బీఎస్ యడ్యూరప్ప
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తన పదవికి సీఎం బీఎస్ యడ్యూరప్ప రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అసెంబ్లీలో విశ్వాసపరీక్షకు ముందే ప్రకటన చేసి ట్విస్ట్ ఇచ్చారు. సభ వాయిదా పడిన యడ్యూరప్ప రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పించారు. దీంతో మూణ్నాళ్ల ముచ్చటగానే యడ్యూరప్ప ప్రభుత్వం ముగిసింది. కేవలం మూడు రోజుల్లోనే.. అంటే 58 గంటల్లోనే యడ్యూరప్ప సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేకపోయామని గ్రహించిన యడ్యూరప్ప సభలో ఉద్వేగభరితంగా ప్రసంగించారు. మరోవైపు సీఎం రాజీనామాతో ప్రజాస్వామ్యం నెగ్గిందంటూ కాంగ్రెస్-జేడీఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
గతంలోనూ యెడ్డీ ఇలాగే..
2007లో నవంబర్ 12న సీఎంగా బాధ్యతలు చేపట్టిన యడ్యూరప్ప కేవలం 8 రోజులపాటు పదవిలో కొనసాగి అదే నెల 19న రాజీనామా చేశారు. 2008-2011లో మూడేళ్లపాటు యడ్యూరప్ప సీఎంగా కొనసాగారు.
కీలకంగా మారిన సుప్రీంకోర్టు తీర్పు
ఏ పార్టీ మెజార్టీ సాధించని పక్షంలో అత్యధిక సీట్లు 104 గెలుపొందిన బీజేపీ వైపు గవర్నర్ వజుభాయ్ వాలా మొగ్గు చూపారు. గురువారం రాత్రి యడ్యూరప్పతో సీఎంగా ప్రమాణం స్వీకరించి.. బలపరీక్షకు 15 రోజుల గడువిచ్చారు. అయితే కాంగ్రెస్-జేడీఎస్ పిటిషన్‌ను శుక్రవారం విచారించిన సుప్రీంకోర్టు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు కర్ణాటక అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని బీజేపీని ఆదేశించిన విషయం తెలిసిందే. తక్కువ సమయం దొరకడంతో బీజేపీ నేతలు ‘ఆపరేషన్ కమలం’ ను విజయవంతం చేసుకోలేకపోయారు.
జగదాంబిక పాల్‌ను మర్చిపోలేం!
గతంలోనూ ఇలాంటి పరిస్థితుల్లోనే కొన్ని రాష్ట్రాలు న్యాయం కోసం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది 1998లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఏర్పాటు ఘటన. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేత జగదాంబిక పాల్ ఫిబ్రవరి21న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే మూడు రోజుల్లోనే ఫిబ్రవరి 23న ఆ ప్రభుత్వం కుప్పకూలింది. ఒక్క రోజు సీఎంగా ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికీ జగదాంబిక పాల్‌ను స్థానికులు చెప్పుకుంటుంటారు. ఎన్నికల్లో మెజారిటీ సాధించిన బీజేపీ నేత కళ్యాణ్ సింగ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించకపోవడం అప్పట్లో యూపీలో వివాదాస్పదంగా మారింది.
ప్రభుత్వ ఏర్పాటుకు జగదాంబిక పాల్‌ను ఆహ్వానించిన గవర్నర్ రోమేష్ భండారీ బల నిరూపణ చేసుకోవాలని సూచించారు. విశ్వాస పరీక్ష సమయంలో అసెంబ్లీలో హింస చెలరేగి రక్తపాతం జరగడంతో రాష్ట్రపతి పాలన విధించాలని భండారీ కేంద్రానికి సూచించారు. చివరికి ఇతర పార్టీల మద్దతుతో కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment