మంచిర్యాలఅగ్రికల్చర్: యువజనులను ఓటరు జాబితాలో చేర్చేందుకు అధికార యంత్రాంగం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో ఓటుహక్కు వినియోగంపై యువతలో చైతన్యం పెరిగింది. ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం రెండుసార్లు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ఈ నెల 9న చివరి గడువు ముగిసే నాటికి జిల్లావ్యాప్తంగా 44,160 మంది ఓటరుగా నమోదుకావడం విశేషం.
తాజాగా 15,017 మంది..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుహక్కు పొందడం కోసం ఓటరు జాబితాలో పేరు నమోదుకు ఎన్నికల సంఘం రెండోసారి అవకాశం కల్పించగా, ఈ నెల 9వ తేదీతో గడువు ముగిసింది. జిల్లావ్యాప్తంగా 15,017 మంది ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత పదిహేను రోజుల పాటు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా యువతీ యువకులు ఓటుహక్కు కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. నియోజకవర్గాల చూస్తే అత్యధికంగా బెల్లంపల్లిలో 6,647 దరఖాస్తులు వచ్చాయి. తర్వాత మంచిర్యాలలో 5,850, చెన్నూర్‌లో 2,520 మంది నమోదు చేసుకున్నారు. ఓటుహక్కు నమోదుకు ఫారం–6, ఓటరు జాబితాలో తొలగింపు, అభ్యంతరాలను స్వీకరించేందుకు ఫారం–7 దరఖాస్తులు 4,509 రాగా, ఓటరు జాబితాలో మార్పులు,చేర్పులు చేసుకునేందుకు ఫారం–8 దరఖాస్తులు 1,552 వచ్చాయి.
అదే నియోజకవర్గ పరిధిలో చిరునామా మార్చుకునేందుకు ఫారం–8ఏ దరఖాస్తులు 863 వచ్చాయి. ఎన్నికల అధికారులు సెప్టెంబర్ 10న ఆవిష్కరించిన ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 5,01,743 మంది ఓటర్లు ఉన్నారు. ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావడంతో ఎన్నికల సంఘం మరో నెలరోజులు కొత్త ఓటర్ల నమోదు అవకాశం కల్పించింది. జిల్లాలో ఓటరు నమోదుపై చైతన్యం కల్పించేందుకు బూత్ స్థాయి అధికారులు ర్యాలీలు, సమావేశాల ద్వారా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి 2018 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని నమోదు చేసుకునే విధంగా ప్రోత్సహించారు.
దీంతోపాటు ఓటరు జాబితాలో తప్పొప్పులు ఉన్నాయని ఆరోపణలు రావడంతో అధికారులు చనిపోయిన వారి పేర్లను తొలిగించి, తప్పులను సరిచేసి ఎన్నికల సంఘానికి నివేదిక అందజేశారు. ఈ నివేదికల ఆధారంగా చనిపోయిన, రెండుచోట్ల ఉన్న ఓటర్లను తొలగించి, కొత్తగా నమోదైన ఓటర్లతో తుది ఓటరు జాబితాలో 5,30,886 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. మరోసారి ఓటరు నమోదుకు అవకాశం కల్పించాలని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరడంతో ఈ నెల 9వ తేదీ వరకు గడువు ఇచ్చింది. తాజాగా వచ్చిన దరఖాస్తుల అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలిస్తారు. అన్ని వివరాలు సవ్యంగా ఉన్నట్లయితే ఓటరు జాబితాలో చోటు లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment