న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా విపక్షాలను ఏకం చేయాలని కాంగ్రెస్ భావిస్తుంటే, ఎన్నికల్లో విజయం సాధించి కేడర్‌లో ఆత్మవిశ్వాసం నింపాలని బీజేపీ పట్టుదలగా ఉంది. కుల సమీకరణాలు, చివరినిమిషంలో అభ్యర్థులు పార్టీలు మారడం, అధికార విపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఈ ఎన్నికలు హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల ముందు కీలక ఎన్నికలు కావడంతో విజయం కోసం బీజేపీ తరఫున ప్రధాని మోదీ, కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో నేడు తొలిదశ పోలింగ్ జరగనుంది.
బీఎస్పీతోనే తంటా..
ఛత్తీస్‌గఢ్‌లో సీఎం రమణ్‌సింగ్ సర్కారు తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటుండగా, ఎలాగైనా ఈసారి అధికారం చేపట్టాలన్న కాంగ్రెస్ పార్టీ గంపెడాశతో ఉంది. అయితే అజిత్ జోగి నేతృత్వంలోని జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్(జేసీసీ)–బీఎస్పీ కూటమి ఈ ఆశలపై నీళ్లు చల్లే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో బీఎస్పీ ఒక్క సీటునే గెలుచుకున్నప్పటికీ 4.27 శాతం ఓట్లను చీల్చిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. అలాగే గత ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) 1.57 శాతం ఓట్లను, గోండ్వానా గణతంత్ర పార్టీ 0.29 ఓట్లను పొందాయని తెలిపారు. దాదాపు 10 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలపై బీఎస్పీ–జేసీసీ కూటమి దృష్టిసారించినట్లు వెల్లడించారు. అయితే ఈ కూటమి వల్ల నష్టం మీకేనని కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం విమర్శించుకుంటున్నాయి. 2013 ఎన్నికల్లో ఈ పదింటిలో బీజేపీ 9 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ ఒక్క సీటుతో సరిపెట్టుకుంది.
శివరాజ్‌సింగ్‌కు వ్యతిరేక పవనాలు..
మధ్యప్రదేశ్‌లో గత 18 ఏళ్లుగా అధికారాన్ని నిలుపుకున్న శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వానికి ఎదురుగాలి వీస్తోంది. మంద్‌సౌర్ రైతులపై కాల్పులు, పంటలకు మద్దతు ధర సహా పలు అంశాల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ రాష్ట్రంలో ఏడాదిన్నర కాలంలో విస్తృతంగా పర్యటించారు. భేదాభిప్రాయాలను పక్కనపెట్టి పార్టీ విజయం కోసం కృషి చేయాలని నేతలు జ్యోతిరాదిత్య సింధియా, కమల్‌నాథ్, దిగ్విజయ్‌లకు దిశానిర్దేశం చేశారు. కాగా, ఇక్కడ సైతం బీఎస్పీ గట్టి ప్రభావాన్ని చూపనుంది.
2013లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 230 స్థానాలకు గానూ బీజేపీ 165 సీట్ల(44.88 శాతం ఓట్లు)తో అధికారాన్ని నిలబెట్టుకోగా, కాంగ్రెస్ 58 స్థానాలకు(36.38 శాతం ఓట్లు) పరిమితమైంది. ఇక బీఎస్పీ 6.29 శాతం ఓట్లతో నాలుగు సీట్లను దక్కించుకోగా, స్వతంత్రులు మూడు చోట్ల గెలిచారు. ఇటీవల సీఎం శివరాజ్‌సింగ్ బావ సంజయ్ సింగ్, మరో నేత సర్తాజ్ సింగ్ బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరడం, దళిత నేత ప్రేమ్‌చంద్ గుడ్డు బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో 28న జరగనున్న ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.
వసుంధర రాజేకు గుబులు..
తెలంగాణ అసెంబ్లీకి డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి నుంచి గట్టి పోటీ ఎదురుకానుందని విశ్లేషకులు అంటున్నారు. 119 స్థానాలున్న అసెంబ్లీలో 2014 ఎన్నికల్లో 63 స్థానాలు దక్కించుకున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అలాగే మిజోరంలో పదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్‌కు వ్యతిరేకత ఎదురుకానుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఏ పార్టీకీ వరుసగా రెండోసారి అధికారాన్ని అప్పగించని రాజస్తాన్ ప్రజల మనస్తత్వం సీఎం వసుంధరా రాజేను కలవరపెడుతోంది. మొత్తం 200 సీట్లున్న రాజస్తాన్ అసెంబ్లీకి 2013లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 163 చోట్ల ఘనవిజయం సాధించగా, కాంగ్రెస్ కేవలం 21 సీట్లతో చతికిలపడింది.
Comments
Please login to add a commentAdd a comment