ఇండోర్ : పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచార సందర్భంగా సిద్ధూ ఇండోర్ మేయర్‌ను విమర్శించిన సంగతి తెలిసిందే. సిద్దూ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె, సిద్ధూని ఉద్దేశిస్తూ.. ‘మిస్టర్ స్టుపిడ్’ అనడమే కాక మేయర్ మాలిని లక్ష్మణ్‌సింగ్ గౌర్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సిద్ధూ క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ మహిళా కార్యకర్తలు కూడా ఇండోర్‌లోని రాజ్‌వాడ ప్రాంతంలో దేవి అహల్య విగ్రహం ముందు మౌన దీక్ష చేసి నిరసన తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఇండోర్‌లో జరిగిన ఓ ప్రచార ర్యాలీలో పాల్గొన్న సిద్ధూ, నగర మేయర్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నగరంలో జరుగుతున్న అక్రమ కట్టడాల కూల్చివేతపై మాట్లాడుతూ.. ‘చప్పట్లు కొట్టండి అలాగే మేయర్‌ను కూడా కొట్టండి’ అంటూ సిద్ధూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక నష్టపరిహారం ఇవ్వకుండా ప్రజల ఇళ్లను కూల్చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సిద్ధూ టెలివిజన్ కామెడీ షోలో ‘చప్పట్లు కొట్టు’ అనే పదం ఎక్కువగా వాడతారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన అదే పదాన్ని వాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా నేత పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఆ పార్టీ తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో సిద్ధూ క్షమాపణలు చెప్పాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నవంబర్ 28న మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment