Rajasthan Elections 2023: స్టయిల్‌ మారింది! | Rajasthan Elections 2023: Will Pilot patient, low-profile strategy get him the CM chair | Sakshi
Sakshi News home page

Rajasthan Elections 2023: స్టయిల్‌ మారింది!

Published Tue, Nov 21 2023 4:53 AM | Last Updated on Tue, Nov 21 2023 8:34 AM

Rajasthan Elections 2023: Will Pilot patient, low-profile strategy get him the CM chair - Sakshi

మూడేళ్ల నాటి విఫల తిరుగుబాటు. సీఎం కుర్చీలో ఉన్న ప్రత్యర్థి నుంచి చీటికీ మాటికీ సూటిపోటి మాటలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించినా ఈసారి మాత్రం ప్రచారంతో సహా ఎందులోనూ పెద్దగా ప్రాధాన్యం దక్కని వైనం. అన్నింటినీ ఓపికగా సహిస్తూ సాగుతున్నారు రాజస్తాన్‌ కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌.

అసమ్మతి నేతగా ముద్ర తప్ప తిరుగుబాటుతో సాధించిందేమీ లేకపోవడంతో ఈ యువ నేత తెలివిగా రూటు మార్చారు. అసమ్మతి రాగాలకు, సొంత ప్రభుత్వంపై విమర్శలకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. అవకాశం చిక్కినప్పుడల్లా అధిష్టానానికి విధేయతను చాటుకుంటూ వస్తున్నారు. విధేయత, వెయిటింగ్‌ గేమ్‌ అంతిమంగా తనను అందలమెక్కిస్తాయని ఆశిస్తున్నారు...

రాజస్తాన్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల వేళ పీసీసీ చీఫ్‌గా పార్టీ బరువు బాధ్యతలన్నింటినీ తన భుజాలపై మోశారు పైలట్‌. అన్నీ తానై వ్యవహరించి పార్టీని విజయ తీరాలకు చేర్చారు. ఆయనే సీఎం అని అంతా భావించారు. కానీ అధిష్టానం మాత్రం అనూహ్యంగా సీనియర్‌ అశోక్‌ గహ్లోత్‌కే పట్టం కట్టింది. కొంతకాలం తర్వాత చాన్సిస్తామన్న అధిష్టానం మాట తప్పడంతో పైలట్‌ ఆగ్రహించి 21 మంది ఎమ్మెల్యేలతో పైలట్‌ తిరుగుబాటుకు దిగడం, అగ్ర నేత రాహుల్‌గాంధీ జోక్యంతో వెనక్కు తగ్గడం చకచకా జరిగిపోయాయి.

డిప్యూటీ సీఎంగిరీ, పీసీసీ చీఫ్‌ పదవి రెండూ ఊడటం మినహా ఆయన సాధించిందంటూ ఏమీ లేకపోయింది. అయినా వెనక్కు తగ్గలేదాయన. గహ్లోత్‌ ప్రభుత్వంపై బాహాటంగానే విమర్శలు ఎక్కుపెట్టడం, ధిక్కార స్వరం విని్పంచడం వంటివి చేస్తూనే వచ్చారు. ఈ ఏడాది మొదట్లో ఏకంగా సొంత ప్రభుత్వ పనితీరునే విమర్శిస్తూ ధర్నాకు దిగడమే గాక పాదయాత్ర తలపెట్టి సంచలనం సృష్టించారు.

తీరు మారింది...
కానీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పైలట్‌ తీరే పూర్తిగా మారిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే సహనమూర్తిగా మారారు. ప్రచారంలో తనకు ముఖ్య బాధ్యతలేవీ అప్పగించకపోయినా పెద్దగా పట్టించుకోలేదు. పైగా గహ్లోత్‌ సర్కారుపై బీజేపీ విమర్శలను పైలట్‌ దీటుగా తిప్పికొడుతూ కాంగ్రెస్‌ నేతలనే ఆశ్చర్యపరుస్తున్నారు! అంతేగాక ఇటీవల గహ్లోత్‌ కుమారుడికి ఈడీ సమన్లను, పీసీసీ చీఫ్‌ గోవింద్‌సింగ్‌ నివాసంపై ఈడీ దాడులను కూడా పైలట్‌ తీవ్రంగా ఖండించారు.

గహ్లోత్‌పై విమర్శలు, ఆరోపణలకు పూర్తిగా ఫుల్‌స్టాపే పెట్టడమే గాక ఆయనతో కలిసి పని చేసేందుకు సిద్ధమని సంకేతాలిచ్చారు. వాటిని గహ్లోత్‌ పట్టించుకోకపోయినా, చాన్స్‌ దొరికినప్పుడల్లా తనకు చురకలు వేస్తున్నా, పార్టీ పట్ల తన చిత్తశుద్ధిని పదేపదే ప్రశి్నస్తున్నా వ్యూహాత్మక మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. ఎన్నికల ప్రచారమంతా గహ్లోత్‌ వన్‌ మ్యాన్‌ షోగానే సాగుతున్నా ఇదేమని ప్రశ్నించడం లేదు.

పార్టీ గెలిస్తే సీఎం పదవి డిమాండ్‌ చేస్తారా అని ప్రశ్నించినా అది అధిష్టానం తీసుకోవాల్సిన నిర్ణయమని ఆచితూచి బదులిస్తున్నారు. అదే సమయంలో, వ్యక్తిగత ప్రతిష్ట కోసం సీఎం కావాలన్న దుగ్ధ తనకు లేదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. తద్వారా ఇటు గహ్లోత్‌కు, అటు అధిష్టానానికి ఇవ్వాల్సిన సంకేతాలు స్పష్టంగానే ఇస్తున్నారన్నది పరిశీలకుల అభిప్రాయం.  

ఫలిస్తున్న వ్యూహం!
పైలట్‌ విధేయత వ్యూహం బాగానే ఫలిస్తోందంటున్నారు. గాంధీ త్రయం సోనియా, రాహుల్, ప్రియాంక కొద్ది రోజులుగా ఆయన అభిప్రాయానికి బాగా విలువ ఇస్తున్నారని పీసీసీ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. పైలట్‌ విధేయత, గహ్లోత్‌ గతేడాది చూపిన అవిధేయత రెండింటినీ అధిష్టానం బేరీజు వేసుకుంటోందని కూడా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. సీఎంగిరీ వదులుకోవాల్సి వస్తుందనే కారణంతో కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ చేయాలన్న సోనియా ఆదేశాలను గహ్లోత్‌ బేఖాతరు చేయడం తెలిసిందే.

ఆయన కోసం మెజారిటీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గత సెపె్టంబర్లో ఏకంగా తిరుగుబాటుకు సిద్ధపడటం అధిష్టానానికి తలవంపులుగా మారింది. ఈ నేపథ్యంలో ఐదేళ్లకోసారి అధికార పార్టీని మార్చేసే రాజస్థాన్‌లో ఈసారి కాంగ్రెస్‌ ఓడితే రాష్ట్ర పార్టీ పైలట్‌ చేతుల్లోకి రావచ్చు. నెగ్గితే మాత్రం సీఎం పీఠం కోసం గహ్లోత్, పైలట్‌ మధ్య పెనుగులాట తప్పకపోవచ్చు. అప్పుడు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరం!

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement