సాక్షి, విజయవాడ: భారతీయ జనతా పార్టీతో తెగతెంపులు చేసుకున్నామని తెలుగుదేశం చెబుతూనే బీజేపీ మంత్రి భార్యకు టీటీడీ పాలకమండలి సభ్యత్వం ఎలా ఇచ్చారు ? బీజేపీ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భర్తను మహానాడు వేదికపై ఎలా అనుమతించారు? మీరు నిజంగా బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారని ఎవరు నమ్ముతారు? అని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి టీడీపీపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ సీనియర్ నేత ఉమన్ చాందీని రాష్ట్ర పార్టీ ఇంచార్జిగా వేశారు. ఇప్పటి నుంచి రాష్ట్రంలో మా గేమ్ ప్రారంభమవుతోంది. 2019 మా టార్గెట్. ప్రత్యేక హోదా, విభజన హామీలను కాంగ్రెస్ వల్లే సాధ్యం. రైతు రుణమాఫీ, స్నేహపూరిత జీఎస్టీ, పెట్రోల్ డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెస్తాం.
ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం. ప్రజల్లోకి ఇదే నినాదంతో వెళ్తాం. కర్ణాటకలో తెలుగు వారు కాంగ్రెస్‌ను గెలిపించారు. తాజాగా 14 చోట్ల జరిగిన ఎన్నికల్లో 12 చోట్ల బీజేపీయేతర శక్తులు గెలిచాయి. చంద్రబాబు రాహూల్ గాంధీని బెంగుళూరులో కలిసింది కాకతాళీయంగా జరిగిందే. దానికి రాజకీయ ప్రాధాన్యత లేదు. 2019లో బీజేపీని అధికారంలోకి రానివ్వకూడదనేది రాహుల్ గాంధీ నిర్ణయం. రాష్ట్రంలో టీడీపీతో ఇప్పటి వరకు ఎటువంటి సంప్రదింపులు జరపలేదు. టీడీపీతో పొత్తులు అంటూ జరుగుతున్న ప్రచారంపై కార్యకర్తల అభిప్రాయాలను తీసుకుంటున్నాం. మా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి వచ్చిన తరువాతే దీనిపై వివరిస్తాం’ మని రఘువీరా వెల్లడించారు.
కాంగ్రెస్‌లోనే ఉంటాను
నేను కాంగ్రెస్‌లోనే వుంటాను. రాజకీయాల్లో ఉన్నంతవరకు కాంగ్రెస్ లోనే వుంటాను. పార్టీలో నాది సంతృప్తికరమైన రాజకీయ జీవితం. 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కూడా పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment