సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి, ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలైన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో గెలుపోటములపై తీవ్ర చర్చ సాగుతోంది. ఈసారైనా అధికారంలోకి వస్తున్నామా, లేదా అన్నదానిపై అభ్యర్థులు, ముఖ్య నేతలు, పార్టీ కేడర్‌లో ఉత్కంఠ కనిపిస్తోంది. పోలింగ్ సరళి అనుకూలమనే లెక్కలు, ‘చేతి’కి మొగ్గు ఉందన్న ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు నిజమవుతాయా, మ్యాజిక్ ఫిగర్ దాటి పవర్‌లోకి వస్తామా అన్న దానిపైనే శుక్రవారం పొద్దంతా కాంగ్రెస్ శ్రేణులు చర్చలతో గడిపాయి.
కౌంటింగ్‌కు మరోరోజు ఉన్న నేపథ్యంలో.. ఎన్ని స్థానాల్లో గెలుస్తాం? ఎక్కడెక్కడ గట్టి పోటీ అవకాశముంది? ఎక్కడెక్కడ ఓడిపోవచ్చు? దక్షిణ తెలంగాణను నిజంగానే స్వీప్ చేస్తున్నామా? ఉత్తర తెలంగాణలో బలం పెరిగిందా? హైదరాబాద్, శివారు నియోజకవర్గాల పరిస్థితేంటి? అన్న అంశాలపై నేతలు లెక్కలు వేసుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడి నుంచి గ్రామస్థాయి కార్యకర్త వరకు ఇదే తీరు కావడం గమనార్హం.
ఉత్కంఠలో అభ్యర్థులు
ఎన్నికల్లో పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠలో ఉన్నారు. తాము గెలుస్తామా లేదా అన్నదానిపై లెక్కలు వేసుకుంటున్నారు. గ్రామ, మండల స్థాయి నేతలతో భేటీ అవుతూ.. ఏ గ్రా మంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి? అందులో తమ కు పడిన ఓట్లెన్ని? ఏ మండలంలో ఎంత మెజార్టీ వస్తుంది? ఎంత తక్కువ వస్తాయనే అంశాలతో క్షేత్రస్థాయిలో పోలింగ్ సరళిపై అంచనాలు సిద్ధం చేసుకుంటున్నారు.
ఇదే సమయంలో ఆదివారం జరగనున్న కౌంటింగ్ కోసం ఏజెంట్లు, వారికి కావాల్సిన పత్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పోలింగ్ రోజున ఎంత జాగ్రత్తగా ఉన్నామో, కౌంటింగ్ కేంద్రాల్లోనూ అంతే జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడా తేడా రాకుండా కౌంటింగ్‌ను పరిశీలించాలని ఏజెంట్లకు సూచనలిస్తున్నారు.
ఎప్పటికప్పుడు ఏఐసీసీతో సంప్రదింపులు
తెలంగాణ ఫలితం సానుకూలంగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో.. టీపీసీసీ నాయకత్వం ఎప్పటికప్పుడు ఏఐసీసీ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తదితరులు తమ నియోజకవర్గాల నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఢిల్లీ పెద్దలతో టచ్‌లో ఉన్నారు. రాష్ట్రంలోని పరిస్థితిని వారికి వివరిస్తూ, ఏయే పరిణామాలు తలెత్తితే ఎలా ఎలా వ్యవహరించాలన్న దానిపై హైకమాండ్ నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు.
మరోవైపు వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా పోలింగ్ సరళిపై ఇచ్చిన నివేదికలో పార్టీకి అధికారం వస్తుందని పేర్కొన్నట్టు తెలిసింది. దీనికి అనుగుణంగా టీపీసీసీ నాయకత్వం ఏర్పాట్లు చేసుకుంటోంది. హైదరాబాద్‌లోని రేవంత్, భట్టి నివాసాలకు పలువురు పార్టీ నేతలు వెళ్లి చర్చలు జరిపారు. పోలింగ్ సరళి ఎలా జరిగింది? ఏ జిల్లాలో ఎలాంటి ఫలితాలు వస్తున్నాయన్న దానిపై చర్చించారు.
పూర్తి మెజార్టీ రాకుంటే ఏం చేద్దాం?
ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా.. ఆదివారం వెలువడే ఫలితాల్లో పార్టీకి వచ్చే సీట్లను బట్టి పావులు ఏఐసీసీ, టీపీసీసీ ప్రణాళికలు రచిస్తున్నాయి. అధికారం చేపట్టేందుకు అవసరమైన దానికంటే ఎక్కువ స్థానాల్లో గెలిస్తే ఎలాంటి సమస్యా ఉండదని నేతలు పేర్కొంటున్నారు. కానీ ఎక్కువ సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచినా పూర్తి మెజార్టీ రాకుంటే.. గెలిచిన నాయకులందరినీ తక్షణమే కర్ణాటకకు తరలించి క్యాంపు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం.
దీనికి సంబంధించి కాంగ్రెస్ ముందు జాగ్రత్త చర్యలు కూడా చేపట్టిందని.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను హైదరాబాద్‌కు పంపాలని నిర్ణయించిందని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. డీకే శివకుమార్ శనివారం మధ్యాహ్నం కల్లా హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉందని అంటున్నాయి. ఇక కొన్నిసీట్లు తక్కువపడితే ఎంఐఎం మద్దతు తీసుకోవాలా, వద్దా? అన్న అంశంపైనా ఏఐసీసీతో టీపీసీసీ నేతల సంప్రదింపుల సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment