కేంద్రంలో ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని త్వరగా ఆమోదించుకోలేకపోతున్నారంటూ ఈటీవీ భారత్‌లో కథనం
ఇప్పుడు దానిపై ఎడతెగని దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని వక్రీకరించి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్న రామోజీరావు 7 నెలల క్రితం దాన్ని జగన్ ప్రభుత్వం అమల్లోకి తేలేకపోతుందంటూ ఈటీవీ భారత్‌లో ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేశారు. గతేడాది ఆగస్టు 11న ఈటీవీ భారత్‌లో ‘వైసీపీ ప్రభుత్వ ప్రచారాలకే పరిమితమైన చట్టాలు.. ఖాతాలో మరో యాక్ట్’ అంటూ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించి పంపించిన బిల్లులకు కూడా కేంద్రం నుంచి ఆమోదం తెచ్చుకోలేకపోతున్నారని అందులో వివరించారు. అసెంబ్లీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను ఆమోదించినా కేంద్రం నుంచి అనుమతి తేలేకపోతున్నారని ఆక్షేపించింది.
అనేకసార్లు దిల్లీలో ప్రదక్షిణలు చేసిన సీఎం జగన్ ల్యాండ్ టైటిల్ యాక్ట్‌కు కేంద్రం నుంచి ఆమోదం పొందడంలో విఫలమయ్యారని ఆ కథనంలో రామోజీ గుండెలు బాదుకున్నారు. ఆ కథనం వచ్చిన కొద్దినెలలకే కేంద్రం ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి ఆమోదముద్రా పడింది. ఇప్పుడు ఏకంగా విష ప్రచారం చేయడం రామోజీ ద్వంద్వ నీతికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది. ఎంతో విజన్ ఉన్న చట్టం అని చెప్పిన దాని గురించి ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అప్పుడు ఈ చట్టం వస్తే భూ యజమానులకు వరంగా మారుతుందని చెప్పిన ఈటీవీ ఇప్పుడు అది వస్తే భూములు పోతాయని రైతులను భయభ్రాంతులకు గురిచేసే కథనాలు వండి వారుస్తోంది.
ఈ చట్టం గురించి వ్యతిరేక ప్రచారం చేసి భూములకు సంబంధించి వారిలో భయాలు సృష్టించి తద్వారా ఎన్నికల్లో చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేందుకు రామోజీ ఈ దిగజారుడు పాత్రికేయానికి తెగబడ్డారు. భూ హక్కుల చట్టంతో భూములకు భద్రత వస్తుందని ఈటీవీలో పలు కథనాలు ప్రసారం చేసి ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఇష్టమొచ్చినట్లు బురద జల్లడం ద్వారా తనకు కుట్రలు, కుతంత్రాలు తప్ప విలువలు, నీతి అనేదే లేదని రామోజీ నిరూపించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment