గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస
రామోజీ ఫిలింసిటీకి భౌతికకాయం తరలింపు
రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల సంతాపం..
ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నేడు ఫిలింసిటీలో అంత్యక్రియలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రముఖ వ్యాపారవేత్త, రామోజీ గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (88) కన్నుమూశారు. ఈ నెల 5న గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీని కుటుంబ సభ్యులు నానక్‌రాంగూడలోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. గుండె పనితీరు దెబ్బతిన్నదని, బీపీ పడిపోయిందని గుర్తించిన వైద్యులు.. ఆయనకు వెంటిలేటర్ అమర్చారు. యాంజియోగ్రామ్ చేసి గుండె నాళాల్లో స్టంట్ వేశారు. అయినా ఆయన కోలుకోలేదు.
శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆరోగ్యం మరింతగా క్షీణించి.. శనివారం తెల్లవారుజామున 4.51గంట లకు తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రి నుంచి ఆయన భౌతిక కాయాన్ని ఉదయం 7.45 గంటలకు రామోజీ ఫిలింసిటీకి తెచ్చారు. రామోజీ మరణ వార్త తెలిసి రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. ఫిలింసిటీలో రామోజీ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అరి్పంచారు. రామోజీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
ఆదివారం ఉదయం 10 గంటలకు ఫిలింసిటీలోని నాగన్‌పల్లి–అనాజ్‌పూర్ గ్రామాల మధ్యలో ప్రత్యేకంగా నిర్మించిన స్మృతివనంలో రామోజీరావు భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల కోసం ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో ఫోన్‌లో మాట్లాడి ఈ మేరకు సూచనలు చేశారు. దీంతో ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, రాచకొండ పోలీస్ కమిషనర్‌లను సీఎస్ ఆదేశించారు.
బతికుండగానే రామోజీ స్మృతివనం
ఇబ్రహీంపట్నం రూరల్: రామోజీరావు తాను బతికి ఉండగానే ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లి–అనాజ్‌పూర్ మధ్యలో ప్రత్యేక స్మృతి వనాన్ని నిర్మించుకున్నారు. ఇప్పుడు ఆయన అంత్యక్రియలను ఈ స్మృతివనంలోనే నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డి శనివారం స్మృతి వనాన్ని పరిశీలించి.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించేందుకు ఏర్పాట్లు చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment