
ఉదయం పది గంటలు.. ఆఫీస్‌లో సీత తన టేబుల్ మీదున్న ఫైల్స్ చూస్తోందన్న మాటే కానీ, ఏమీ బుర్రలోకి ఎక్కడం లేదు. తన ఆలోచనలకు కారణం లేకపోలేదు. ఈ రోజు తన మేనమామ వస్తున్నాడు. అతనికి ఎదో ఒక నిర్ణయం చెప్పాలి. గత అయిదారు సంవత్సరాల నుంచి నెట్టుకొస్తూ ఉంది. సీతకు 30 ఏళ్లు ఉంటాయి. పుట్టిన వెంటనే పోలియో వచ్చి కుడి కాలు కుంటుపడింది.
ఆ లోపం తనను హేళన చేసినా పట్టుదలతో డిగ్రీ పూర్తి చేసింది. తండ్రి చనిపోతే ఆయన చేసే ఉద్యోగం సీతకు ఇచ్చారు. తల్లి, చెల్లెలు, తమ్ముడికి ఆమే ఆర్థిక ఆధారం. మేనమామ కొడుకు భాస్కరం, హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. సీతను భాస్కరానికి ఇచ్చి పెళ్లి చేయాలని మేనమామ ఉద్దేశం. మేనమామ మంచి మనసుతోనే ఆలోచించాడు కానీ, తను పెళ్లి చేసుకుని హైదరాబాద్ వెళ్లిపోతే, తన కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? తమ్ముడు డిగ్రీ మూడవ సంవత్సరంలో ఉన్నాడు. చెల్లెలు పదవ తరగతి అయిందనిపించింది. కనీసం ఇంకొక రెండేళ్లకైనా చెల్లి పెళ్లి చెయ్యాలి. ఈ బాధ్యతలన్నీ పెట్టుకుని తను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే ఎలా?
‘సీతా! నిన్న నువ్వు సబ్‌మిట్ చేసిన బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో ఎన్ని తప్పులున్నాయో తెలుసా?’ సెక్షన్ హెడ్ దామోదరంగారి అరుపులాంటి పిలుపుతో ఆమె ఈ లోకంలోకి వచ్చింది. సెక్షన్‌లో అందరూ తన వైపు అదోలా చూస్తున్నారు. గబుక్కున, సీట్లోంచి లేచి నెమ్మదిగా ఆయన దగ్గరకు వెళ్లి ‘సారీ సర్, మళ్లీ తయారు చేస్తాను. ఇవ్వండి’ అంటూ అయన దగ్గర ఫైల్ తీసుకుని మళ్లీ తన సీట్‌కి వచ్చింది. ‘ఎందుకు ఆఫీస్‌కి వస్తారో తెలియదు. ఎప్పుడూ ఎదో ఒక తప్పు ఉంటూనే ఉంటుంది చేసే పనిలో’ నసుగుతున్నాడు దామోదరం. క్యాషియర్ సుధాకర్ ఆమెవంక చూస్తూన్నాడు జాలిగా.
∙∙
‘ఏమే అమ్మాయి.. ఏమి ఆలోచించావ్? నీ పరిస్థితి తెలిసి కూడా మీ మామయ్య భాస్కరానికిచ్చి చేస్తాను అంటుంటే నువ్వు ఎందుకు ఒప్పుకోవడం లేదో తెలియడం లేదు’అని అడిగింది ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన కూతురికి టీ అందిస్తూ పార్వతి. ‘ఏమిటమ్మా.. నువ్వు కూడా! నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే ఇల్లెలా గడుస్తుంది? తమ్ముడి డిగ్రీ అయిపోయి వాడు ఏదో ఒక ఉద్యోగంలో చేరితే నాకు నిశ్చింత. అప్పుడు నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోయినా పరవాలేదు’ చెప్పింది సీత.
‘అలా ఆలోచిస్తూ కూర్చుంటే నీ అచ్చటా–ముచ్చటా ఎప్పటికి తీరేను? నారు పోసిన వాడే నీరు పోస్తాడు. మీ నాన్న పెన్షన్ ఎంతో కొంత వస్తోంది. డిపోజిట్ మీద వడ్డీ వస్తోంది. ఏదోలా సర్దుకుంటాం. ఇప్పుడైతే పెళ్లి ఖర్చులు అన్నీ తనే చూసుకుంటానంటున్నాడు మీ మామయ్య. నీ కాలు ఇలా ఉంటే, ఎవడు ముందుకు వస్తాడు నిన్ను చేసుకోవడానికి? తల్లినై ఉండీ ఇలా నీ కాలు గురించి మాట్లాడటం నాకూ ఇబ్బందిగానే ఉంది’ అంటూ ఆగింది పార్వతి.
‘నువ్వు ఎన్నయినా చెప్పమ్మా.. నా పెళ్లికి ఇంకో సంవత్సరం ఆగాల్సిందే’ స్పష్టం చేసింది సీత. ఆ రాత్రి ఎనిమిదింటికి సీత మేనమామ రామారావు రానేవచ్చాడు. పలకరింపులు, యోగక్షేమాలు.. పిచ్చాపాటి కబుర్లూ అయినతర్వాత మెల్లిగా అసలు విషయం కదిపాడు రామారావు ‘పెళ్లి సంగతి ఏమాలోచించారు?’ అంటూ. ‘మామయ్యా.. ఈ కుంటిదాన్ని నీ కోడలిగా చేసుకుంటానంటున్నావు. నిజంగా నా అదృష్టమే. అయితే ఒక్క ఏడాది ఆగితే.. తమ్ముడు ఎదో ఉద్యోగం చూసుకుంటాడు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని మీ ఇంటికి వచ్చేస్తే వీళ్ళంతా ఏమైపోతారు మామయ్యా!’ అంది సీత సమాధానంగా.
‘నా పరిస్థితి మీకు తెలుసు. అడదిక్కు లేని సంసారం. చెబితే మీరు అర్థం చేసుకోవడం లేదు. కోరి వస్తున్న అదృష్టాన్ని కాలదన్నుకుంటున్నారు. మిమ్మల్నిక ఎవ్వరూ బాగుచెయ్యలేరు’ అంటున్న రామారావు స్వరంలో విసుగు, కోపాన్ని గ్రహించింది పార్వతి. కూతురిని సముదాయించలేక మౌనంగా ఉండిపోయింది. తెల్లవారు ఝామునే తిరుగు ప్రయాణమయ్యాడు రామారావు.
∙∙
మర్నాడు సీతకి ఫోన్ చేశాడు భాస్కరం. మన పెళ్లి అయిపోతే అత్తయ్య వాళ్ల బాధ్యతను తీసుకోలేమని ఎందుకను కుంటున్నావ్? చిన్నప్పటి నుంచీ నేను నీలో చూసింది మంచితనాన్ని.. అవిటితనాన్ని కాదు. నిన్ను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అనుకున్నాను. కానీ నువ్వు మూర్ఖంగా ఆలోచిస్తున్నావ్.. నీ ఇష్టం’ అంటూ ఫోన్ పెట్టేశాడు. మనసులో కుమిలిపోవడం తప్ప ఏమీ చెయ్యలేకపోయింది సీత. ఒక నెల తర్వాత భాస్కరం పెళ్లి శుభలేక వచ్చింది. సంతోషించాలో, బాధపడాలో తెలియక వారి వారి భావాలను వారిలోనే దాచేసుకున్నారు పార్వతి, సీత.
మర్నాడు ఆఫీస్ క్యాంటీన్‌లో సీత ఒంటరిగా టేబుల్ మీద తల వాల్చి కూర్చుంది. మనసులో బాధ ఎవరితో పంచుకోవాలి? భాస్కరం అంటే తనకూ ఇష్టమే. ఆమె ఏకాంతాన్ని భగ్నం చేస్తూ ‘ఏమండీ సీతగారూ.. ఒంట్లో బాగా లేదా? సెలవు పెట్టి వెళ్లిపోవచ్చు కదా’ అంటూ వచ్చాడు క్యాషియర్ సుధాకర్. తలెత్తి చూస్తూ ‘బాగానే ఉన్నాను. ఎప్పుడూ ఉండే ఇంటి సమస్యలే’ చెప్పింది సీత.
‘కాఫీ తాగితే కాస్త రిలీఫ్‌గా ఉంటుంది’ కౌంటర్ దగ్గరకు వెళ్లి రెండు కాఫీ కప్‌లతో తిరిగొచ్చాడు. మొహమాటపడుతూనే కాఫీ అందుకుని రెండు గుటకలు వేసింది. నిజంగానే వేడి వేడి కాఫీ తాగేసరికి గొంతుకే కాదు మనసుకూ కాస్త ఉపశమనం కలిగినట్టయింది సీతకు. పది నిమిషాల పాటు ఏదో మాట్లాడాననిపించి తన సెక్షన్‌కు వెళ్లిపోయింది సీత. సాయంత్రం ఆఫీస్ వదిలేశాక.. సీత కొలీగ్ వైదేహిని కలిశాడు సుధాకర్. ‘పాపం సీతగారు దేనికో బాధపడుతున్నట్లున్నారు. గమనించారా?’అని అడిగాడు.
‘బాధపడక ఏం చేస్తుంది?’ అంది వైదేహి. ‘అదేంటలా అంటున్నారు? ఇప్పుడు ఆవిడకు వచ్చిన బాధ ఏంటి?’ ఆశ్చర్యపోయాడు సుధాకర్. ‘తన బావ తనను అర్థంచేసుకొని తన బాధ్యతలు తీరేవరకు తనకోసం వెయిట్ చేస్తాడనుకుంది. కానీ అతను వేరే అమ్మాయిని పెళ్లిచేసుకోబోతున్నాడట’ చెప్పింది వైదేహి.
‘అయ్యో!’ అన్నాడు. ‘అవకాశం వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి. చేజారి పోయక బాధపడితే ఏం లాభం? సర్లెండి.. వస్తాను. బాగా ఆలస్యం అయిపోతుంది ఇంటికి వెళ్లేసరికి’ అంటూ వెళ్ళిపోయింది వైదేహి. ఆలోచనల్లో పడ్డాడు సుధాకర్. నిజంగా ఆమె ఎంత మంచిది కాకపోతే, తన కుటుంబం కోసం.. వచ్చిన అవకాశాన్ని వదులుకుంటుంది? ఆ రాత్రి సుధాకర్‌కి నిద్ర పట్టలేదు. సుధాకర్‌కు తల్లీ, తండ్రీ ఎవరూ లేరు. ఎప్పుడూ ఎవరికో ఒకరికి సహాయం చేసే వ్యక్తిత్వం. సీత గురించి ఆలోచనలతోనే ఆ పొద్దు తెల్లవారింది అతనికి.
∙∙
ఆ రోజు.. తన కూతురు పుట్టినరోజని.. పార్టీ ఇస్తున్నాం.. తప్పకుండా రావాలని సీతను పిలిచింది వైదేహి. ఆఫీసులో ఎవరినీ పిలవకుండా తనొక్కర్తినే పిలవడంతో కొంచెం మొహమాటపడింది సీత. ‘ఏమీ లేదు సీతా.. నీతో కాస్త సరదాగా గడపాలని యీ పార్టీ వంకతో నిన్ను రమ్మన్నాను’ సీత మొహమాటాన్ని అర్థం చేసుకున్న వైదేహి. ఆ రోజు పార్టీకి వెళ్ళింది సీత. కేక్ కట్ చేశాక పిల్లలు అందరూ కలిసి అడుకుంటున్నారు.
వైదేహి భర్త శ్యామ్, వైదేహి, సీత హాల్లో కూర్చుని కూల్‌డ్రింక్ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. ‘ఆఫీస్‌లో నాకు క్లోజ్ ఫ్రెండ్ అంటే సీతేనండి. తన ఆలోచనా విధానం బాగుంటుంది. ఎవరు ఏమన్నా పట్టించుకోదు. తన వారికోసం పెళ్లి వాయిదా వేసుకుంటూ వస్తోంది’ అంటూ తన భర్తకు సీత వివరం చెప్పింది వైదేహి.
‘సీతగారూ.. ఇలా సమయం చిక్కినప్పుడల్లా మీ గురించి మా ఆవిడ చెబుతూనే ఉంటుంది. మీరు ఏమీ అనుకోకపోతే ఒక్కటి చెబుతాను. మీ కుటుంబం కోసం మీరు చేస్తున్న త్యాగం మంచిదే. కానీ ఒక విషయం మర్చిపోతున్నారు. మీలాగే మీ తమ్ముడూ ‘నా వారిని పోషించాలి’ అని ఆలోచిస్తాడని మీరు చెప్పగలరా? తనకి రెక్కలు వస్తే ఎగిరిపోతాడు. అప్పుడూ ఇలాగే మీరు పెళ్లి చేసుకోకుండా ఉండిపోతారా?
మీకొక జీవితం ఉందని మీరు తెలుసుకోవాలి. ఒక గిరి గీసుకుని.. అందులోనే ఉండిపోతున్నారు. అదే న్యాయం అనుకుంటున్నారు. మీ భవిష్యత్తుని మీరే పాడు చేసుకుంటున్నారు. సారీ! మీ మనసు నొప్పించి ఉంటే క్షమించండి. నాకు చెప్పాలనిపించింది, చెప్పాను’ అంటూ ఆపాడు శ్యామ్. అవాక్కయింది వైదేహి. తన భర్త ఇంతలా మాట్లాడటం ఇదే మొదటిసారి. ఏమీ మాట్లడలేదు సీత. కాసేపు ఆ కుటుంబంతో గడిపి ఇంటికి వెళ్లిపోయింది. కాని ఆ రాత్రి ఆమెకు నిద్ర కరువే అయింది.
మర్నాడు ఆఫీస్‌లో ‘సారీ, సీతా.. మా ఆయన మాటలకు నువ్వు బాధపడి ఉంటావు’ అంటూ సంజాయిషీలా చెప్పింది వైదేహి. ‘అదేమీ లేదు. మీ వారు అన్నదాంట్లో నిజం లేకపోలేదు. మా నాన్న ఉండుంటే నాకీ పరిస్థితి వచ్చేది కాదు’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సీత. ‘నువ్వు పెళ్లి చేసుకున్నా మీ వాళ్లకు సహాయపడొచ్చు సీతా.. .ఉన్న ఊరిలోనే ఏదైన సంబంధం వస్తే, పెళ్లి చేసేసుకో’ చెప్పింది వైదేహి.
‘దొరకాలిగా ఈ గంతకు తగ్గ బొంత’ అన్నది సీత. ‘హమ్మయ్య! పెళ్లికి ఒప్పుకున్నావు. అదే చాలు. వరుడు సిద్ధంగా ఉన్నాడు’ అంది వైదేహి సంతోషంగా. ఆశ్చర్యంగా చూసింది సీత. వారం కిందట ఏం జరిగిందో సీతకు వివరించింది వైదేహి.
∙∙
వైదేహి వాళ్లింటికి వెళ్ళాడు సుధాకర్. అతణ్ణి శ్యామ్‌కి పరిచయం చేసి లోపలకు వెళ్లి ట్రేలో మూడుకాఫీలు తీసుకొచ్చి భర్తకు ఒక కప్పు అందించి, సుధాకర్‌కూ ఒక కప్పు అందించి తనూ ఓ కప్పు తీసుకుని, ట్రే టీపాయి మీద పెట్టి, సుధాకర్ కేసి చూడసాగింది.. ‘ఎప్పుడూ లేంది ఈ రోజు ఇలా వచ్చాడేంటీ?’ అనుకుంటూ. సుధాకర్ కాఫీ సిప్ చేస్తూ ‘మీతో ఒక మాట చెప్పాలని వచ్చాను’ అంటూ ఆగి.. కాఫీ తాగడం ముగించి, కప్పు ట్రేలో పెట్టి చెప్పసాగాడు.
‘ఆ రోజు, మీరు సీతగారి గురించి చెప్పింది విన్నాక బాగా ఆలోచించాను. ఆవిడకు అభ్యంతరం లేకపోతే ఆవిడను నేను పెళ్లి చేసుకుంటాను. నా గురించి మీకు అంతా తెలుసు. నేను వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను. ఆమెకున్న బాధ్యతలన్నిటినీ నా బాధ్యతలుగా భావిస్తాను. ఏమంటారు?’ అని ఆగాడు. శ్యామ్ అందుకుంటూ ‘భేష్! మంచి ఆలోచన’ అంటూ సుధాకర్‌ను మెచ్చుకున్నాడు.
వైదేహి ఒకవైపు సంతోషిస్తూనే ‘ఏమోనండి బాబూ! అదో తిక్క మనిషి. యీ పెళ్లికి ఒప్పుకుంటుందో లేదో!’ అని సంశయం వెలిబుచ్చింది. ‘నువ్వో పనిచెయ్ వైదేహీ.. వచ్చే వారం మన అమ్మాయి బర్త్ డే కదా.. ఆ పార్టీకి సీతగారిని పిలు. నువ్వూ, నేనూ కలిసి ఆవిడ బ్రెయిన్ వాష్ చేద్దాం. ఏమంటావ్?’అన్నాడు శ్యామ్. ‘ఆలోచనైతే బాగుంది.. ట్రై చేద్దాం’ అంది.
∙∙
అలా వైదేహి చెప్పిందంతా విన్న సీత.. సుధాకర్ గురించి ఆలోచించసాగింది. అది గమనించిన వైదేహి ‘చూడు, సీతా.. మరింకేమీ ఆలోచించకు. సుధాకర్ చాలా మంచివాడు. వచ్చే ఆదివారం మీ ఇంటికి వచ్చి మీ అమ్మ గారితో కూడా మాట్లాడతాను’ అని చెప్పేసి.. మరింక మాట్లాడే అవకాశం సీతకు ఇవ్వకుండా అక్కడనుంచి వెళ్ళిపోయింది. ఆదివారం రానే వచ్చింది. వైదేహి, శ్యామ్.. సీతా వాళ్లింటికి వచ్చారు. తన వారిని వైదేహి దంపతులకు పరిచయం చేసింది సీత.
‘ఆంటీ! సీత ఎదురుగా చెప్పకూడదు కానీ, నిజంగా ఇలాంటి కూతురు ఉండటం మీ అదృష్టం’ అంటూ కాసేపాగి మళ్లీ చెప్పుకొచ్చింది.. ‘సీత కోసం మేమొక సంబంధం తెచ్చాం. ఉన్న ఊర్లోనే సంబంధం. మంచి పిల్లాడు’ అంటూ. సీత వైపు చూసింది పార్వతి. మౌనంగా తల వంచుకుంది సీత. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వైదేహి ‘తథాస్తు! మౌనం అంగీకారానికి సూచన’ అంటూ భర్త వైపు చూసింది. వెంటనే శ్యామ్ తనతో తెచ్చిన బ్యాగ్‌లోంచి స్వీట్ పాకెట్ తీసి వైదేహి చేతిలో పెట్టాడు.
‘నేను ఒకసారి సుధాకర్‌గారితో మాట్లాడాలి’అంది సీత. ‘దానికేం భాగ్యం? అలాగే మాట్లాడు’ అంటూ పార్వతి వైపు తిరిగి ‘ఆంటీ! మరి మేం వస్తాం. తొందర్లో ముహూర్తాలు పెట్టించండి. మాకు పప్పన్నం పెట్టండి’ అంది వైదేహి. మరునాడు.. ఆఫీస్ క్యాంటీన్‌లో సుధాకర్‌తో మాట్లాడుతూ సీత ‘సుధాకర్ గారూ! మా తమ్ముడు స్థిరపడేంత వరకు నేను మా కుటుంబానికి ఆర్థిక సాయం చేయవలసి ఉంటుంది’ అంది.
‘నాకంతా తెలుసు. నా గురించి మీకు అనుమానమే అక్కర్లేదు. మీ జీతం పూర్తిగా మీ వాళ్ళకు ఇచ్చేయండి. నా జీతంతో మనిద్దరం హాయిగా గడపవచ్చు.. ఓకేనా?’ అంటూ భరోసా ఇచ్చాడు సుధాకర్. సీత, సుధాకర్‌ల వివాహం జరిగిపోయింది. మగపెళ్ళి వారి తరపున వైదేహి చేసిన హడావుడి ఇంతా అంతా కాదు.
-∙నిష్ఠల సుబ్రహ్మణ్యం
చదవండి: కథ: వి‘చిత్ర’ దొంగతనం