సిరిసిల్ల: రైతుల తరహాలో నేత కార్మికులకోసం ప్రకటించిన నేతన్నబీమా పథకంలో ఆంక్షలను తొలగించారు. నేతకార్మికులకు బీమా త్రిఫ్ట్(పొదుపు) పథ కంలో చేరితేనే వర్తిస్తుందనే నిబంధనను ప్రభుత్వం తొలగించింది. త్రిఫ్ట్‌లో చేరకున్నా అర్హులైన నేత కార్మికులకు, అనుబంధ రంగాల్లో పనిచేసేవారికి బీమా వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులకిందట జీవో జారీ చేసింది.
దీంతో త్రిఫ్ట్‌తో సంబంధం లేకుండా 18–59 ఏళ్ల మధ్య వయసు న్న కార్మికులకు నేతన్నబీమా స్కీం వర్తించనుంది. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వమే ఏటా రూ.5,425 ప్రీమియాన్ని ఎల్‌ఐసీకి చెల్లించి బీమా కల్పించనుంది. ఎలాంటి కారణంతో మరణించినా, వారి కుటుంబంలోని నామినీకి రూ.5 లక్షల బీమా సొమ్ము లభిస్తుంది. 2021 జూలై 4న సిరిసిల్లలో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రకటించారు.
‘సాక్షి’ మెయిన్‌లో ఆగస్ట్ 21న ప్రచురితమైన కథనం
2022 ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దీనికి మార్గదర్శకాలు జారీచేశారు. నేతన్నలకు బీమా పథకంతో రాష్ట్రంలోని సిరిసిల్ల, దుబ్బాక, నారాయణపేట, యాదాద్రి, నల్లగొండ, కరీంనగర్, భువనగిరి, జనగామ, గద్వాల, భూదాన్ పోచంపల్లి ప్రాంతాల్లోని నేతన్నలకు లబ్ధి కలగనుంది. అయితే ఆంక్షలు అడ్డంకిగా మారాయని ‘సాక్షి’లో ఆగస్టు 21న ప్రచురితమైన ‘నేతన్నల బీమాకు నిబంధనల చిక్కు’ కథనంపై స్పందించిన కేటీఆర్ జౌళిశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించి త్రిఫ్ట్‌తో లింకును తొలగించారు. తాజా ఆదేశాల నేపథ్యంలో అర్హతలున్న నేతన్నలందరికీ బీమా కల్పిస్తామని జౌళిశాఖ ఏడీ సాగర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment