
వాషింగ్టన్‌డీసీ: కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్-బీజేపీ మధ్య పరస్పర విమర్శల దాడి కొనసాగుతోంది. బీజేపీకి బలం లేకపోయినా ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించి భంగపడిందని, అధికారాన్ని దుర్వినియోగం చేసి తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన సంగతి తెలిసింది. కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఖండించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీనే అతిపెద్ద అవినీతి పార్టీ అని ఆయన విమర్శించారు.
కర్ణాటకలో ప్రజాతీర్పునకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ.. జేడీఎస్‌తో అపవిత్ర పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, కాంగ్రెస్ అవినీతికి ఇది తాజా నిదర్శనమని ఆయన అన్నారు. వాషింగ్టన్‌డీసీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ మొదలుకొని, రాజీవ్‌గాంధీ, గత యూపీఏ ప్రభుత్వాల్లోనూ పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని అన్నారు. గత నాలుగేళ్లుగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవినీతిరహిత పారదర్శక పాలన అందిస్తోందని చెప్పారు.