ఈ ఫలితాలే ‘రోడ్‌ మ్యాప్‌’! | lok sabha referendum on five state elections results | Sakshi
Sakshi News home page

ఈ ఫలితాలే ‘రోడ్‌ మ్యాప్‌’!

Published Mon, Dec 10 2018 5:32 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

lok sabha referendum on five state elections results - Sakshi

వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల పోరుకు సెమీ ఫైనల్స్‌గా పరిగణిస్తున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో ఈవీఎంలలో నిక్షిప్తమైంది పోటీలో నిలిచిన అభ్యర్థుల భవిష్యత్తే కాదు.. ప్రధాన రాజకీయ పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌ల భవితవ్యం కూడా. 2019 లోక్‌సభ ఎన్నికలపై ఈ ఫలితాలు గణనీయ ప్రభావం చూపనున్నాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌ల్లో కమలం పార్టీ అధికారంలో ఉంది. ఈశాన్యంలో కాంగ్రెస్‌కు మిగిలిన ఏకైక రాష్ట్రం మిజోరం. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు నిజమైతే.. రాజస్తాన్‌లో ఈ సారి కాంగ్రెస్‌ అధికార పీఠాన్ని అధిరోహించనుంది. అలాగే, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు ఉంది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌దే విజయమని, మిజోరం కాంగ్రెస్‌ చేజారనుందని అవి తేల్చాయి.  

రెండు పక్షాలకు గెలుపు అవసరమే!
రాజస్తాన్‌తో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల్లో కనీసం ఒక్క రాష్ట్రాన్నైనా కాంగ్రెస్‌ చేజిక్కించుకోగలిగితే.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు గట్టి బలం చేకూరుతుంది. కాంగ్రెస్‌ చీఫ్‌గా, జాతీయ స్థాయి నేతగా రాహుల్‌ గాంధీ స్థానం బలోపేతమవుతుంది. బీజేపీయేతర పక్షాల కూటమికి కాంగ్రెస్‌ పక్షాన రాహుల్‌ నేతృత్వం వహించగల అవకాశాలు మెరుగవుతాయి. లేని పక్షంలో, ఎన్నికల పొత్తులు, సీట్ల పంపకాల చర్చల్లో ఎన్‌డీఏయేతర ప్రాంతీయ పార్టీల నుంచి వచ్చే అనేకానేక డిమాండ్లకు తలొగ్గాల్సి వస్తుంది.

కనీసం రెండు రాష్ట్రాల్లోనైనా కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. బీజేపీ వ్యతిరేక విపక్ష కూటమికి నేతగా రాహుల్‌ ఆమోదనీయత పెరుగుతుంది. ఇతర పక్షాలు కాంగ్రెస్‌ మాట వినక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా, కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితాలు రాకుంటే, రాహుల్‌ ఇమేజ్‌తో పాటు కాంగ్రెస్‌ ప్రతిష్ట భారీగా దెబ్బతింటాయి. ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ఏన్డీయేయేతర ప్రాంతీయ పార్టీల నేతలు ‘ప్రత్యామ్నాయాలు’గా ఎదుగుతారు. మిజోరంలో అధికారం కోల్పోతే మొత్తంగా ఈశాన్యం నుంచి కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యమే ఉండదు.

మరోవైపు, కనీసం రెండు రాష్ట్రాల్లోనైనా విజయం సాధించడం బీజేపీకి అవసరం. ఇన్నాళ్లూ కొనసాగిన విజయపరంపరను ఈ ఎన్నికల్లోనూ  కొనసాగించడం ద్వారానే ఆ పార్టీ ఆత్మవిశ్వాసంతో లోక్‌సభ ఎన్నికల బరిలో దిగగలదు. ఎన్డీయే పక్షాలతో పొత్తు చర్చల్లోనూ ఆధిక్యత కనపర్చగలదు. ఓటమి ఎదురైతే మాత్రం పార్టీలో, పార్టీ అగ్రనేతల్లో ఆత్మవిశ్వాసం భారీగా దెబ్బతింటుంది. పార్టీ లో అసహన స్వరాల జోరు పెరుగుతుంది.

కూటముల్లోనూ మార్పులు
ఈ ఫలితాల అనంతరం జాతీయ స్థాయిలో ప్రధాన కూటములైన ఎన్డీయే, యూపీఏల్లోని పార్టీల్లో కూడా మార్పుచేర్పులు చోటు చేసుకునే అవకాశముంది. ఎంతగా విమర్శించినా, బీజేపీ మిత్రపక్షంగానే  శివసేన కొనసాగుతుంది. కానీ, బిహార్‌కు చెందిన రాష్ట్రీయ లోక్‌సమత పార్టీల్లాంటివి మాత్రం ఇప్పటికే ఎన్డీయేకు దూరమయ్యే దిశగా సంకేతాలిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే మిత్రపక్షాలపై పట్టును పెంచుకోగలదు. పక్క చూపులు చూస్తున్న ఎన్డీయే పార్టీల ఆలోచనల్లో మార్పు రాగలదు. మొత్తానికి, ప్రధాన పార్టీల నుంచి కీలక నేతలంతా ప్రచారం చేయడాన్ని బట్టే ఈ ఎన్నికలను ఆయా పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో అర్థమవుతుంది.
- నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement