ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన ఓటర్లు | Increased electorate in the state | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన ఓటర్లు

Published Sun, Apr 7 2024 3:38 AM | Last Updated on Sun, Apr 7 2024 5:20 AM

Increased electorate in the state - Sakshi

ఓటేయడానికి ముందుకు వస్తున్న యువత 

మార్చిలో షెడ్యూల్‌ తర్వాత కొత్తగా 1.26 లక్షల ఓటర్లు చేరిక 

2.09 కోట్లకు పెరిగిన మహిళా ఓటర్లు 

2.01 కోట్లకు చేరిన పురుష ఓటర్లు 

జనవరిలో తుది జాబితా ప్రకటన తర్వాత 2.56 లక్షలు పెరుగుదల 

స్వీప్‌ ప్రచార కార్యక్రమంతో భారీగా చేరుతున్న కొత్త ఓటర్లు 

సాక్షి, అమరావతి: ఎప్పుడూ లేని విధంగా ఈసారి సాధారణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడంపై యువత ఆసక్తిని చూపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత కూడా ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అయినప్పటి నుంచి ఈ నెల రెండో తేదీ నాటికి రాష్ట్రంలో కొత్తగా 1,26,549 మంది ఓటర్లు నమోదు అయినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ప్రకటించింది.

షెడ్యూల్‌ ప్రకటించిన రోజుకి రాష్ట్రంలో మహిళా ఓటర్ల సంఖ్య 2,08,49,730 గా ఉంటే ఏప్రిల్‌ 2కి 2,09,16,389కు పెరిగినట్లు తెలిపింది. పురుష ఓటర్ల సంఖ్య 2,00,84,276 నుంచి 2,01,44,166కు పెరిగినట్లు పేర్కొంది. నామినేషన్లు దాఖలు చివరి రోజు వరకు కొత్త ఓటర్లను చేర్చుకొనే అవకాశం ఉండటంతో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు.

జనవరి 22న విడుదల చేసిన తుది ఓటర్ల సవరణ జాబితాతో పోలిస్తే ఈ రెండున్నర నెలల్లో 2,56,781 మంది ఓటర్లు పెరిగారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు, కొత్త ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వీప్‌ కార్యక్రమం సత్ఫలితాలను అందిస్తోందని, దీంతో ఈసారి పెద్ద ఎత్తున యువ ఓటర్లు నమోదవుతున్నారని అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య రికార్డు స్థాయిలో 10 లక్షలు దాటుతోందంటున్నారు. 

2019 తర్వాత పెరిగిన ఓటర్లు 41.31 లక్షలు 
2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పురుష, మహిళా ఓటర్ల సంఖ్య 3,69,29,330 (సర్విస్, థర్డ్‌ జెండర్‌ ఓట్లు కాకుండా)గా ఉంటే అది ఇప్పుడు 4,10,60,555కు పెరిగింది. అంటే 41,31,225 మంది కొత్తగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2019లో పురుష ఓటర్లు 1,83,24,588 మంది ఉండగా ఇప్పుడు 2,01,44,166కు, మహిళా ఓటర్లు 1,86,04742 నుంచి 2,09,16,389కు పెరిగారు.

సర్విసు, ఎన్నారై, థర్డ్‌ జెండర్‌ ఓటర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే 4.12 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు పెరుగుతున్న ఓటర్లకు అనుగుణంగా పోలింగ్‌ స్టేషన్ల సంఖ్యను పెంచడానికి కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement