అహ్మదాబాద్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్.. గుజరాత్ 204 పరుగులు చేయగా.. భారీ లక్ష్యంతో కేకేఆర్ బరిలోకి దిగింది. మ్యాచ్ ముగింపు దశకు వచ్చే సరికి కోల్‌కతా ఓటమి దాదాపు ఖాయమైంది. విజయంపై ఎవరికీ ఎలాంటి అంచనాల్లేవు. ఆట ఆఖరి ఓవర్‌కు చేరింది. చివరి 5 బంతుల్లో 28 పరుగులు కావాలి. అంటే కచ్చితంగా ప్రతి బంతికీ సిక్సర్ రావాల్సిందే.
ఐపీఎల్ చరిత్రలో గానీ అంతర్జాతీయ టి20ల్లో గానీ ఇది ఎప్పుడూ సాధ్యం కాలేదు. దాంతో గుజరాత్ ఆటగాళ్లు తమ గెలుపు ఖాయమైందని భావించి నిశ్చింతగా ఉన్నారు. అయితే బ్యాటింగ్ చేస్తున్న ఆ యువకుడు అందరికంటే భిన్నంగా ఆలోచించాడు. తన ఆటపై అచంచల విశ్వాసం ఉన్న అతను ఆ పరుగులు ఎందుకు సాధ్యం కావు అనుకున్నాడు. మానసికంగా కూడా ఎంతో దృఢమైన అతను బయటకు ఎలాంటి భావోద్వేగాలు చూపించలేదు. సిక్సర్ల కోసం సిద్ధమైపోయాడు.
గుజరాత్ బౌలర్ యశ్ దయాల్ ఒక్కో బంతిని వేస్తూ వచ్చాడు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు.. ఇలా బంతి స్టాండ్స్‌లోకి వెళుతూనే ఉంది. అనూహ్యం, అద్భుతం, అసాధారణం..లాంటి ఏ విశ్లేషణలకూ సరిపోని రీతిలో ఆ వీరంగం సాగింది. 6, 6, 6, 6, 6 .. ఐదు సిక్సర్లతో 30 పరుగులు రాబట్టి ఆ బ్యాటర్ జట్టును గెలిపించాడు.
తన సత్తాతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆ యువకుడే 26 ఏళ్ల రింకూ సింగ్. అతను ఒక్క రోజులో స్టార్‌గా మారేందుకు ఆ ఐపీఎల్ మ్యాచ్ ఒక వేదిక అయింది. అయితే ఈ ఐదు సిక్సర్లతో మాత్రమే రింకూ గొప్ప ఆటగాడిగా మారిపోలేదు. ఈ మ్యాచ్‌కంటే ముందు కూడా అతను ఈ స్థాయికి ఎదిగేందుకు కష్టపడిన తీరు, పోరాటం, పట్టుదల అతనిని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇక్కడి వరకు సాగిన అతని ప్రయాణం ఆసక్తికరం, స్ఫూర్తిదాయకం. -మొహమ్మద్ అబ్దుల్ హాది
కొంతకాలం కిందటి వరకూ క్రికెట్ అందరి ఆట. సామాన్యుడు కూడా తన ఆటతో ఉన్నత స్థాయికి చేరేందుకు మంచి అవకాశాలు మెండుగా ఉండేవి. అయితే ఐపీఎల్ కారణంగా క్రికెట్‌లో బాగా డబ్బు చేరడంతో అందులో అడుగుపెట్టి పైస్థాయికి చేరడం కష్టంగా మారిపోయిన పరిస్థితి. మంచి నేపథ్యం లేదా డబ్బు ఉండటం లేదా పెద్ద పరిచయాలు.. ఇలాంటివేవీ లేకుండా క్రికెట్ ప్రపంచంలో మనుగడ కష్టం.
ఇది స్కూల్ క్రికెట్, అండర్ –13 స్థాయి నుంచే కనిపిస్తుంది. ఆటలో సత్తా ఉన్నా జట్టులో చోటు దక్కించుకోవడం, ప్రాథమిక దశలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశాలు రావడం అంత సులువు కాదు. ఉత్తరప్రదేశ్‌లాంటి రాష్ట్ర సంఘాల్లో ఇది చాలా చాలా ఎక్కువ. అలాంటి చోట నెగ్గాలంటే అసాధారణ ప్రతిభ ఉండాలి. ఆ ప్లేయర్ ఆటను చూసి ఇక అతనిని ఆపలేమని, అవకాశం కల్పించక తప్పదనే పరిస్థితి కల్పించాలి.
ఇక్కడే రింకూ సింగ్‌లాంటి కుర్రాడు అందరికీ ఆదర్శంగా నిలుస్తాడు. తనలోని ఆట, ఆత్మవిశ్వాసమే అతడిని పైస్థాయి వరకు చేర్చింది. ఏ రకంగా చూసినా రింకూది కనీసం మధ్య తరగతి కూడా కాదు. అతని తండ్రి గ్యాస్ ఏజెన్సీలో సిలిండర్లు సరఫరా చేసే ఉద్యోగి. అది తప్ప మరో ఆదాయవనరు లేదు. అలాంటి నేపథ్యంలో అతను క్రికెట్‌ను ఎంచుకోవడం పెద్ద సాహసమే. తండ్రి కూడా ఫలానాది చేయమని, వద్దని వారించే స్థితిలో లేడు.
దాంతో చిన్న వయసులోనే అన్నీ తానై రింకూ సొంత నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. కొందరు మిత్రుల కారణంగా క్రికెట్ వైపు ఆకర్షితుడైన రింకూ కొద్ది రోజుల్లోనే అద్భుత ఆటగాడు అనే దశకు చేరాడు. తన నేపథ్యం కారణంగా స్కూల్ క్రికెట్ ఆడే అవకాశం అతనికి రాలేదు. కానీ క్లబ్ క్రికెట్‌లో రింకూ అనే ఒక కుర్రాడు ఉన్నాడని, భారీ షాట్లతో విరుచుకుపడతాడనే గుర్తింపు వచ్చింది.
మరోవైపు సహజంగానే రోజూవారీ ఖర్చులకు సంబంధించి సమస్యలు వద్దనుకున్నా తోడొచ్చాయి. తనూ ఏదైనా పని చేస్తే తప్ప తనకూ, ఇంటికీ ఉపయోగపడలేడని అర్థమైంది. క్రికెట్ ఆడే టైమ్ మినహా తతిమా సమయాల్లో ఎలాంటి పని దొరికినా చేయడానికి సిద్ధపడ్డాడు.
ఒక కోచింగ్ సెంటర్‌లో చిన్న చిన్న పనులతో పాటు స్వీపర్‌గా ఆఫీస్‌ను శుభ్రం చేసే పని కూడా చేశాడు. అయితే ఏనాడూ అతను ఈ విషయంలో చింతించలేదు. ఎట్టి పరిస్థితుల్లో తన క్రికెట్ ఆట మాత్రం ఆగకూడదని ఆశించాడు. తన భవిష్యత్తుపై గట్టి నమ్మకం ఉంచాడు.
అలా మొదలైన ఆట..
రింకూ దూకుడైన ఆట గురించి యూపీ క్రికెట్ వర్గాల్లో బాగా చర్చకు వచ్చింది. దాంతో 2013లో తొలిసారి యూపీ అండర్–16 జట్టులో చోటు లభించింది. ఆ ఎంపికతో అధికారికంగా అతని ఆటకు ఆమోద ముద్ర పడింది. ఆ తొలి అవకాశాన్ని అతను వృథా చేసుకోలేదు. బంతిని చూడటం, బలంగా బాదడం.. తనకు తెలిసిన విద్యనే అంతటా ప్రదర్శించి యూపీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
ఫలితంగా యూపీ అండర్–19 టీమ్‌లోకి రావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. దేశవ్యాప్తంగా అందరి దృష్టీ ఉండే అండర్–19 స్థాయికి వచ్చాక రింకూ ప్రదర్శనలే అతని విలువేంటో చూపించాయి. ఆపై వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేని రీతిలో రింకూ ఆట సాగింది. మరోవైపు అండర్–16 స్థాయి నుంచే తనకు డైలీ అలవెన్స్‌ల రూపంలో వచ్చే చిన్న చిన్న మొత్తాలను కూడా పొదుపు చేసుకుంటూ.. ఇంటి ఖర్చుల కోసం దాచుకునే విషయంలో సగటు దిగువ మధ్య తరగతి మనస్తత్వాన్నే అనుసరించాడు.
భారీ షాట్లు కొట్టడం, ఏ బౌలర్‌నైనా లెక్క చేయకుండా ఆధిపత్యాన్ని ప్రదర్శించడం, కీలక సమయాల్లో కూడా ఒత్తిడి లేకుండా ఆడటం వంటి అర్హతలు రింకూ స్థానాన్ని సుస్థిరం చేశాయి. ఈ క్రమంలో 17 ఏళ్ల వయసులోనే యూపీ సీనియర్ వన్డే జట్టులో, టి20 టీమ్‌లో చోటు సంపాదించుకున్నాడు.
త్రిపురతో జరిగిన వన్డేలో 44 బంతుల్లోనే 91 పరుగులు బాదడంతో అతను నిలబడగలడనే నమ్మకం కలిగింది. రెండేళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో ఆడే అవకాశం రావడంతో దేశవాళీ క్రికెట్‌లో మూడు ఫార్మాట్‌లలో రింకూ ప్రధాన ఆటగాడిగా మారిపోయాడు.
ఐపీఎల్ ప్రస్థానం..
తమ టీమ్‌లోకి తీసుకునేందుకు ఐపీఎల్ జట్లు టాలెంట్ సెర్చ్ క్యాంప్‌లు నిర్వహిస్తుంటాయి. అందులో భాగంగా ముంబై ఇండియన్స్ కూడా సెలక్షన్స్ ఏర్పాటు చేసింది. ఒక మ్యాచ్‌లో 18 ఏళ్ల రింకూ 31 బంతుల్లోనే 95 పరుగులు బాది సంచలనం సృష్టించాడు. చివరకు వేర్వేరు కారణాలతో ముంబై అవకాశం ఇవ్వకపోయినా కొద్దిరోజులకే అతని ప్రతిభ గురించి తెలిసిన పంజాబ్ జట్టు రూ. 10 లక్షలకు రింకూను సొంతం చేసుకుంది.
తర్వాతి సీజన్‌లోనే 2018లో జరిగిన ఐపీఎల్ వేలంలో రూ. 20 లక్షల కనీస విలువతో అతను బరిలో నిలవగా, నాలుగు రెట్లు ఎక్కువగా రూ. 80 లక్షలకు కోల్‌కతా ఎంచుకుంది. ఇదే అతని కెరీర్‌లో మేలి మలుపు. తొలి మూడు సీజన్లలో తగినన్ని అవకాశాలు రాకపోయినా 2022లో ఫినిషర్‌గా ఇచ్చిన పాత్రలో అతను చెలరేగిపోయాడు. ముఖ్యంగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 15 బంతుల్లో 40 పరుగులు చేయడంతో అతని విలువ తెలిసింది.
ఈ సీజన్‌లోనైతే తన మెరుపు బ్యాటింగ్‌తో ప్రత్యేక ముద్ర వేసిన రింకూ కేకేఆర్ తరఫున టాప్‌స్కోరర్‌గా నిలవడం విశేషం. ఇదే ఆట రింకూకు భారత టి20 జట్టులో చోటు కల్పించగా అక్కడ చెలరేగిపోయిన ఈ యూపీ బ్యాటర్ 2024 టి20 వరల్డ్ కప్ కోసం తన అవకాశాలు మెరుగుపరచుకున్నాడు.
ఇప్పటి వరకు భారత్ తరఫున 6 ఇన్నింగ్సే ఆడిన రింకూ 96 బంతుల్లోనే 180 పరుగులు సాధించాడు. ఇందులో 134 పరుగులు ఫోర్లు, సిక్సర్ల ద్వారానే వచ్చాయి.
హాస్టల్ సౌకర్యం కల్పించి..
భారత జట్టు క్రికెటర్‌గా ఎదిగినా రింకూ తన మూలాలను మర్చిపోలేదు. డబ్బు విలువ బాగా తెలిసినవాడిగా దానిని సమర్థంగా వాడుకోవడం కూడా ముఖ్యమని భావించాడు. ముందుగా తన ఇంటి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దిన అనంతరం అతను చేసిన పని రింకూపై మరింత గౌరవాన్ని పెంచింది.
తన స్వస్థలమైన అలీగఢ్‌లో.. తాను ఓనమాలు నేర్చుకున్న కోచింగ్ సెంటర్‌లో క్రికెట్ నేర్చుకునేందుకు వచ్చే పేద ఆటగాళ్ల కోసం రూ. 50 లక్షలు వెచ్చించి.. హాస్టల్ బిల్డింగ్ కట్టించాడు. ఆట కోసం వచ్చి.. భారీ అద్దెలు కడుతున్నవారి కోసమే ఈ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు అతను చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment