
న్యూఢిల్లీ : పాకిస్తాన్‌లో నాన్‌కానా సాహిబ్ గురుద్వారాపై జరిగిన దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బిజేపి నాయకురాలు మీనాక్షి లెఖీ తెలిపారు. అయితే దాడి జరిగిన సమయంలో కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ ఎక్కడికి పారిపోయారో తనకు తెలియదని, ఎవరైనా కనిపెట్టాలంటూ చురకలంటించారు. గురుద్వారాపై జరిగిన దాడిపై శనివారం బిజెపి జాతీయ కార్యదర్శి తరుణ్ చుగ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లేఖీ మాట్లాడుతూ .. పాకిస్తాన్‌లోని మతపరమైన ప్రదేశాలలో నిరంతరం హింస చోటుచేసుకుంటుందని వెల్లడించారు. కొన్ని దశాబ్దాలుగా బలవంత మత మార్పిడులు, అత్యాచారాలతో మైనారిటీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపారు.
పాకిస్తాన్‌లో యువతులను బలవంతంగా ఎత్తుకొచ్చి వారికి మతమార్పిడిలు చేసి ముస్లిం అబ్బాయిలకు ఇచ్చి వివాహాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటివి అక్కడ వేల సంఖ్యలో జరుగుతున్న పోలీసులు, ప్రభుత్వం అరికట్టాల్సింది పోయి వారికి వత్తాసు పలకడం దారుణమని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఏర్పడిన నాటి నుంచి అక్కడ హింస నిరంతరాయంగా కొనసాగుతుండడంతో మైనారిటీలు భారతదేశంలోకి బలవంతంగా చొరబడుతున్నారు. దీనివల్ల దేశంలో పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయడం సరైందేనని తాను భావిస్తున్నట్లు తెలిపారు. సీఏఏ అవసరం దేశంలో ఎంత ఉందనేది పాకిస్తాన్‌లో జరిగిన చర్యలే నొక్కిచెబుతున్నాయని వివరించారు.
సిక్కులకు ఎంతో పవిత్రంగా భావించే నాన్‌కానా సాహిబ్ గురుద్వారాపై జరిగిన దాడులు కాబా, జెరూసలేంపై జరిగిన దాడులతో సమానం అని ఆమె అభివర్ణించారు.ఈ దాడి జరిగిన సమయంలో సిద్దూ ఎక్కడికి పారిపోయాడో తనకు తెలియదని పేర్కొన్నారు. అతను ఎక్కడున్నాడనేది ఎవరైనా కనిపెట్టాలని, ఒకవేళ ఈ దాడి జరిగిన తర్వాత ఐఎస్ఐ చీఫ్ ను ఆలింగనం చేసుకుంటాడేమోనన్న విషయాన్ని కాంగ్రెస్ పరిశీలించాల్సిన అవసరం ఉందని మీనాక్షి లేఖీ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment