
రాయ్‌పూర్: 18 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఛత్తీస్‌గఢ్‌కు ఆయనే గత 15 ఏళ్లుగా ముఖ్యమంత్రి. ఏ బీజేపీ సీఎం కూడా ఇంతకాలం అధికారంలో లేరు. ఛత్తీస్‌గఢ్ సీఎంగా రమణ్‌సింగ్(66) ప్రస్థానం ఇది. 2003, డిసెంబర్ 7న తొలిసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఆ తరువాత 2008, 2013లోనూ అధికారంలోకి వచ్చారు. ప్రధాని కాక ముందు నరేంద్ర మోదీ 4,610 రోజుల పాటు నిరంతరాయంగా గుజరాత్ సీఎంగా కొనసాగగా, రమణ్‌సింగ్ ఈ ఏడాది ఆగస్టులో సీఎంగా 5వేల రోజులు పూర్తిచేసుకున్నారు. మోదీ తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించిన తొలి బీజేపీ సీఎంగా గుర్తింపు పొందారు. మహిళలు, విద్యార్థులకు ఉచిత మొబైల్ ఫోన్లు ఇచ్చినందుకు ‘మొబైల్ వాలె బాబా’, ఉచిత బియ్యం పథకానికి ‘చౌర్ వాలె బాబా’, స్వతహాగా ఆయుర్వేద వైద్యుడైనందుకు ‘డాక్టర్ సాహెబ్’ అని రమణ్‌సింగ్‌ను ప్రజలు పిలుచుకుంటున్నారు.
కాంగ్రెస్ రుణమాఫీ హామీనే మలుపు..
నాలుగోసారి సీఎం పీఠం అధిష్టించాలనుకున్న రమణ్‌సింగ్‌కు తాజా ఎన్నికల్లో ఆశాభంగం కలిగింది. ప్రజాకర్షక పథకాలకు పేరొందిన ఆయనకు ఎట్టకేలకు కాంగ్రెస్ చెక్ పెట్టింది. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు బంధుప్రీతి, అవినీతి ఆరోపణలు ఆయన పాలనకు చరమగీతం పాడాయి. అధికారంలోకి వస్తే రైతు రుణాల్ని మాఫీ చేస్తామన్న రాహుల్ ప్రకటనే కాంగ్రెస్‌కు ఓట్ల వర్షం కురిపించిందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు, వ్యవసాయ ఉత్పత్తుల ధరల పతనం, ఓబీసీ ఓటర్లు కాంగ్రెస్ వైపు మళ్లడం కూడా బీజేపీకి ప్రతికూలంగా మారాయి. 15 ఏళ్ల బీజేపీ పాలనలో మావోయిస్టుల సమస్య మరింత ముదిరిందని కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేయగా, నక్సలిజం ప్రాణాధార వ్యవస్థపై ఉందని త్వరలోనే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతి నెలకొంటుందని రమణ్‌సింగ్ చేసిన ప్రకటనలు ఫలితాలివ్వలేదు.
విదూషకుడే గెలుచుకున్నాడు..
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రచార సమయంలో రమణ్‌సింగ్ తరచూ వార్తల్లో నిలిచారు. రాష్ట్రంలో ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని విదూషకుడితో పోల్చారు. రుణమాఫీ చేస్తామని రాహుల్ చెబుతున్న మాటల్ని విని ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అజిత్ జోగి, మాయావతిల పొత్తును ఎగతాళి చేశారు. ‘నాగలి మోసే రైతు’ (జోగి పార్టీ గుర్తు)కు ఏనుగు(బీఎస్పీ చిహ్నం) అవసరం ఏంటని ప్రశ్నించారు. చివరకు రైతులు, గిరిజనులు ‘కమలాన్ని’ వద్దనుకుని ‘హస్తా’నికి పట్టంగట్టారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి ముందు రమణ్‌సింగ్.. తన కన్నా చిన్నవాడైన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాదాలకు నమస్కరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
రమణ్‌సింగ్ రాజీనామా
రాయ్‌పూర్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలవడంతో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపినట్లు తెలిపారు. పార్టీ ఓటమికి పూర్తి బాధ్యతను తానే తీసుకుంటానని, కేంద్ర నాయకత్వంపై మోపనని చెప్పారు. పార్టీ నాయకులతో కలసి ఫలితాలపై సమీక్ష జరుపుతామని వెల్లడించారు. రాష్ట్ర సమస్యలపైనే ఎన్నికలు జరిగాయని, వీటికి జాతీయ అంశాలతో సంబంధం లేదని పేర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలపై ఈ ఎన్నికల ప్రభావం ఉండదని నొక్కిచెప్పారు. ఛత్తీస్‌గఢ్ కోసం కొత్త పాత్రలో శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు.