరంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న సాంకేతికతను అధ్యయనం చేస్తోంది. ఇంటర్‌నెట్‌నే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌గా చేసుకొని ‘స్క్రిప్ట్ బుక్’ ‘ఐవా’ ‘మాజిస్టో’లాంటి ఎన్నో ఏఐ టూల్స్‌పై అవగాహన పెంచుకొని వినూత్నంగా ఆలోచిస్తోంది...
పుణెకు చెందిన నైనా పాటిల్ పేరుకు ఇంజనీరింగ్ చదువుతుందిగానీ ఆమె కలలన్నీ చిత్రసీమ వైపే. ఇంట్లో చెబితే ఒప్పుకోరని తెలుసు. అయితే ఆ భయమేమీ తన కలలకు అడ్డుగోడ కావడం లేదు. తీరిక వేళల్లో అత్యాధునిక సినీ సాంకేతికతకు సంబంధించిన విషయాలు, విశేషాలు తెలుసుకోవడం తనకు ఇష్టం. కోయంబత్తూరుకు చెందిన నిఖిల్ తేజను ఒక్కసారి కదిపి చూడండి. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి లేటెస్ట్, గ్రేటెస్ట్ విశేషాలను గుక్కతిప్పుకోకుండా చెబుతాడు. సినీ సాంకేతికతపై అతని పట్టు చూస్తే ‘రాబోయే రోజుల్లో కాబోయే డైరెక్టర్’ అని ఢంకా బజాయించి చెప్పవచ్చు. ఒక సినిమా హిట్ కావాలంటే కథ బాగుండాలి. బాగున్న కథను బాగా చెప్పగలగాలి.
బాగా చెప్పడానికి మాటల నైపుణ్యంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ రూపంలో సాంకేతిక నైపుణ్యాన్ని కూడా తోడుగా తెచ్చుకుంటుంది సినిమా కలల యువతరం. ఏఐ టూల్స్ వల్ల కథ వినే వారికి గంటల కొద్ది సమయం వృథా కాకపోవడం ప్లస్ పాయింట్. సినిమాలకు సంబంధించి యువతరం ఆసక్తి చూపుతున్న కొన్ని ఏఐ టూల్స్...పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా ఏఐ టూల్ ‘స్క్రిప్ట్ బుక్’ను సులభంగా ఉపయోగించవచ్చు. సినిమాలు, టీవీ షోలకు స్క్రిప్ట్ క్రియేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
క్యాస్టింగ్, జానర్, స్టోరీ స్ట్రక్చర్‌కు సంబంధించి విశ్లేషణ చేయవచ్చు. ‘డెమోక్రటైజింగ్ స్టోరీటెల్లింగ్ త్రూ ది ఆర్ట్ ఆఫ్ ఏఐ’ అంటూ తనను పరిచయం చేసుకుంటుంది స్క్రిప్ట్‌బుక్. ఇది సినిమా జయాపజయాలను కూడా అంచనా వేయగలదు అంటున్నారు గానీ ఎంతవరకు నిజమో తెలియదు. డిఫరెంట్ యూజర్‌లను దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్‌బుక్‌లో రకరకాల ప్యాకేజీలు ఉన్నాయి. ఇండివిడ్యువల్ రైటర్‌లు, చిన్న ప్రొడక్షన్ హౌజ్‌ల కోసం ది బేసిక్ ప్యాకేజ్, మల్టిపుల్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి స్క్రిప్ట్ ఎనాలసిస్ చేయడానికి ది స్టాండర్డ్ ప్యాకేజీ, ప్రముఖ ప్రొడక్షన్ హౌజ్‌లు, స్టూడియోల కోసం ది ప్రీమియం, నిర్దిష్టమైన అవసరాల కోసం ది ఎంటర్‌ప్రైజ్‌లాంటి ప్యాకేజ్‌లు ఉన్నాయి.
స్టోరీ టెల్లింగ్ ఏఐ టూల్స్‌లో ప్లాట్‌గన్ ఒకటి. దీనితో యానిమేటెడ్ ఫిల్మ్ సులభంగా రూపొందించవచ్చు. యూజర్–ఫ్రెండ్లీ అడ్వాన్స్‌డ్ ఫీచర్‌లతో సినీ కథకులకు, కంటెంట్ క్రియేటర్‌లకు ప్లాట్‌గన్ దగ్గరైంది. ‘ప్లాట్‌గన్’ను ఉపయోగించడానికి డ్రాయింగ్ స్కిల్క్స్ అవసరం లేదు. ఎన్నో క్యారెక్టర్‌లతో కూడిన లైబ్రరీ, ఎక్స్‌ప్రెసివ్ యానిమేషన్స్, టైమ్–సేవింగ్ యానిమేషన్, కస్టమ్ వాయిస్ వోవర్స్ అండ్ సౌండ్‌ట్రాక్స్... దీని ప్రత్యేకత. ఏఐ ప్లాట్‌ఫామ్ ‘అడోబ్ సెన్‌సే’ వీడియో ఎడిటింగ్, ఆటోమేటెడ్ కలర్ కరక్షన్స్, ఆడియో ఎన్‌హాన్స్‌మెంట్ \కు సంబంధించి రకరకాల టూల్స్‌ను అందిస్తోంది. ‘ఎమోషన్ ఏఐ’ టూల్స్‌తో ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్‌ను ఎనలైజ్ చేయవచ్చు. ‘మాజిస్టో’ అనేది ఎడిటింగ్ విధానాన్ని సరళం చేసే ఏఐ పవర్డ్ వీడియో ఎడిటింగ్ టూల్.
ఫుటేజీలోని ‘బెస్ట్ మూమెంట్స్’ ఆటోమేటిక్‌గా ఈ టూల్ సెలెక్ట్ చేస్తుంది. మ్యూజిక్‌ను యాడ్ చేస్తుంది. విజువల్ క్వాలిటీ విషయంలో తనవంతు పాత్ర పోషిస్తుంది. ఐవా (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్చువల్ ఆర్టిస్ట్) అనేది ఏఐ–పవర్డ్ మ్యూజిక్ కంపోజిషన్ టూల్. మోడ్రన్ సినిమాటిక్, ఎలక్ట్రానిక్, పాప్, రాక్, జాజ్... ఇలా రకరకాలుగా మ్యూజిక్ క్రియేట్ చేసుకోవచ్చు. స్టోరీలైన్స్, వీటితోపాటు ప్లాట్ ఐడియాలు జెనరేట్ చేయాలనుకునే వారికి ఉపయోగపడే ఏఐ టూల్స్ కూడా ఉన్నాయి. ‘స్క్రిప్ట్‌బుక్’ నుంచి ‘ఐవా’ వరకు సినిమాలకు సంబంధించి సకల సాంకేతిక విషయాలను తెలుసుకోవడానికి ఏ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లోనూ శిక్షణ అక్కర్లేదు.
ఇంటర్నెట్ ఉంటే చాలు! ఏఐ జెనరేట్ సోరీలైన్‌లు, డైలాగులు, స్క్రిప్ట్‌లు త్వరలో మన ఫిల్మ్ ఇండస్ట్రీలోకి కూడా రావచ్చు. ఏఐ జెనరేట్ చేసిన స్టోరీలైన్‌లు, స్క్రిప్ట్‌లను నమ్ముకోవడమా, తమలోని క్రియేటివిటీని మాత్రమే నమ్ముకోవడమా.. అనే రెండు దారులు కనిపించవచ్చు. ‘ఏఐ సాంకేతికత అందరికీ అందుబాటులోకి వచ్చాక ప్రత్యేకత అంటూ ఉండకపోవచ్చు. స్టోరీలైన్‌లను క్రియేట్ చేయడంలో సహజత్వం మిస్ కావచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సాంకేతికత కంటే సహజత్వానికే ప్రాధాన్యత ఇవ్వాలి. సాంకేతికతపై అవగాహన ఉండడం ముఖ్యమే కాని అది మాత్రమే ముఖ్యం కాదు. సమాజాన్ని అధ్యయనం చేయడం ద్వారా మాత్రమే కొత్త కథలు పుడతాయి’ అంటుంది దిల్లీకి చెందిన మాస్ కమ్యూనికేషన్ స్టూడెంట్ వర్షిణి.
(చదవండి: సరికొత్త ఆలోచన!..ఎవ్వరికీ తట్టనది..రెస్టారెంట్‌లన్నీ..)
Comments
Please login to add a commentAdd a comment