చెరగని సిరా.. చెదరని ‘ముద్ర’ | Indelible Ink manufacturing is in Hyderabad Itself | Sakshi
Sakshi News home page

చెరగని సిరా.. చెదరని ‘ముద్ర’

Published Tue, Nov 13 2018 2:37 AM | Last Updated on Tue, Nov 13 2018 2:37 AM

Indelible Ink manufacturing is in Hyderabad Itself - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మీ వేలికి ఉన్న సిరాచుక్క దేశ ప్రగతికి దిక్సూచి అన్నట్టుగా... ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికల సమయంలో కీలకభూమిక పోషించడమే కాదు.. అందరికీ సుపరిచితమైన సిరా చుక్క తయారీకి గ్రేటర్‌ హైదరాబాద్‌ చిరునామాగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు వంద దేశాలతోపాటు మన దేశంలోని 29 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు రాష్ట్ర రాజధాని నగరం నుంచే సిరా చుక్క ఎగుమతి చేస్తుండటం విశేషం. నగరం కేంద్రంగా మూడు దశాబ్దాలకుపైగా ఈ మహాక్రతువును నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న సంస్థ రాయుడు లేబొరేటరీస్‌ కావడం విశేషం.  

వేలిపై సిరా చుక్క.. ఓటుకు చిహ్నం.. 
మనం ఓటేశామని చెప్పడానికి గుర్తు మాత్రమే కాదు.. దొంగ ఓట్లను నిరోధించే ఆయుధం కూడా సిరా చుక్కే. అందుకే, మన దేశంతోపాటు చాలా దేశాలు ఎన్నికలవేళ ఓటేసిన అభ్యర్థికి సిరా చుక్క పెట్టడం తప్పనిసరి చేశాయి. భారత ఎన్నికల సంఘంలోని నిబంధన 37(1) ప్రకారం ఓటు వేసిన వ్యక్తి ఎడమ చేయి చూపుడు వేలుపై సిరా గుర్తును పరిశీలించాల్సిన బాధ్యత పోలింగ్‌ అధికారిపై ఉంటుంది. ఒకవేళ ఓటరుకు ఎడమ చేయి చూపుడు వేలు లేనట్లయితే వేరే ఏ వేలుకైనా సిరా చుక్క పెట్టాలి.  

100 దేశాలకు హైదరాబాద్‌ నుంచే ఎగుమతి... 
భారత్‌లో ప్రధానంగా రెండు సంస్థలు మాత్రమే ఎన్నికల సిరాను తయారు చేస్తున్నాయి. కర్ణాటకలోని మైసూర్‌ పెయింట్స్‌ అండ్‌ వార్నిష్‌ లిమిటెడ్‌(ఎంపీవీఎల్‌) ఒకటికాగా.. హైదరాబాద్‌ ఉప్పల్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాలోని రాయుడు లేబొరేటరీస్‌ మరొకటి కావడం విశేషం. భారత ఎన్నికల సంఘం మైసూర్‌ పెయింట్స్‌ అండ్‌ వార్నిష్‌ లిమిటెడ్‌తోపాటు రాయుడు లెబొరేటరీస్‌ తయారు చేస్తున్న సిరాను ఎక్కువగా వినియోగిస్తోంది. ’ఎన్నికల కోసం దాదాపు 100 దేశాలకు చెరగని సిరా(ఇండెలిబుల్‌ ఇంక్‌)ను సరఫరా చేస్తున్నాం. ఇండియా, శ్రీలంకతోపాటు దక్షిణాఫ్రికా, లిస్బెన్, మడగాస్కర్, నైజీరియా, మాలే, ఒమన్, మాల్దీవులు, మొజాంబిక్, రువాండా, జాంబియా, ఇథియోపియా, ఈస్టర్‌ తిమోర్‌ తదితర దేశాలు మా వినియోగదారులుగా ఉన్నాయి’ అని రాయుడు లేబొరేటరీస్‌ సీఈవో శశాంక్‌ రాయుడు ‘సాక్షి’కి తెలిపారు. భారత్‌లోని చాలా రాష్ట్రాల్లో జరిగే మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో తమ సిరానే ఉపయోగిస్తున్నారని చెప్పారు. 37 ఏళ్లుగా రాయుడు ల్యాబ్స్‌ ఇండెలిబుల్‌ ఇంక్‌ను తయారు చేస్తోందన్నారు. మొదట్లో సిరాను చిన్న(5 మి.లీ) బాటిల్స్‌లో నింపి సరఫరా చేసేవాళ్లమని, 2004 తర్వాత ఇంక్‌ మార్కర్‌లను తీసుకొచ్చామన్నారు. ఒక మార్కర్‌ లేదా ఒక ఇంకు సీసా 500 మంది ఓటర్ల వేళ్లకు సరిపోతుందని పేర్కొన్నారు. ఈ సాంకేతికతను తొలుత ప్రవేశపెట్టింది తమ రాయుడు లేబొరేటరీనేనని ఆయన వివరించారు.  

పల్స్‌ పోలియో కార్యక్రమంలోనూ..  
పల్స్‌ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు గుర్తించేందుకు వారి వేలుపై సిరా చుక్క పెడుతుంటారు.  డబ్ల్యూహెచ్‌వో కూడా ఇండెలిబుల్‌ ఇంక్‌ కోసం రాయుడు లేబొరేటరీస్‌ సంస్థతో దీర్ఘకాలిక ఒప్పం దం చేసుకుంది. ఏ దేశంలో పల్స్‌ పోలియో కార్యక్రమం జరిగినా అక్కడ ఈ సిరానే ఉపయోగిస్తుండటం విశేషం. ఇక యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం గుర్తింపు, యూనిసెఫ్‌తోపాటు, ఐఎస్‌వో 9001:2015, ఐఎస్‌వో 14001:2015, డబ్లు్యహెచ్‌వో–జీఎంపీ తదితర ధ్రువీకరణలను రాయుడు సంస్థ సాధించింది. అభివృద్ధి చెందిన జర్మ నీ తదితర దేశాలకు అల్ట్రా వయొలెట్‌ ఇంక్‌ను కూడా ఈ సంస్థ సరఫరా చేస్తోంది. అల్ట్రా వయొలెట్‌ సిరా అంటే.. ఈ సిరాచుక్క వేలిపై పెడితే కనిపించదు. కానీ ఓటరు వేలును అతినీలలోహిత కాంతి కింద పెట్టినప్పుడు దర్శనమిస్తుంది. అప్పుడు బోగస్‌ ఓటరును పసిగట్టే వీలుంటుంది. 

ఈ సిరా చుక్క ఈజీగా చెరిగిపోదు.. 
ఎన్నికల్లో వాడే సిరాను సెమి పర్మనెంట్‌ ఇంక్‌గా చెప్పొచ్చు. అంటే కొద్ది రోజులపాటు చెదిరిపోకుండా ఉండే సిరా అన్నమాట. ఈ సిరాలో కొన్ని రకాల రసాయనాలతోపాటు 10 నుంచి 18 శాతం వరకు సిల్వర్‌ నైట్రేట్‌ ఉంటుంది. ఇది వెలుతురు పడగానే గట్టిగా మారుతుంది. వేలుపై పెట్టిన తర్వాత మూడు నుంచి ఏడు రోజులపాటు చెదిరిపోకుండా ఉంటుందని శశాంక్‌ తెలిపారు.  

నాణ్యత, మన్నిక మా చిరునామా 
నాణ్యత, మన్నికతో కూడిన ఉత్పత్తులను తయారు చేయడమే మా లేబొరేటరీ ధ్యేయం. మూడున్నర దశాబ్దాల క్రితం కృష్ణా–గోదావరి ప్రింటింగ్‌ ఇంక్‌ పేరుతో మా సంస్థను స్థాపించాం. 1995లో సంస్థ పేరును రాయుడు లేబొరేటరీస్‌గా మార్చాం. ఎన్నికల సిరాతోపాటు అత్యాధునిక పద్ధతులను ఉపయోగించి సర్జికల్‌ మార్కర్‌లు, వాటర్‌ ఎరేజర్‌లు, ఇతర ఇంక్‌లను తయారు చేస్తున్నాం. మా ల్యాబ్‌లో ప్రస్తుతం 20 మంది పనిచేస్తున్నారు. ఏటా రూ.20 కోట్ల టర్నోవర్‌ సాధిస్తున్నాం.  
–శశాంక్‌ వి.రాయుడు, సీఈవో, రాయుడు లేబొరేటరీస్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement