లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డట్టు ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. తెలంగాణలో మాత్రం అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలూ కాంగ్రెస్ వైపే మొగ్గడం విశేషం. రాష్ట్రంలో హస్తం పార్టీ తొలిసారి అధికారంలోకి రానుందని అవి పేర్కొన్నాయి. అయితే వీటిలో చాలా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు గురువారం సాయంత్రం ఒకవైపు ఇంకా పోలింగ్ కొనసాగుతుండగానే వెలువడటం గమనార్హం.
ఈ నేపథ్యంలో తెలంగాణపై తన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను శుక్రవారం ప్రకటించనున్నట్టు ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారం నిలుపుకోనుందని ఎగ్జిట్ పోల్స్‌లో చాలావరకు పేర్కొన్నాయి. ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియాతో పాటు టైమ్స్ నౌ–ఈటీజీ, ఇండియా టీవీ–సీఎన్‌ఎక్స్, టుడేస్ చాణక్య కాంగ్రెస్‌కు మెజారిటీ సీట్లు కట్టబెట్టాయి. బీజేపీ, కాంగ్రెస్‌ల్లో ఎవరిదైనా పై చేయి కావచ్చని ఏబీపీ–సీవోటర్, జన్ కీ బాత్ పేర్కొన్నాయి.
ఇక రాజస్తాన్‌లో అధికార కాంగ్రెస్‌ను బీజేపీ ఓడించనుందని టైమ్స్ నౌ, రిపబ్లిక్ టీవీ, ఏబీపీ, జన్ కీ బాత్, టుడేస్ చాణక్యతో సహా అత్యధిక ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా మాత్రం బీజేపీకి 86 నుంచి 106, కాంగ్రెస్‌కు 80 నుంచి 100 సీట్లొస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ 94 నుంచి 104 సీట్లతో అధికారం నిలుపుకుంటుందని ఇండియా టీవీ–సీఎన్‌ఎక్స్ పేర్కొంది. ఇక మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చినా బీజేపీ అధికారం నిలబెట్టుకోనుందని పలు సర్వేలు తెలిపాయి.
230 సీట్లకు గాను దానికి బీజేపీకి 162 సీట్ల దాకా వస్తాయని ఇండియాటుడే––యాక్సిస్ మై ఇండియా పేర్కొనగా టుడేస్ చాణక్య 151, ఇండియా టీవీ–సీఎన్‌ఎక్స్ 159 దాకా రిపబ్లిక్ టీవీ 130 దాకా ఇచ్చాయి. ఏబీపీ–సీవోటర్ మాత్రం కాంగ్రెస్‌కు 113 నుంచి 137 స్థానాలొస్తాయని, బీజేపీ 88 నుంచి 112కు పరిమితమవుతుందని చెప్పింది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో అధికార ఎంఎన్‌ఎఫ్, జెడ్‌పీఎం హోరాహోరీగా తలపడ్డట్టు సర్వేలు స్పష్టం చేశాయి. అక్కడ హంగ్ రావచ్చని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 3న వెలువడనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అంచనాలకందని తెలంగాణ
ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నా తెలంగాణలో పోలింగ్ సరళి ఎవరికీ కచ్చితంగా అంతుబట్టడం లేదు. ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా సంస్థ తెలంగాణలో పోలింగ్ తీరుతెన్నులను అంచనా వేయలేకపోయింది. రాష్ట్రంలో అధిక ధన ప్రభావం, పైగా గురువారం సాయంత్రం గడువు దాటాక కూడా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుండడమే ఇందుకు ప్రధాన కారణమని సంస్థ అధినేత ప్రదీప్ గుప్తా స్పష్టం చేశారు.
దాంతో కచ్చితమైన ఎగ్జిట్ పోల్ అంచనాలకు రాలేకపోతున్నామన్నారు. తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్‌పై శుక్రవారం స్పష్టత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో గురువారం మధ్యాహ్నం ఒంటి గంట దాకా 36.68 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఐదింటికల్లా 63.94 శాతానికి పెరిగింది. సాయంత్రం ఐదు గంటల తర్వాత కూడా చాలా పోలింగ్ కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లున్నారు.
తెలంగాణ అంచనాలు కాంగ్రెస్‌వైపే!
Published Fri, Dec 1 2023 5:01 AM | Last Updated on Fri, Dec 1 2023 11:44 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment