కాంగ్రెస్‌కు నరేంద్ర మోదీ సవాల్‌ | PM Narendra Modi Attacks Rahul gandhi | Sakshi
Sakshi News home page

బయటి వ్యక్తికి పార్టీ పగ్గాలిస్తారా?

Published Sat, Nov 17 2018 5:08 AM | Last Updated on Sat, Nov 17 2018 8:26 AM

PM Narendra Modi Attacks Rahul gandhi - Sakshi

అంబికాపూర్‌ ర్యాలీలో డోలు వాయిస్తున్న మోదీ

అంబికాపూర్‌: ధైర్యముంటే గాంధీయేతర కుటుంబానికి చెందిన నాయకుడిని పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని కాంగ్రెస్‌కు ప్రధాని మోదీ సవాలు విసిరారు. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడారు. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ నెలకొల్పిన ప్రజాస్వామ్య విలువల వల్లే చాయ్‌వాలా కూడా ప్రధాని కాగలిగారన్న కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ వ్యాఖ్యల్ని తిప్పికొట్టారు. తాను ప్రధాని అయినందుకు ఆ క్రెడిట్‌ను కాంగ్రెస్‌.. ప్రజలకు కాకుండా నెహ్రూకు కట్టబెట్టిందని మండిపడ్డారు.

అనంతరం మధ్యప్రదేశ్‌లోని షాదోల్‌లో జరిగిన మరో ర్యాలీలో ప్రసంగిస్తూ.. ‘నాలుగున్నరేళ్ల చాయ్‌వాలా’ పనితీరుకు, ‘నాలుగు తరాల నెహ్రూ–గాంధీ కుటుంబ’ పాలనకు మధ్య జరిగే పోటీకి తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ‘గాంధీ కుటుంబానికి చెందని, నిబద్ధత కలిగిన నాయకుడిని ఐదేళ్లు మీ పార్టీకి అధ్యక్షుడిగా నియమించండి. గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి కూడా కాంగ్రెస్‌ అధ్యక్షుడయ్యే లాంటి ప్రజాస్వామ్యాన్ని నెహ్రూ నిర్మించారని అప్పుడు నేనూ నమ్ముతా’ అని అన్నారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌లో తుదివిడత పోలింగ్‌ ఈనెల 20న జరగనుంది. మధ్యప్రదేశ్‌లో ఒకేవిడతలో 28న జరగనుంది.

నాలుగు తరాలా? నాలుగున్నరేళ్లా?..
కాంగ్రెస్‌ 55 ఏళ్ల పాలనలో సమకూర్చని విద్యుత్, ఎల్పీజీ, బ్యాంకు సేవలు వంటి సౌకర్యాల్ని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేరువచేసిందని మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో మోదీ అన్నారు. ‘ నాలుగు తరాల కాంగ్రెస్‌ పాలన, నాలుగున్నరేళ్ల చాయ్‌వాలా పాలన మధ్య పోటీ పెడదాం. అందరికీ బ్యాంకింగ్‌ సేవలు అందించాలన్న లక్ష్యంతో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బ్యాంకుల్ని జాతీయం చేశారు. కానీ పేదలకు ఈ నిర్ణయంతో ఎలాంటి ప్రయోజనం కలగలేదు. కానీ మా ప్రభుత్వం నాలుగున్నరేళ్లలోనే అందరికీ బ్యాంకింగ్‌ సేవలు కల్పించింది అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement