జైపూర్ : నేను పైలెట్‌ను కాను.. సేవకున్ని అంటూ కాంగ్రెస్ పార్టీపై పరోక్ష విమర్శలు చేస్తున్నారు బీజేపీ అభ్యర్థి యునస్ ఖాన్. టోంక్ నియోజకవర్గం నుంచి.. కాంగ్రెస్ అభ్యర్థి సచిన్ పైలెట్‌కు వ్యతిరేకంగా బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు యునస్ ఖాన్. రాష్ట్రంలో బీజేపీ తరపున ఉన్న ఒకే ఒక్క ముస్లిం అభ్యర్థి యునస్ ఖాన్. టోంక్ ప్రాంతంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోన్న యునస్ ‘ఈ ఎన్నికలను హిందూ - ముస్లింల ఫైట్‌గా భావించకండి. ఇది కులానికి, మతానికి సంబంధించిన యుద్ధం కాదు. ఇది ప్రజాస్వామ్య యుద్ధం అని తెలిపారు. బీజేపీ తరపున ఒకే ఒక మైనారిటీ అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేయడం గురించి ప్రశ్నించగా ‘ఈ విషయం గురించి నాకు పూర్తిగా తెలీదు. కానీ రాజస్తాన్‌లో దివంగత రంజాన్ ఖాన్, నేను 1980 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నామం’టూ చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి సచిన్ పైలెట్ గురించి మాట్లాడుతూ.. ‘సచిన్‌జీకి ఇది కొత్త ప్లేస్.. కొత్త మనుషులు. వీటన్నింటిని పక్కన పెడితే ఆయన ఎమ్మెల్యేగా గెలిచి.. ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నారు. ఇది తప్ప ఆయనకు మరో కల లేదు. కానీ నేను ప్రజల మనిషిని. పోయిన సారి నేను దీద్వానాలో పని చేశాను.. ఈ సారి టోంక్‌లో. ప్రజలు ఆశీర్వదీస్తే ఇక్కడ కూడా సేవకునిలా పనిచేస్తాను’ అన్నారు. అంతేకాక ‘నేను సేవకున్ని.. ఎమ్మెల్యే మాత్రమే కాగాలను.. కానీ ఆయన చాలా పెద్ద మనిషి.. పైలెట్ కదా’ అంటూ సచిన్‌పై పరోక్ష విమర్శలు చేశారు. టోంక్ ప్రజలకు కావాల్సింది పైలెట్ కాదు.. సేవకుడని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో దీద్వానా నుంచి గెలుపొందిన యునస్ ఖాన్, వసుంధరా రాజే ప్రభుత్వంలో రవాణా మరియు పబ్లిక్ వర్క్స్ మంత్రిగా పని చేశారు.
ముస్లింలు ఎక్కువగా ఉండే టోంక్ నియోజకవర్గంలో బీజేపీ తొలుత సిట్టింగ్ ఎమ్మెల్యే అజిత్ సింగ్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. కానీ కాంగ్రెస్ పార్టీ సచిన్ పైలెట్‌ను తన అభ్యర్థిగా ప్రకటించడంతో.. బీజేపీ అజిత్ సింగ్ స్థానంలో యునస్ ఖాన్‌ని నిలబెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment