'ఎర్ర'కోటలో హోరాహోరీ! | Chhattisgarh first phase elections is today | Sakshi
Sakshi News home page

'ఎర్ర'కోటలో హోరాహోరీ!

Published Mon, Nov 12 2018 1:35 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Chhattisgarh first phase elections is today - Sakshi

వేలిపై సిరాచుక్క కనబడితే ఖబడ్దార్‌ అని మావోయిస్టులన హెచ్చరికలు ఓవైపు.. ఓటే వజ్రాయుధం, హక్కు అంటూ ఎన్నికల సంఘం, ఎన్జీవోల చైతన్య కార్యక్రమాలు మరోవైపు. పోలీసుల బూట్ల చప్పుడు నడుమ బస్తర్‌లో నేడు తొలిదశ పోలింగ్‌ జరగనుంది. మావోయిస్టు ప్రాబల్యమున్న, అత్యంత సున్నితమైన ప్రాంతాలు కావడంతో ఈ 18 నియోజకవర్గాల్లో పోలింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో 11 ఎస్టీ రిజర్వ్‌డ్‌ స్థానాలు, ఒకటి ఎస్సీ నియోజవకర్గం. కాగా, ‘ఎర్ర’కోటలో పట్టు బిగించేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రత్యేక వ్యూహాలతో ప్రచారం చేశాయి. గత ఎన్నికల్లో 12 చోట్ల కాంగ్రెస్‌ గెలవగా.. ఆరింటిని బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. ఈసారి సంఖ్యను పెంచుకోవాలని కాంగ్రెస్‌.. పూర్వవైభవాన్ని పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. సీఎం రమణ్‌సింగ్, వాజ్‌పేయి అన్నకూతురు కరుణ శుక్లా సహా 190 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.  

 నాడు బీజేపీ కంచుకోట 
2013 ఎన్నికలకు ముందు ఈ ప్రాంతంలో బీజేపీ ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. 2008 ఎన్నికల్లో బీజేపీ 15 స్థానాల్లో గెలుపొందింది. 2003 ఎన్నికల నాటికి ఈ ప్రాంతంలో 15 స్థానాలు ఉండేవి. అప్పుడు కూడా బీజేపీ 10 స్థానాల్లో నెగ్గి బస్తర్‌పై తన పట్టుచూపించింది. అయితే గత ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌పై ప్రజలు సానుభూతి చూపించారు. ఇందుకు కారణం.. మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వాజుడుం బృందాన్ని సిద్ధం చేసిన మహేంద్ర కర్మతోపాటు కాంగ్రెస్‌ నేతలను మావోయిస్టులు హతమార్చడమే. అయితే ఈసారికూడా అదే సానుభూతితో మరిన్ని స్థానాల్లో పాగా వేయాలని కాంగ్రెస్‌ భావిస్తోంది.  

హెచ్చరికలు బేఖాతరు 
ఎన్నికల్లో పాల్గొనవద్దంటూ మావోయిస్టులు పోస్టర్లు వేయడం.. అయినా ప్రజలు యథావిధిగా ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతూనే ఉంది. ఈ ప్రాంతంలో ఏటేటా పోలింగ్‌ శాతం కూడా పెరుగుతూ వస్తోంది. 2003లో 65.68% ఓటింగ్‌ నమోదైతే, 2008లో 67.14% నమోదైంది. 2013లో రికార్డు స్థాయిలో 75.93% ఓటింగ్‌ నమోదైంది.  

త్రిముఖపోటీ ఉంటుందా? 
నిన్నటివరకు బస్తర్‌ ప్రాంతంలో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య పోరు ప్రధానంగా ఉంది. సీపీఐ, బీఎస్పీ వంటి ఇతర జాతీయ పార్టీలు, చిన్నా చితకా స్థానిక పార్టీలు ఇక్కడ ప్రభావాన్ని చూపించలేకపోయాయి. అయితే.. ఈసారి అజిత్‌ జోగి పార్టీ జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ (జేసీసీ), బీఎస్పీ, సీపీఐల కూటమి ప్రభావం ఉంటుదనిపిస్తోంది. అయితే.. ఆదివాసీల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో అజిత్‌ జోగికి మంచి పట్టు ఉన్నప్పటికీ.. ఎనిమిది స్థానాలను బీఎస్పీకి ఇవ్వడం తప్పిదమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డోంగర్‌గఢ్, డోంగర్‌గావ్, అనంత్‌గఢ్, కంకేర్, కేశ్‌కల్, కోండాగావ్, దంతేవాడ, కోంటా నియోజకవర్గాల్లో బీఎస్పీ పోటీకి దిగుతోంది. ఈ స్థానాల్లో గత ఎన్నికల్లో బీఎస్పీకి కేవలం 2% ఓట్లు మాత్రమే వచ్చాయి. అంతేకాకుండా ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌పై పోటీకి దిగుతానంటూ మొదట్లో ప్రకటించిన అజిత్‌ జోగి ఆ తర్వాత వెనుకడుగు వేయడంతో బీజేపీ, కాంగ్రెస్‌లను జేసీసీ ఢీకొట్టలేదనే అభిప్రాయం ప్రజల్లో పడింది.  

అర్బన్‌ మావోయిస్ట్‌ గీ జీఎస్టీ
కాంగ్రెస్‌ పార్టీ అర్బన్‌ మావోయిస్టులకు మద్దతుగా నిలుస్తూ నిరుపేద ఆదివాసీల అభివృద్ధికి అడ్డంకిగా మారుతోందంటూ ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు చేశారు. అయితే జీఎస్టీ, పెద్దనోట్ల ద్వారా వ్యాపారులు, సామాన్యులకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయంటూ రాహుల్‌ ప్రతివిమర్శలు చేశారు. సీఎం రమణ్‌సింగ్, మంత్రులు మహేష్‌ గాగ్డా, కేరార్‌ కశ్యప్‌లు బరిలో ఉండడంతో ఆసక్తి నెలకొంది. వీరంతా గత మూడుసార్లుగా ఎన్నికల్లో నెగ్గుతూ వస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం పాత, కొత్త  నేతల కలయికతో ముందుకెళ్తోంది. మూడుచోట్ల సిట్టింగులకు కాకుండా కొత్తవారికి చాన్స్‌ ఇచ్చింది. ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ బరిలో ఉన్న రాజ్‌నంద్‌గావ్‌లో.. కాంగ్రెస్‌ తరఫున మాజీ ప్రధాని వాజపేయి అన్న కూతురు కరుణ శుక్లాను బరిలోకి దిగటంతో పోటీ రసవత్తరంగా మారింది. నక్సల్స్‌ సమస్యని అధిగమిస్తూనే రమణ్‌సింగ్‌ రాష్టాన్ని అభివృద్ధిచేస్తున్నారన్న మంచిపేరైతే సంపాదించారు.  

దంతేవాడ
ఈ పేరు వింటేనే ఎన్‌కౌంటర్లు, తుపాకుల చప్పుళ్లే గుర్తొస్తాయి. బిక్కుబిక్కుమంటూ కాలం గడపటం ఇక్కడి ప్రజల నిత్యకృత్యమయిపోయింది. గత ఎన్నికల్లో ఈ దంతేవాడ నియోజకవర్గంలోనే 10 వేలమంది నోటాకు ఓటేశారు. ఇదే.. రాజకీయాలపై అక్కడి ప్రజలకున్న విరక్తికి నిదర్శనం. ఇక్కడినుంచి.. కాంగ్రెస్‌ పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే, దివంగత కాంగ్రెస్‌ నేత మహేంద్ర కర్మ భార్య దేవతి కర్మనే మళ్లీ బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో ఈమె బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు.

కంకేర్‌
సహజ వనరులు అపారంగా ఉన్న ఈ ప్రాంతంలోనూ నక్సల్స్‌ సమస్య తీవ్రంగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే శంకర్‌ ధ్రువ్‌ను కాదని.. ఆదివాసీల కోసం పనిచేస్తున్న మాజీ ఐఏఎస్‌ అధికారి శిశుపాల్‌ సోరిని బరిలోకి దింపింది. 

బస్తర్‌
ఓటు వేస్తే వేళ్లు నరికేస్తామంటూ మావోయిస్టుల హెచ్చరికల మధ్య బస్తర్‌ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణ కత్తి మీద సామే. ఆదివాసీలు అత్యధికంగా ఉన్న బస్తర్‌లో వారి ఆరోగ్యమే ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రంగా మారింది. 

సర్వేలు ఏం చెబుతున్నాయ్‌ ! 
ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరి పోటీ ఉన్నప్పటికీ, అజిత్‌జోగి పార్టీ ప్రతిపక్ష ఓట్లను చీల్చడంతో కమలనాథులకు లబ్ధి చేకూరుతుందని ఇండియాటుడే సర్వే అంచనా వేసింది. అయితే బస్తర్‌ ప్రాంతంలో మాత్రం కాంగ్రెస్‌ పై చేయి సాధిస్తుందని ఆ సర్వేలో వెల్లడైంది. ఏబీపీ న్యూస్, సీఎస్‌డీఎస్‌ సర్వేలో నాలుగోసారి బీజేపీదే అధికారమని తేలింది. కాంగ్రెస్‌ నామమాత్రపు పోటీ కూడా ఇవ్వదని, మొత్తం 90 స్థానాల్లో బీజేపీ 56 నియోజకవర్గాలను గెలుచుకుంటుందని ఆ సర్వే వెల్లడించింది. ఇండియా టీవీ, సీఎన్‌ఎక్స్‌ ఒపీనియన్‌ పోల్స్‌లోనూ.. 50 సీట్లతో బీజేపీయే నెగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది.  

లక్ష మంది పహారా!
లక్షమంది భద్రతా బలగాల బందోబస్తు నడుమ నేడు ఛత్తీస్‌గఢ్‌ తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. మావోయిస్టుల హెచ్చరికలు, 15 రోజుల్లోనే మూడు వేర్వేరు ఘటనల్లో 13 మందిని పొట్టనపెట్టుకున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 18 నియోజకవర్గాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుచేశారు. కాగా, గత పదిరోజుల్లో బస్తర్‌ ప్రాంతంతోపాటు రాజ్‌నంద్‌గావ్‌ జిల్లాలో 300కు పైగా ఐఈడీ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల ప్రతి చర్యలకు సరైన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు ఆపరేషన్స్‌ స్పెషల్‌ డీజీ డీఎం అవస్థి వెల్లడించారు.

పారామిలటరీ, సీఆర్పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ బలగాలతోపాటు 65వేల మంది వివిధ రాష్ట్రాల పోలీసులు కూడా ఈ బందోబస్తులో ఉన్నారు. బలగాలతోపాటు వైమానిక దళం, బీఎస్‌ఎఫ్‌ హెలికాప్టర్లతో నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నామని అవస్థీ తెలిపారు. ‘ఎన్నికల సిబ్బందిని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు తీసుకెళ్లి.. ఎన్నిక పూర్తయిన తర్వాత క్షేమంగా గమ్యస్థానం చేర్చడమే అసలైన సవాల్‌. ఈ దిశగా ఓ వ్యూహంతో పనిచేస్తున్నాం. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందుపాతరలు, ఐఈడీలు పెట్టారు. దీంతో చాలా జాగ్రత్తగా ముందుకెళ్తున్నాం’ అని ఆయన వెల్లడించారు. కాగా, అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఉదయం ఏడుగంటలనుంచి సాయంత్రం 3 వరకు మాత్రమే పోలింగ్‌ జరపనున్నారు.  

2013 ఎన్నికల్లో బీజేపీ గెలిచిన 6  స్థానాలు 
బీజార్, జగదల్‌పూర్, నారాయణ్‌పూర్, అనంత్‌గఢ్, డోగార్‌గావ్, రాజ్‌నంద్‌గావ్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement