పూర్వం కుత్సురుడు అనే విప్రుడు ఉండేవాడు. అతడు ధార్మికుడు. నియమబద్ధంగా జీవించేవాడు. కుత్సురుడి యోగ్యతను గమనించి, కర్దమ మహర్షి అతడికి తన కూతురునిచ్చి వివాహం చేశాడు. కొంతకాలానికి కుత్సురుడికి ఒక కొడుకు కలిగాడు. కుత్సురుడి కొడుకు గనుక కౌత్సుడని పేరు పొందాడు. అతడు దినదిన ప్రవర్ధమానంగా పెరగసాగాడు. కొడుకుకు ఐదేళ్ల వయసు రాగానే కుత్సురుడు అతడికి ఉపనయనం చేశాడు. తండ్రి వద్ద కౌత్సుడు సకల శాస్త్రాలనూ అభ్యసించాడు.
యుక్తవయసు రాగానే దేశాటనకు వెళ్లాలనే అభిలాషతో తండ్రి వద్ద అనుమతి తీసుకుని బయలుదేరాడు.ఇంటి వద్ద నుంచి బయలుదేరి ఊళ్లు, అడవులు దాటుకుంటూ ప్రయాణించిన కౌత్సుడు కొంతకాలానికి కావేరీ తీరానికి చేరుకున్నాడు. అది మాఘమాసం. కావేరీ పరిసరాలు ప్రశాంతంగా ఉండటంతో అక్కడే ఉంటూ, అనుదినం నదిలో స్నానం చేస్తూ, తపస్సు చేసుకోవడం ప్రారంభించాడు. తపస్సులో నిమగ్నమై ఉన్న కౌత్సుడిని జింకలు తమ కొమ్ములతో నిమురుతూ ఉండేవి. మృగశృంగాలను ఆకట్టుకున్నవాడు కావడం వల్ల అతడికి మృగశృంగుడనే పేరు వచ్చింది. కొన్నాళ్లకు మృగశృంగుడికి శ్రీహరి దర్శనమిచ్చాడు.
‘వత్సా! ఏమి కావాలో కోరుకో’ అన్నాడు శ్రీహరి.‘ఆపద్బాంధవా! జగద్రక్షకా! ఇక్కడ నన్ను అనుగ్రహించినట్లే, నువ్వు ఇక్కడే కొలువుంటూ భక్తులను కటాక్షిస్తూ ఉండాలి. అంతకు మించి నాకే కోరికా లేదు’ అన్నాడు మృగశృంగుడు. శ్రీహరి సమ్మతించాడు. శ్రీహరి దర్శనం పొందిన తర్వాత మృగశృంగుడు ఇంటికి చేరుకున్నాడు. యుక్తవయసుకు వచ్చిన మృగశృంగుడికి వివాహం జరిపించాలని తల్లిదండ్రులు భావించారు. భోగాపురంలో దైవజ్ఞుడైన బ్రాహ్మణుడికి సుశీల అనే కుమార్తె ఉంది. ఆమె అన్ని విధాలా అనుకూలవతి అని తెలుసుకోవడంతో మృగశృంగుడు ఆమెనే వివాహం చేసుకోవాలని తలచాడు. తల్లిదండ్రుల అనుమతితో ఆమెను చూడటానికి బయలుదేరాడు.
సుశీల తన ఇద్దరు చెలికత్తెలతో కావేరీ నదిలో స్నానం చేయడానికి బయలుదేరింది. వారు ముగ్గురూ నది వైపు వెళుతుండగా, ఒక మదపుటేనుగు ఘీంకరిస్తూ వారిని తరమసాగింది. ప్రాణభయంతో ముగ్గురూ హాహాకారాలు చేస్తూ పరుగులు తీస్తూ, తోవలో ఉన్న దిగుడుబావిలో పడిపోయారు. ఈ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి, చూడటానికి వచ్చేసరికి వారు ముగ్గురూ దిగుడుబావిలో చనిపోయి ఉన్నారు. వారు కన్నీరు మున్నీరుగా విలపించసాగారు. అదే సమయానికి మృగశృంగుడు అక్కడకు చేరుకున్నాడు. జరిగినదంతా తెలుసుకున్నాడు. ముగ్గురు యువతుల మృతదేహాలను అప్పటికే గ్రామస్థులు వెలికితీశారు. తాను వచ్చేంత వరకు ఆ మృతదేహాలను కాపాడుతూ ఉండమని చెప్పి, మృగశృంగుడు కావేరీ నదిలో మెడలోతు వరకు దిగి, యమధర్మరాజు గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు.
అతడి తపస్సుకు యముడు దిగివచ్చాడు. ‘కుమారా! నన్ను గురించి ఇంత దీక్షగా తపస్సు చేసిన వారెవరూ ఇంతవరకు లేరు. ఏమి కావాలో కోరుకో. నీ అభీష్టాన్ని తప్పక నెరవేరుస్తాను’ అన్నాడు యముడు.‘మహానుభావా! అకాల మరణానికి ప్రాణాలు పోగొట్టుకున్న ఆ ముగ్గురు కన్యలనూ బతికించు’ అని కోరుకున్నాడు మృగశృంగుడు. ‘నీ పరోపకార బుద్ధికి సంతసిస్తున్నాను’ అంటూ యముడు సుశీలను, ఆమె చెలికత్తెలిద్దరినీ బతికించాడు.తర్వాత మృగశృంగునికి సుశీలతో వివాహం జరిగింది.సుశీలతో పాటు తమను కూడా పునర్జీవితులను చేయడంతో సుశీల ఇద్దరు చెలికత్తెలూ మృగశృంగునిపై మనసు పడ్డారు. వారు అతడి వద్దకు వచ్చి, ‘సుశీలను పునర్జీవితురాలిని చేసినట్లే, నువ్వు మమ్మల్ని కూడా పునర్జీవితులను చేశావు. హాయిగా సుశీలను పెళ్లాడావు. నిన్నే నమ్ముకుని ఉన్నాం. మా గతి ఏమిటి?’ అన్నారు.
‘ఒకరికి ఒక భార్య ఉండటమే ధర్మం’ అన్నాడు మృగశృంగుడు.‘ఒకరికి ఒక భార్య మాత్రమే ఉండాలనే నియమం ఏ శాస్త్రంలోనూ లేదు. దశరథునికి ముగ్గురు భార్యలు లేరా? ఆ కృష్ణ పరమాత్ముడికి ఏకంగా ఎనిమిది మంది భార్యలు ఉన్నారే! చివరకు ఆదిభిక్షువైన ఆ పరమశివునికి కూడా గంగ, గౌరి ఇద్దరూ భార్యలుగా ఉన్నారు కదా!’ అని వాదించారు.మృగశృంగుడు వారికి బదులివ్వలేక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.ఈలోగా పెద్దలైన కొందరు మునులు కలగజేసుకుని, ‘మృగశృంగా! అభ్యంతరం చెప్పకు. ఈ కన్యలిద్దరిని కూడా వారి మనోభీష్టం మేరకు పెళ్లాడు. బహుభార్యలను కలిగి ఉండటం శాస్త్రవిరుద్ధం కాదు. మొండిగా నువ్వు వారిని తిరస్కరిస్తే, వారు బాధపడి కన్నీరుపెడితే నీకు జయం కాదు’ అని నచ్చచెప్పారు.పెద్దలందరూ నచ్చజెప్పడంతో చివరకు మృగశృంగుడు సుశీల చెలికత్తెలిద్దరిని కూడా వివాహమాడాడు.
∙సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment