జంగ్‌..మైదాన్‌ కా! | Second phase of polling in Chhattisgarh today | Sakshi
Sakshi News home page

జంగ్‌..మైదాన్‌ కా!

Published Tue, Nov 20 2018 2:58 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Second phase of polling in Chhattisgarh today - Sakshi

ఛత్తీస్‌గఢ్‌లో నేడు రెండో విడత పోలింగ్‌ జరగనుంది. మావోయిస్టుల ప్రాబల్యమున్న 18 నియోజకవర్గాల్లో తొలి విడతలో ఎన్నికలు జరగగా.. మిగిలిన 72 స్థానాల్లో మంగళవారం ఓటు పండగకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఛత్తీస్‌గఢ్‌లో అసలు రాజకీయానికి రెండో విడత వేదిక కానుంది. తొలి విడతలో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే హోరాహోరీ నెలకొంది. కానీ రెండో దశలో అజిత్‌ జోగి కారణంగా రెండు ప్రధాన పార్టీలకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. దీంతో రెండో విడతలో మూడుముక్కలాట ఖాయంగా కనబడుతోంది. ఈ విడత ఎన్నికలు జరిగే స్థానాల్లో జోగి–బీఎస్పీ ప్రభావముండే ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాలున్నాయి. దీనికితోడు బీఎస్పీకి సన్నిహితంగా ఉండే సత్నామీలు ఈ నియోజకవర్గాల్లో నిర్ణయాత్మకం ఓటర్లు.

రాజకుటుంబాల ప్రభావం ఉండే 14 ఆదీవాసీ నియోజకవర్గాల్లోనే రెండో దశలోనే ఎన్నికలు జరగనున్నాయి. గతంలో ఈ ప్రాంతంలో బీజేపీకి గట్టిపట్టుండగా.. ఈసారి వీటిని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్‌ వ్యూహరచన చేస్తోంది. కాగా, అటు రమణ్‌సింగ్‌ అభివృద్ధి ఇమేజ్‌ కారణంగా మెరుగైన స్థానాలు సాధిస్తామని బీజేపీ భావిస్తుండగా.. కాంగ్రెస్‌ మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతే తమకు సీఎం పీఠాన్ని అప్పగిస్తోందని అనుకుంటోంది. అటు, మొదటి విడతతో పోలిస్తే రెండో దశలో సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా లేనప్పటికీ.. భద్రతను కట్టుదిట్టం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనే 76.28% శాతం పోలింగ్‌ జరగడంతో మైదాన ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం మరింత ఎక్కువగా ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

బరిలో కోటీశ్వరులు, నేర చరితులు 
ఈ సారి ఎన్నికల బరిలో అదృష్టం పరీక్షించుకుంటున్న అభ్యర్థుల్లో కోటీశ్వరులు, నేరచరితులు ఎక్కువగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ పడుతున్న 1,079 మంది అభ్యర్థుల్లో 130 మందికి నేరచరిత్ర ఉంది. వారిలో 90 మందిపై హత్యాయత్నం వంటి తీవ్రమైన కేసులున్నాయి. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) వెల్లడించిన వివరాల ప్రకారం కాంగ్రెస్‌ పార్టీయే ఎక్కువ మంది నేరచరితులకు టికెట్లు ఇచ్చింది. ఆ పార్టీ నుంచి పోటీ పడుతున్న వారిలో 18 మందిపై తీవ్రమైన కేసులున్నాయి. 17 మంది అభ్యర్థులతో ఆమ్‌ ఆద్మీ పార్టీ రెండోస్థానంలో ఉండగా.. అజిత్‌ జోగి పార్టీ జేసీసీ నుంచి 15 మంది, బీజేపీ తరఫున ఆరుగురు నేరచరిత కలిగిన అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక కోట్లకు పడగలెత్తిన అభ్యర్థుల్లో బీజేపీ ముందు వరసలో ఉంది. బీజేపీ అభ్యర్థుల్లో 61 మంది కోటీశ్వరులుంటే, కాంగ్రెస్‌ 53 మందికి, జేసీసీ 35 మందికి టికెట్లు ఇచ్చింది. అంబికాపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత (కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిగా ప్రచారం) టీఎస్‌ సింగ్‌దేవ్‌ రూ.500 కోట్లకు పైగా ఆస్తులతో అత్యంత ధనిక అభ్యర్థిగా నిలిచారు. 

హెల్ప్‌ అంటే రమణ్‌ 
రెండు నెలల క్రితం బస్తర్‌ ప్రాంతంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలి కుమారుడికి పాము కరిస్తే, ఆమె సాయం కోసం ఫోన్‌ చేసింది సీఎం రమణ్‌ సింగ్‌కే. వెంటనే రమణ్‌ సింగ్‌ హెలికాప్టర్‌లో ఆ అబ్బాయిని తీసుకురావడానికి ఏర్పాట్లు చేశారు. సరైన సమయానికి రాయపూర్‌ ఆస్పత్రిలో చికిత్స జరగడంతో ఆ అబ్బాయి బతికి బయటపడ్డాడు. ఈ ఒక్క ఘటన చాలు.. విపక్షాల్లోనూ సీఎం రమణ్‌సింగ్‌కు ఉన్న ఇమేజ్‌ గురించి చెప్పడానికి. కేవలం ఇదొక్క సంఘటనే కాదు ప్రజలతోనూ ఆయన మమేకమవుతారనడానికి ఉదాహరణలు కోకొల్లలు.

ఆయనకున్న వ్యక్తిగత ఇమేజ్‌ కారణంగానే మళ్లీ అధికారంలోకి వస్తామని బీజేపీ భావిస్తోంది. ‘చావల్‌ బాబా’గా పౌరసరఫరా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచారు. సెల్‌ ఫోన్‌ విప్లవాన్ని తీసుకువచ్చి రాష్ట్రాన్ని సాంకేతికంగానూ పరుగులు పెట్టించారు. సుపరిపాలనతో.. అన్ని వర్గాలను కలుపుకొని పోవడంలో కూడా రమణ్‌సింగ్‌ది ప్రత్యేకమైన శైలి. మావో సమస్యను ఉక్కుపాదంతో అణిచేసిన జాతీయవాదిగా, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలతో సామాజికవాదిగా, పారిశ్రామికంగా రాష్టాన్ని పరుగులు పెట్టించిన అభివృద్ధి కారకుడిగా రమణ్‌ సింగ్‌కు రాష్ట్ర ప్రజల్లో ప్రత్యేకమైన ఇమేజ్‌ ఉంది.

ప్రభుత్వ వ్యతిరేకతే ఆయుధంగా.. 
సరిగ్గా ఎన్నికల తేదీల ప్రకటనకు ముందు ప్రదేశ్‌ కాంగ్రెస్‌కమిటీ అధ్యక్షుడే బీజేపీలో చేరడంతో కాంగ్రెస్‌లో నాయకత్వలేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు నేతలు తమను తాము సీఎం అభ్యర్థులుగా ప్రకటించుకుంటున్నప్పటికీ.. లోటు మాత్రం స్పష్టంగా కనబడుతోంది. ఈ సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వ పగ్గాలు అందుకునేందుకు ప్రభుత్వ వ్యతిరేకతపైనే నమ్మకముంచింది. గత మూడుసార్లు స్వల్ప తేడాతోనే ఓడినందున ఈసారి ఆ తప్పులు చేయకుండా పట్టుబిగించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది.

రైతుల్లో ఉన్న అసంతృప్తిని గమనించిన రాహుల్‌ గాంధీ.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన పదిరోజుల్లో రుణమాఫీ చేస్తానని తొలిదశ పోలింగ్‌ ప్రచారం ముగిసే ముందు ప్రకటించారు. 15 ఏళ్ల పాలన కారణంగా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అందిపుచ్చుకునేందుకు.. రైతులు, మహిళలు, యువతను ఆకట్టుకునే విధంగా  కాంగ్రెస్‌ మేనిఫెస్టోను రూపొందించింది. తొలిదశలో 76% పోలింగ్‌ జరగడంతో (ఎక్కువ పోలింగ్‌ జరిగితే అధికార పార్టీకి నష్టమనే భావనలో) దీని ప్రభావం రెండోదశలోనూ ఉంటుందని.. అది తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్‌ బలంగా నమ్ముతోంది. 

జోగి ఝలక్‌ ఎవరికి? 
ద్విముఖ పోరుంటే గెలిచేది నువ్వా–నేనా అనేది తేలిపోతుంది. మూడో పార్టీ/వ్యక్తి రంగంలో వస్తే.. విజయం ఎవరిని వరిస్తుందనేది ఊహించడం కష్టం. అదే పరిస్థితి ఛత్తీస్‌గఢ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే పోటీ ఉంటుందనుకున్న సమయంలో ఛత్తీస్‌గఢ్‌ జనతా కాంగ్రెస్‌ (జేసీసీ) పేరుతో జోగి పోటీలోకి రావడం సమీకరణాలు మార్చేసింది. ఇది బీజేపీ, కాంగ్రెస్‌లకు ఇబ్బందికర పరిణామమే అయినా.. రెండు పార్టీలూ అవతలి పార్టీకే.. జోగితో నష్టమని ప్రచారం చేసుకుంటున్నాయి. 2013 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి బయటకు వచ్చి కేజేపీని స్థాపించిన యడ్యూరప్ప కారణంగా.. బీజేపీకి తీవ్ర నష్టం జరిగింది. ఇప్పుడు అదే సీన్‌ ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ పార్టీ విషయంలో పునరావృతం అవుతుందనే అంచనాలపై చర్చ జరుగుతోంది.  
నామమాత్ర తేడాతోనే.. 
ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో ఓట్లు, సీట్ల పరంగా అత్యంత స్వల్ప తేడాతో బీజేపీ గట్టెక్కింది. ఇందుకు కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న సంస్థాగత ఇబ్బందులే కారణమనేది సుస్పష్టం. అయితే ఈసారి గతంలోలాగా పొరపాట్లు చేయకుండా.. అధికార పీఠం దక్కించుకోవాలని కాంగ్రెస్‌ తీవ్రంగా శ్రమిస్తోంది. 15ఏళ్ల రమణ్‌సింగ్‌ పాలనతో విసిగిపోయిన జనాలు తమ విజయంలో కీలకమవుతారని భావించింది. ఈ ఆశలకు మాజీ సీఎం, గతంలో కరడుగట్టిన కాంగ్రెస్‌ వాదిగా ఉన్న అజిత్‌ జోగి రూపంలో ఎదురుదెబ్బ తగలనుంది. జోగి పార్టీ జేసీసీ కారణంగా కాంగ్రెస్‌ పార్టీనే ఎక్కువ ఇబ్బందులు పడుతోంది. కాంగ్రెస్‌కు పట్టున్న దళిత స్థానాల్లో బీఎస్పీతో జోగి దెబ్బకొట్టొచ్చని విశ్లేషణలున్నాయి. హిందీరాష్ట్రాల్లో 2003 నుంచి గణాంకాలు పరిశీలిస్తే కాంగ్రెస్, బీఎస్‌పీ, సీపీఐల ఓట్లు కలిపితే.. బీజేపీ కన్నా ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్, జోగి కలిసి పోటీ చేసుంటే.. బీజేపీ ఓటమి ఖాయమనే వాదన వినిపించింది. కానీ ఇందుకు ఇటు కాంగ్రెస్, అటు జోగి ఇద్దరూ అంగీకరించలేదు. ఇప్పుడు ఈ త్రిముఖ పోరులో జోగి కారణంగా అంతిమంగా బీజేపీకే మేలు జరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.  

బీఎస్పీ ఎంట్రీతో.. 
బీఎస్‌పీ యూపీ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కాకపోయినా.. గెలిచే పార్టీల అవకాశాలను మాత్రం దెబ్బతీస్తోంది. ఇది చాలా సందర్భాల్లో నిరూపితమైంది. అలాంటి బీఎస్పీ.. ఈసారి జోగితో జతకట్టడం ఎవరి ఓట్లకు నష్టమనేది చర్చనీయాంశమైంది. ఈ చర్చే జోగిని ఈసారి ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక వ్యక్తిగా మార్చింది. జోగి కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చినందున.. ఆయన వల్ల కాంగ్రెస్‌కే నష్టమనే వాదనలు వినబడుతున్నాయి. జోగి–బీఎస్పీ కూటమిలో సీట్ల పంపిణీ కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. రాష్ట్రంలో ఈ కూటమి తరఫున 55 సీట్లలో జేసీసీ బరిలో ఉంది. వీటిలో మెజార్టీ స్థానాల్లో 2008, 2013లో కాంగ్రెస్‌ మంచి ప్రదర్శన చూపింది. 

ఎస్సీ, ఎస్టీలే కీలకం 
రాష్ట్రంలో గణనీయంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ ఓటర్లు మాయావతి, జోగి జట్టుకట్టడంతో.. మూడో కూటమి వైపు మొగ్గు చూపుతారని అంచనా. 9 ఎస్సీ రిజర్వ్‌డ్, 17 ఎస్టీ రిజర్వ్‌డ్‌ స్థానాలున్నాయి. ఈ నియోజకవర్గాల్లో మూడో కూటమి ప్రభావం ఉండొచ్చు. కూటమితో పొత్తు ఉండుంటే.. ఈ సీట్లలో కాంగ్రెస్‌కు మేలు జరిగేది. పొత్తు లేకపోవడంలో ఈ త్రిముఖ పోటీలో బీజేపీ కష్టంమీద గెలిచే అవకాశాలున్నాయని అంచనా.  ఈసారి ఎస్సీల్లోని సత్నామీ వర్గం ఓట్లను గెలిచేందుకు కాంగ్రెస్‌ కొత్త వ్యూహం పన్నింది. సత్నామీల గురువులు ముగ్గురిని చేర్చుకుని అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 

నేటి రెండోదశే నిర్ణయాత్మకం! 
72 నియోజకవర్గాల్లో మంగళవారం పోలింగ్‌ జరగనుంది. మైదాన ప్రాంతాల్లో జరిగే ఈ ఓటింగే ఎన్నికల్లో నిర్ణయాత్మకం కానుంది. అజిత్‌ జోగికి చెందిన జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ (జేసీసీ) ప్రభావం అత్యధికంగా ఉండే ఈ ప్రాంతాల్లో ముక్కోణపు పోటీ ఎవరికి లాభం చేకూరుస్తుందో? ఎవరు నష్టపోతారో? అనేది విశ్లేషకులకూ అంతుచిక్కడం లేదు. గత మూడు ఎన్నికల్లోనూ ముక్కోణపు, బహుముఖ పోటీల కారణంగా బీజేపీకే లాభం చేకూరింది. ఈ సారి బీఎస్పీతో జతకట్టి బరిలో దిగిన అజిత్‌ జోగి కూడా కాంగ్రెస్‌ ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి మేలుచేస్తారనే అంచనాలైతే బలంగా ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో 14% ఉన్న సత్నామీలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. జోగికి సత్నామీల్లో పట్టు ఉంది.

ఈ వర్గం బీఎస్పీకి శాశ్వత ఓటు బ్యాంకు కూడా. బీఎస్పీ–జేసీసీ కూటమి బలమైన శక్తిగా అవతరించడానికి కారణం కూడా ఈ వర్గమే. మధ్య ఛత్తీస్‌గఢ్‌లో సత్నామీలు ఎక్కువగా ఉన్న 10 ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లో జోగి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బిలాస్‌పూర్, జంజీగర్‌ ప్రాంతాల్లో ఈ కూటమి తన ప్రభావాన్ని చూపిస్తుందన్న అంచనాలున్నాయి. జంజీగర్, చంపా వంటి స్థానాల్లో బీజేపీ నుంచి పార్టీ ఫిరాయించి బీఎస్పీలో చేరిన వారున్నారు. అలాంటి స్థానాల్లో గెలుపు ఎవరిదో అంచనా వేయడం సంక్లిష్టంగా మారింది. ఇలా మొత్తం 12 స్థానాల్లో గెలుపోటములు అంచనా వేయడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సత్నామీల గురువు గురు బాలదాస్‌.. కాంగ్రెస్‌తో చేతులు కలపడంతో ఆ సామాజిక వర్గం ఓట్లు ఎటు మళ్లుతాయనేది ఆసక్తికరంగా మారింది. అజిత్‌ జోగి, మాయావతి కూటమి  6–7% ఓట్లను కొల్లగొట్టగలరని అంచనాలున్నాయి. ఈ ఓట్ల చీలిక ఎవరికి నష్టం చేకూరుస్తుందో.. ఇప్పుడే  చెప్పలేని స్థితి. రెండో దశలో ఓబీసీ ఓట్లు కూడా కీలకమే. జనాభాలో 45% ఓబీసీలుంటే వారిలో 22% మంది సాహులు ఉన్నారు. సాహులు సంప్రదాయంగా బీజేపీకే మద్దతు నిలుస్తున్నారు. కాంగ్రెస్‌తో పోల్చి చూస్తే బీజేపీయే సాహులకు ఎక్కువ టిక్కెట్లు ఇచ్చింది. 

రాజ కుటుంబీకులపై ఆశలు 
ఆదివాసీ ప్రాంతమైన సుర్‌గుజాల్‌లో మొత్తం 14 నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ రాజకుటుంబాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ కుటుంబాలను దగ్గర చేసుకోవడానికి కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. ఈ కుటుంబాల వారికే రెండు పార్టీలు కనీసం నాలుగేసి స్థానాల్లో బరిలో దింపాయి. 2000 సంవత్సరంలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ఏర్పడినప్పటినుంచీ.. ఈ ప్రాంతంపై బీజేపీదే పట్టు. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్‌ కూడా తన బలాన్ని పెంచుకుంటోంది. కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి రేసులో ఉన్న టీఎస్‌ సింగ్‌దేవ్‌ ఈ రాజ కుటుంబాలకు చెందినవారే. ఆయనపై బీజేపీ అదే రాజవంశానికి చెందిన అనురాగ్‌ సింగ్‌దేవ్‌ను బరిలో దింపింది. బీజేపీలో నేత దిలీప్‌ సింగ్‌ జుదావో కూడా ఇక్కడి జష్‌పూర్‌కి చెంది రాజ కుటుంబీకుడు. ఆయన కుమారుడు యుధవీర్‌ సింగ్‌ చంద్రపూర్‌ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యుధవీర్‌ భార్య సంయోగిత సింగ్‌ ఈసారి చంద్రపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు. 2003 ఎన్నికల్లో 14 స్థానాలకు గాను  బీజేపీ ఏకంగా 10 సీట్లను సాధించింది. 2013 ఎన్నికల్లో ఇరు పార్టీలు చెరిసగం సీట్లను పంచుకున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement