
టన్నెల్‌లో వారు ఇంకా బతికున్నారనే ఆశలు ఉన్నాయి
కేటీఆర్ విమర్శలు మాని సలహాలు ఇవ్వాలి
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాక్షి, నాగర్‌కర్నూల్/ అచ్చంపేట/ చందంపేట: ‘ప్రపంచంలో టన్నెళ్లను నిర్మించడంలో నిపుణులైనవారిని పిలిపించి 8 మంది కార్మికులను రక్షిస్తాం. ఉత్తరాఖండ్‌లో 41 మందిని 17 రోజుల్లో బయటికి తీశారు. ఇప్పుడు కూడా అదే తరహాలో కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశ, విదేశాల్లో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పరిష్కారం చూపిన వారిని ఇక్కడికి రప్పించాం’అని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
సోమవారం ఆయన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఇక్కడికి సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు రాలేదని కేటీఆర్ విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం, మంత్రులు ఇక్కడే ఉన్నారని, సీఎం రావడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే రాలేదని అన్నారు. ‘కాళేశ్వరం కట్టినప్పుడు ఏడుగురు జలసమాధి అయితే మీరు వెళ్లి చూశారా?’అని ప్రశ్నించారు. ‘మీ నాన్నలా ఫామ్‌హౌస్‌లో పండుకోలేదు’అని దుయ్యబట్టారు.
26 మంది పసిపిల్లలు ట్రైన్ కింద పడి ముద్దలైతే పక్కనే ఫామ్‌హౌస్‌లో ఉండి కూడా వెళ్లి చూడలేకపోయారని, కొండగట్టు ఘాట్‌రోడ్డు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 66 మంది చనిపోతే ఎవరైనా వెళ్లి పలకరించారా..? అని నిలదీశారు. ‘ప్రతిపక్ష నాయకులుగా మీరు ఎవరైనా వచ్చి పరామర్శించారా? మీకు బాధ్యత లేదా? ఇలాంటి ఘటనలపై విమర్శలు మాని.. సలహాలు, సూచనలు ఇవ్వండి’అని మంత్రి హితవు పలికారు.
టన్నెల్ ప్రమాదం దురదృష్టకరం..: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది ఇంకా బతికి ఉన్నారనే ఆశలు ఉన్నాయన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వారిని బయటకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. లోపల ఉన్న కార్మికుల కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడామన్నారు. టన్నెల్‌లో చిక్కుకుపోయిన జావీద్‌కు తాను, అధికారులు ఫోన్ చేశామని, రింగ్ అయి తర్వాత స్విచ్‌ఆఫ్ వస్తోందని తెలిపారు.
అమెరికాకు చెందిన రాబిన్స్ కంపెనీ నిపుణులను పంపించాలని ఆ సంస్థ యజమానిని కోరామన్నారు. రేపటి కల్లా నీళ్లు తగ్గితే కన్వేయర్ బెల్టు ద్వారా మట్టిని బయటకు పంపించే పనులు మొదలుపెడతామన్నారు. ఈ చర్యలను సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని చెప్పారు. కాగా, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్రపవార్ కూడా ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment