సాక్షి, న్యూఢిల్లీ : 2014, మే 16వ తేదీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇదే సుదినం. ఆ రోజున వెలువడిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలం పార్లమెంట్‌లో 44 సీట్లకు పడిపోయింది. ఆ తర్వాత మొన్నటి వరకు జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతూనే వస్తోంది. ఒకటి, రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా ఆవిర్భవించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక పోయింది. బీజేపీ మాత్రం సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి తన విజయపరంపరను కొనసాగిస్తూ ఏకంగా 15 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఓ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకన్నా తక్కువ సీట్లు వచ్చినప్పటికీ ఇతరులతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది.
రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం, మధ్యప్రదేశ్‌లో బీజేపీతో దీటుగా ఎదుర్కోవడం సాధారణ విషయం కాదు. ఒక్క తెలంగాణాలోనే ఆశించిన ఫలితాలు అందలేదు.
రానున్న రోజుల్లో బీజేపీకి గడ్డు రోజులు ఉంటాయని ఉత్తరప్రదేశ్‌లోని మూడు లోక్‌సభకు జరిగిన ఎన్నికల ఫలితాలే చెప్పాయి. నాడు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆయన డిప్యూటి చీఫ్ కేశవ్ ప్రాతినిథ్యం వహించిన రెండు స్థానాలతోపాటు మరో లోక్‌సభ సీటును బీజేపీ కోల్పోయింది. ఈ ఎన్నికల ఫలితాలు హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment