
సాక్షి, విజయవాడ : కర్ణాటకలో అడ్డదారుల్లో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నించిందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. కర్ణాటకలో బలపరీక్ష విషయంలో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు నిచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని అన్నారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే.. సీఎం చంద్రబాబునాయుడు స్క్రిప్ట్ చేత్తో పట్టుకొని రెడీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో తన సలహాలు, సూచనలు వల్లే కాంగ్రెస్-జేడీఎస్ అధికారంలోకి వచ్చాయని సీఎం చంద్రబాబు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు.
చంద్రబాబుది అవకాశవాద రాజకీయమని మండిపడ్డారు. మహారాష్ట్రకు చెందిన బీజేపీ మంత్రి భార్యకు టీటీడీలో బోర్డులో సభ్యత్వం ఎందుకు ఇచ్చారో చంద్రబాబు చెప్పాలని నిలదీశారు. సూర్యుడు, చంద్రుడు ఉదయించేది, అస్తమించేది తన వల్లేనని చంద్రబాబు చెప్పుకుంటారని, తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించిన చంద్రబాబుతోపాటు కర్ణాటకలో ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించిన బీజేపీ నాయకులపైనా సుప్రీంకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని అన్నారు.