ఇంద్రుడితో గృత్సమదుడి మైత్రి.. | Gritsamadu's Alliance With Indra Devotional Story Written By Sankhyayana | Sakshi
Sakshi News home page

ఇంద్రుడితో గృత్సమదుడి మైత్రి..

Published Sun, Sep 1 2024 2:11 AM | Last Updated on Sun, Sep 1 2024 2:11 AM

Gritsamadu's Alliance With Indra Devotional Story Written By Sankhyayana

శౌనక మహర్షి వంశంలో సునహోత్రుడు అనే తపస్వి ఉన్నాడు. ఆయన వేదవేదాంగ శాస్త్ర పారంగతుడు, ధర్మనిరతుడు, శమదమాది సంపన్నుడు. సంసారాశ్రమంలో ఉన్నా, నిత్య కర్మానుష్ఠానాన్ని నియమం తప్పక ఆచరించేవాడు. అతడికి ముగ్గురు కొడుకులు పుట్టారు. వారు: కౌశుడు, శాల్ముడు, గృత్సమదుడు. సునహోత్రుడి ముగ్గురు కొడుకుల్లోనూ గృత్సమదుడు మహాతపస్విగా ప్రఖ్యాతి పొందాడు.

వేదవేత్త అయిన గృత్సమదుడు అగ్నిదేవుడిని ప్రసన్నం చేసుకోదలచాడు. వేదమంత్రాలతో అగ్నిదేవుడిని భక్తిగా స్తుతించాడు. అగ్నిదేవుడికి ప్రీతికరమైన మంత్ర సప్తకాన్ని పఠిస్తూ, యజ్ఞం చేశాడు. గృత్సమదుడి నిష్కళంక భక్తితత్పరతలకు అగ్నిదేవుడు అమిత ప్రసన్నుడయ్యాడు. అతడి ఎదుట దివ్యరూపంలో ప్రత్యక్షమయ్యాడు. గృత్సమదుడు వరమేదీ కోరకపోయినా, అతడికి అగ్నిదేవుడు దివ్యశరీరాన్ని అనుగ్రహించాడు. ముల్లోకాలలో మూడు శరీరాలతో ఒకేసారి సంచరించగల దివ్యశక్తిని ప్రసాదించాడు.

అగ్నిదేవుడి కటాక్షంతో దివ్యశరీరధారి అయిన గృత్సమదుడు సాక్షాత్తు ఇంద్రుడిలా ప్రకాశించసాగాడు. భూమిపైన, ఆకాశంలోను, గాలిలోను ఒకేసారి మూడు దివ్యశరీరాలతో స్వేచ్ఛగా తిరుగాడసాగాడు. అలా తిరుగుతూ ఒకనాడు గృత్సమదుడు స్వర్గానికి వెళ్లాడు. ఇంద్రుడి శత్రువులైన ధుని, చమురి అనే ఇద్దరు రాక్షస సోదరులు స్వర్గంలోని నందనవనంలో ఉల్లాసంగా విహరిస్తున్న గృత్సమదుడిని చూశాడు. ఇంద్రుడిలాంటి దివ్యతేజస్సుతో వెలిగిపోతున్న గృత్సమదుడిని చూసి, అతడే ఇంద్రుడనుకున్నారు. ‘మన అదృష్టం కొద్ది ఇంద్రుడు ఒంటరిగా దొరికాడు. ఇదే తగిన అదను. ఇక్కడే అతణ్ణి మట్టుబెట్టేద్దాం’ అని రాక్షస సోదరులిద్దరూ ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఆయుధాలు పట్టుకుని, ఒక్కుమ్మడిగా అతడిపై దాడికి విరుచుకుపడ్డారు.

హాయిగా విహరిస్తున్న తన ఎదుట ఇద్దరు రాక్షసులు ఆయుధాలతో ప్రత్యక్షమవడంతో గృత్సమదుడు ఒకింత ఆశ్చర్యపోయాడు. దివ్యదృష్టితో వారి ఆంతర్యాన్ని కనుగొన్నాడు. ఏమాత్రం తొణకకుండా, తన క్షేమం కోసం, వారి నాశనం కోసం ఇంద్రుడి గుణగణాలను ప్రశంసించే వేదమంత్రాలను పఠించాడు. ఇంద్రుడి గుణగణాలను వినగానే దాడికి తెగబడ్డ ఇద్దరు రాక్షసులకూ భయంతో గుండె జారినంత పనైంది. ‘అనవసరంగా పొరపాటు చేశామా’ అని ఆలోచనలో పడ్డారు. వారు ఇంకా తేరుకోక ముందే ఇంద్రుడు అక్కడకు ఐరావతంపై వచ్చాడు. రాక్షస సోదరులు ధుని, చమురి ఒకేసారి ఇంద్రుడి మీదకు ఆయుధాలు ప్రయోగించారు. ఇంద్రుడు వాటిని తన వజ్రాయుధంతో తుత్తునియలు చేశాడు. ఇద్దరు రాక్షసులనూ తన వజ్రాయుధంతోనే మట్టుబెట్టాడు.

ఆ సంఘటనతో ఇంద్రుడిని ప్రత్యక్షంగా చూసిన గృత్సమదుడు పరమానందం పొందాడు. మళ్లీ ఇంద్రుడిని స్తుతిస్తూ వేదమంత్రాలను పఠించాడు. ఇంద్రుడి శౌర్యప్రతాపాలను, గుణగణాలను వేనోళ్ల పొగిడాడు. గృత్సమదుడి స్తోత్రానికి ఇంద్రుడు సంతోషించాడు. ‘మునివర్యా! నేటితో నువ్వు నాకు మిత్రుడివయ్యావు. నువ్వు చేసిన ప్రశంస నీ నిష్కల్మషమైన అంతఃకరణకు సాక్షి. నీ స్తోత్రం నాకు ప్రీతి కలిగించింది. నువ్వు చేసిన స్తుతి నీ సమస్తమైన కోరికలనూ ఈడేరుస్తుంది. నీకేం కావాలో కోరుకో!’ అన్నాడు.

‘దేవేంద్రా! నీ కటాక్షంతో నాకు దివ్యమైన వాక్చమత్కృతి, సకల ఐశ్వర్యాలు కలగనివ్వు. నిరంతరం నా హృదయంలో నీ స్మరణనే ఉండనివ్వు. ఎల్లప్పుడూ నీ అనుగ్రహాన్ని పొందనివ్వు’ అని కోరాడు. ఇంద్రుడు ‘తథాస్తు!’ అన్నాడు. అంతే కాకుండా, గృత్సమదుడి చేయి పట్టుకుని, తనతో పాటు తన ప్రాసాదానికి తీసుకుపోయాడు. అతిథి మర్యాదలు చేశాడు. గృత్సమదుడికి ఇంద్రుడు అతిథి మర్యాదలు చేస్తుండగా, దేవగురువు బృహస్పతి అక్కడకు వచ్చాడు. బృహస్పతిని చూసిన గృత్సమదుడు ఆయనను స్తుతిస్తూ వేదమంత్రాలను పఠించాడు. బృహస్పతి సంతోషించి, ‘సురేశ్వరుడిని, సురగురువును విద్యా వినయాలతో సంతృప్తి పరచినవాడి కంటే మేధావి మరొకడు లేడు’ అని పలికాడు. కొన్నాళ్లు ఆతిథ్యం పొందాక గృత్సమదుడు ఇంద్రుడి వద్ద సెలవు తీసుకుని, తన ఆశ్రమానికి బయలుదేరాడు.

అగ్నిదేవుడి వరప్రభావంతో గృత్సమదుడు కోరుకున్నప్పుడల్లా త్రిలోక సంచారం చేస్తూ కాలక్షేపం చేసేవాడు. క్రమం తప్పకుండా ఆచరించే నిత్యానుష్ఠానాలలో అగ్నిని, ఇంద్రుడిని, బృహస్పతిని స్తుతిస్తూ వేదమంత్రాలను పఠిస్తుండేవాడు. ఇలా ఉండగా, ఒకనాడు ఇంద్రుడికి గృత్సమదుడి భక్తిని పరీక్షించాలనే ఆలోచన పుట్టింది.

వెంటనే ఇంద్రుడు ఒక పక్షిరూపం ధరించాడు. అడవిలో అరణిని, దర్భలను ఏరుకుంటూ ఉన్న గృత్సమదుడి భుజం మీద వాలాడు. గృత్సమదుడు కొంత దూరం ముందుకు కదిలినా, భుజం మీద వాలిన పక్షి ఎగిరిపోలేదు. గృత్సమదుడు దివ్యదృష్టితో తన భుజం మీద వాలిన పక్షి ఇంద్రుడేనని గ్రహించాడు. పక్షిరూపంలో ఇంద్రుడి ఆకస్మిక ఆగమనానికి సంతోషభరితుడై, ఇంద్రుడిని ఖగేంద్రుడిగా, సురేంద్రుడిగా స్తుతిస్తూ స్తోత్రం పఠించాడు.

గృత్సమదుడికి తనపైనున్న అనన్యభక్తికి సంతోషించిన ఇంద్రుడు నిజరూపంలో అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు. ‘మిత్రమా! నీ భక్తి తత్పరతలపై నాకిక ఎటువంటి సందేహమూ లేదు. సర్వకాల సర్వావస్థలలోనూ నీవు నాకు మిత్రుడవై ఉంటావు. నాకు నిన్ను మించిన ఉత్తమ భక్తుడెవరూ లేరు. నీ కోసం స్వర్గద్వారాలు, ఇంద్రభవన ద్వారాలు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయి. నీవు ఎప్పుడు కోరుకున్నా, యథేచ్ఛగా, నిరాటంకంగా నా వద్దకు వచ్చిపోతూ ఉండు’ అని పలికి, సెలవు తీసుకుని స్వర్గానికి పయనమయ్యాడు. – సాంఖ్యాయన

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement