వ్యవసాయ కుటుంబం నుంచి మీడియా అధిపతిదాకా రామోజీరావు ప్రస్థానం
భిన్నమైన వ్యాపారాల్లో విజయంతో గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రామోజీరావు.. పరస్పరం భిన్నమైన రంగాల్లో వ్యాపారాలను ప్రారంభించి విజయం సాధించారు. యాడ్ ఏజెన్సీలో పనిచేయడం మొదలుపెట్టి.. ఎరువుల వ్యాపారం, చిట్‌ఫండ్స్, పచ్చళ్లు, మీడియా వంటి ఎన్నో రంగాలకు విస్తరించారు. రామోజీరావు ఏపీలోని కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో 1936 నవంబరు 16న జని్మంచారు. ఆయన తండ్రి వెంకట సుబ్బారావు రైతు. తల్లి వెంకట సుబ్బమ్మ గృహిణి. పెదపారుపూడి, గుడివాడలలో పాఠశాల విద్య, ఇంటర్, డిగ్రీ (బీఎస్సీ) గుడివాడలోనే పూర్తి చేశారు. 1961 ఆగస్టు 19న పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవిల రెండో కుమార్తె రమాదేవితో రామోజీరావుకు వివాహం జరిగింది.
మొదట యాడ్ ఏజెన్సీలో చేరి..: బీఎస్సీ పూర్తిచేసిన రామోజీరావు.. తన కుటుంబం చేసే వ్యవసాయానికే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నారు. అడ్వర్టైజింగ్ రంగం వైపు ఆసక్తి కలగడంతో.. ఢిల్లీ వెళ్లి ఓ అడ్వరై్టజింగ్ ఏజెన్సీలో చేరారు. అక్కడ మూడేళ్లు పనిచేశాక హైదరాబాద్‌కు వచ్చారు. 1962 అక్టోబర్‌లో హైదరాబాద్‌లో మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థను, 1965లో కిరణ్ యాడ్స్ పేరిట అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీని ప్రారంభించారు. తర్వాత ఇతర వ్యాపారాలవైపు దృష్టి సారించారు. 1967–1969 మధ్య వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారం చేశారు. ఆ సమయంలోనే వ్యవసాయ సమాచారంతో కూడిన అన్నదాత పత్రికను ప్రారంభించారు.
1970లో ఇమేజెస్ ఔట్‌డోర్ యాడ్ ఏజెన్సీని, విశాఖలో డాలి్ఫన్ హోటల్‌ను ప్రారంభించారు. అప్పటికే పత్రికారంగంపై ఆసక్తి ఉన్న ఆయన.. విశాఖపట్నం కేంద్రంగా ఈనాడు పత్రికకు శ్రీకారం చుట్టారు. స్థానిక వార్తలకు ప్రాధాన్యమివ్వటం, గ్రామాల్లోనూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవడం, వేగంగా పంపిణీ చేయడం ద్వారా పత్రికను పాఠకులకు చేరువ చేశారు.
ఎల్రక్టానిక్ మీడియాతోనూ..: పాత్రికేయ రంగంలో మార్పులను ముందుగానే గుర్తించిన రామోజీరావు.. మొదట్లో వినోదం ప్రధానాంశంగా ఈటీవీ చానల్‌ను ప్రారంభించారు. తర్వాత పూర్తి న్యూస్ చానల్ ఈటీవీ2ను ప్రారంభించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఏపీ, తెలంగాణలకు విడివిడి న్యూస్ చానళ్లను ఏర్పాటు చేశారు. ఇక ‘ప్రియ’పేరిట రామోజీ ప్రారంభించిన పచ్చళ్ల వ్యాపారం కూడా సక్సెస్ అయింది. వివిధ రంగాల్లో రామోజీ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2016లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది.
రామయ్య నుంచి రామోజీగా మార్చుకుని..: రామోజీరావు తాత పేరు రామయ్య. ఆయన వ్యవసాయం చేసేవారు. రామోజీ జని్మంచడానికి కొన్నిరోజుల ముందు రామయ్య మరణించారు. దీంతో తాత పేరే మనవడికి పెట్టారు. కానీ రామయ్య అనే పేరు పాతదిగా అనిపించడంతో.. ఆయన తన పేరును రామోజీగా మార్చుకున్నారని చెబుతారు.
తెల్ల వ్రస్తాలంటే మక్కువ..: రామోజీరావు ఎప్పుడు చూసినా తెలుపు రంగు వస్త్రధారణతోనే కనిపిస్తారు. ఆయనకు తెలుపు రంగు వ్రస్తాలంటే ప్రత్యేక మక్కువే దీనికి కారణమని చెబుతారు. వదులుగా ఉండే తెలుపు రంగు హాఫ్‌హ్యాండ్స్ షర్టు, అదే రంగు ప్యాంటు, మ్యాచింగ్‌గా తెలుపు రంగు షూస్ ధరించేవారు. ఎప్పుడైనా ప్రత్యేక సందర్భాల్లో తప్ప ఎప్పుడూ తెలుపు వస్త్రధారణతో
ఉండేవారు.
పత్రికారంగానికి ఎనలేని సేవలందించారు
రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ‘తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూన్నాను. రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని వైఎస్ జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్(ట్విట్టర్)లో శనివారం పోస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment