బెంగళూరులో నిర్మలానందనాథ స్వామి ఆశీస్సులు పొందుతున్న కుమారస్వామి
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో సీఎం కుమారస్వామి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం శుక్రవారం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. ఇరు పార్టీల ఎమ్మెల్యేలను కలిపితే కూటమి వద్ద 117 ఎమ్మెల్యేలున్నారు. స్పీకర్ ఎంపిక తర్వాత ఈ ఎన్నిక జరగనున్నందున సభలో ఉండే మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా బలపరీక్షలో గెలిచేందుకు 111 మంది మద్దతు అవసరం. దీంతో చివరి నిమిషంలో రాజకీయాలు చోటుచేసుకుంటేతప్ప కూటమి సర్కారు ‘పరీక్ష’లో నెగ్గటం దాదాపు ఖాయంగానే కనబడుతోంది. కుమారస్వామితో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ఇదే నమ్మకంతో ఉన్నారు. బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లో బల పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కన్నడ అసెంబ్లీలో శుక్రవారం విశ్వాస పరీక్ష జరగనుంది. విశ్వాస పరీక్షను ‘సంకీర్ణం’ సీరియస్‌గా తీసుకుంది. మొత్తం బలనిరూపణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ‘ఆపరేషన్ కమల’ నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకుంటోంది. అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇంకా హోటల్ గదుల్లోనే ఉన్నారు. మే 15న ఫలితాలు వెల్లడైనప్పటినుంచీ కాంగ్రెస్ రిసార్టు రాజకీయాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొందరు ఎమ్మెల్యేలు కూటమికే ఓటేస్తామని, ఇళ్లకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పినప్పటికీ వారిని హోటల్ నుంచి పంపేందుకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అటు జేడీఎస్ ఎమ్మెల్యేలు కూడా నగరంలోని మరో హోటల్‌లోనే ఉన్నారు. వారిని కూడా ఇళ్లకు పంపేందుకు ఆ పార్టీ నేతలు అంగీకరించనట్లు తెలిసింది.
బీజేపీ మరో ప్రయత్నం
సరైన బలం లేక విశ్వాస పరీక్షకు ముందే వెనక్కు తగ్గిన బీజేపీ.. స్పీకర్ ఎన్నికకు మాత్రం తమ అభ్యర్థిని బరిలో దించింది. ఐదోసారి ఎమ్మెల్యేగా ఎంపికైన సీనియర్ నేత ఎస్. సురేశ్ కుమార్‌తో నామినేషన్ వేయించింది. శుక్రవారం మధ్యాహ్నం కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్షకు ముందు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ స్థానాలకు ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి తరపున మాజీ స్పీకర్ రమేశ్ కుమార్ స్పీకర్‌గా ఖరారు కాగా, డిప్యూటీ స్పీకర్‌గా జేడీఎస్ ఎమ్మెల్యే ఒకరికి అవకాశం దక్కనుంది. యడ్యూరప్ప, ఇతర ముఖ్యనేతల ఆదేశాలతోనే నామినేషన్ వేసినట్లు సురేశ్ కుమార్ తెలిపారు. ‘అసెంబ్లీలో మా సంఖ్య, వివిధ అంచనాలతో నేను విజయం సాధిస్తానని మా పార్టీ బలంగా నమ్ముతోంది. ఆ ధైర్యంతోనే నేను నామినేషన్ వేశాను. ఫలితం మీరే చూస్తారు’ అని ఆయన పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పరమేశ్వర, మాజీ సీఎం సిద్దరామయ్య వెంటరాగా రమేశ్ గురువారం నామినేషన్ వేశారు. తమ అభ్యర్థి విజయం సాధించటం తథ్యమని, అందుకని ముందే బీజేపీ తమ నామినేషన్ వెనక్కు తీసుకోవడమే మంచిదని సిద్దరామయ్య ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా, కర్ణాటక సీఎం కుమారస్వామిపై మాజీ సీఎం, అసెంబ్లీలో బీజేపీ పక్షనేత యడ్యూరప్ప తీవ్ర విమర్శలు చేశారు. సంకీర్ణ భాగస్వామి అయిన కాంగ్రెస్‌పై స్వామికి నమ్మకం లేదన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన కుమారస్వామి.. తన డిప్యూటీ పరమేశ్వరకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. లింగాయత్‌ల గురువు పండితారాధ్య శివాచార్య స్వామీజీపై కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు (రాజకీయాల్లో తలదూర్చవద్దంటూ) ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. ఇలాంటి అపవిత్ర కూటమిపై ప్రజలకు పెద్దగా ఆశల్లేవన్నారు.
‘ఐదేళ్ల’పై చర్చించలేదు! డిప్యూటీ సీఎం పరమేశ్వర
బెంగళూరు: కుమారస్వామే ఐదేళ్లపాటు సీఎంగా కొనసాగే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం పరమేశ్వర స్పష్టంచేశారు. ‘జేడీఎస్‌కు ఏయే మంత్రిత్వ శాఖలు ఇవ్వాలి. కాంగ్రెస్‌కు ఏయే శాఖల బాధ్యతలు ఇస్తారనేదానిపైనా ఎలాంటి నిర్ణయం జరగలేదు’ అని అన్నారు. మరి ఐదేళ్లు జేడీఎస్‌కే ఈ బాధ్యతలు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోందా అని ప్రశ్నించగా.. ‘పార్టీలో చర్చిస్తాం. రాష్ట్రానికి సుపరిపాలన ఇవ్వాలనేదే మా లక్ష్యం’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతల మధ్య డిప్యూటీ సీఎం విషయంలో వ్యతిరేకత ఉందనే విషయాన్ని ఆయన ఖండించారు. ఇదంతా మీడియా సృష్టేనని ఆయన కొట్టిపడేశారు. అయితే ఉప ముఖ్యమంత్రి పదవిని తనకు ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో పార్టీ ఓటమికి ఈవీఎంలే కారణమని పరమేశ్వర తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి 70–80% ఓట్లున్న బూత్‌లలోనూ బీజేపీ మెజారిటీ సాధించటంపై విచారణ జరుపుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment