బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కుమారస్వామి
కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవం.. ఎన్డీయేతర ప్రాంతీయ పార్టీల ఐక్యతకు వేదికగా మారింది. సంకీర్ణ కూటమి భాగస్వామిగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్, సోనియాలు హాజరైనా.. వేదికపై ప్రాంతీయ పార్టీల అధినేతల సందడి ప్రధానంగా కనిపించింది. ఎస్పీ చీఫ్ అఖిలేశ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సహా పలువురు ప్రాంతీయ పార్టీల నేతలు, బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. కన్నడనాట బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో కీలకంగా వ్యవహరించినందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ని ఏపీ సీఎం చంద్రబాబు భుజం తట్టి అభినందించారు. చేయి కలిపి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ కృషిని బాబు ప్రశంసించారు. కాసేపు వీరిద్దరూ మాట్లాడుకున్నారు. సోనియా, మాయావతిల ఆత్మీయ ఆలింగనం అందరి దృష్టిని ఆకర్షించింది.
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్‌డీ కుమారస్వామి బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. కేంద్రంలో ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యకూటమి వేసిన తొలి అడుగుగా భావిస్తున్న ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా సహా పలు రాష్ట్రాల సీఎంలు, ప్రాంతీయ పార్టీల అధినేతలు హాజరయ్యారు. కన్నడ సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ప్రాంతీయ పార్టీల మేళాను తలపించింది. దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర పక్షంలో ఉన్న దాదాపు అన్ని పార్టీల నేతలు వేదికపై కనిపించారు. కర్ణాటక విధానసౌధ ఆవరణలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. సైద్ధాంతిక వైరుధ్యాలను పక్కనపెట్టి వీరంతా ఒకే వేదికను పంచుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆత్మీయ ఆలింగనాలు చేసుకున్నాను. సోనియా, మమతలు ఒకరినొకరు ప్రేమగా పలకరించుకోవడం, తేజస్వీ యాదవ్ మమత, మాయావతి, సోనియాల పాదాలకు నమస్కరించటం అందరి దృష్టిని ఆకర్షించాయి.
రాహుల్‌ను ప్రశంసించిన బాబు
ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక రాహుల్ దగ్గరికెళ్లిన చంద్రబాబు భుజం తట్టి అభినందించారు. చేయి కలిపి శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటకలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ కృషిని బాబు ప్రశంసించారు. సాధారణంగా రెండు వేళ్లు పైకెత్తి విక్టరీ సింబల్‌తో అభివాదం చేసే చంద్రబాబు.. ఈ వేదికపై మాత్రం చెయ్యి ఊపుతూ అభిమానులను పలకరించటం ఆసక్తిరేపింది. మమత, మాయావతి, అఖిలేశ్‌లతోనూ కబుర్లు చెప్తూ కనిపించారు. కార్యక్రమంలో చంద్రబాబు ఎక్కువసేపు మమతా బెనర్జీతో మాట్లాడుతూ కనిపించారు. మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ దేవెగౌడ వేదికపైకి వచ్చిన అతిథులకు స్వాగతం పలికారు.
హాజరైన ప్రముఖులు
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, పంజాబ్ సీఎం అమరీందర్, ఏపీ సీఎం చంద్రబాబు, కేరళ సీఎం విజయన్, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సీపీఎం, సీపీఐల ప్రధాన కార్యదర్శులు ఏచూరి, సురవరం సుధాకరరెడ్డి, శరద్ యాదవ్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్, డీఎంకే నేత కనిమొళి, ఆర్‌ఎల్‌డీ చీఫ్ అజిత్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం సాయంత్రమే కుమారస్వామిని కలిసి అభినందించి వెళ్లారు.
వేదికపై అపురూప దృశ్యాలు
శరద్ పవార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సీతారాం ఏచూరి వేదిక చివర్లో కూర్చుని మాట్లాడుకోవటం, అఖిలేశ్, మాయావతిల కబుర్లు, మాయావతి, సోనియా ఆత్మీయ ఆలింగనం వంటి ఆసక్తికర దృశ్యాలన్నీ వేదికపై కనిపించాయి. ఈ ప్రాంతీయ పార్టీల నేతలంతా కార్యక్రమానికి ముందు.. ప్రమాణస్వీకారం తర్వాత ఆప్యాయంగా పలకరించుకున్నారు. ‘అన్ని ప్రాంతీయ పార్టీలతో మేం టచ్‌లో ఉంటాం. తద్వారా దేశాభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి మేం కలిసి పనిచేసేందుకు వీలుంటుంది’ అని మమత అన్నారు.
ముభావంగా వజూభాయ్!
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత నెలకొన్న పరిస్థితుల్లో బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించటం ద్వారా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న గవర్నర్ వజూభాయ్ వాలా కార్యక్రమంలో ముభావంగా కనిపించారు. కార్యక్రమం ముగిసిన వెంటనే వేదిక దిగి వెళ్లిపోయారు. కుమారస్వామి గవర్నర్‌కు వీడ్కోలు చెప్పలేదు.
వర్షంతో ఇబ్బందులు
ప్రమాణ స్వీకారోత్సవానికి వర్షం ఇబ్బంది కలిగించింది. మధ్యాహ్నం 1.30 నుంచే బెంగళూరును భారీ వర్షం ముంచెత్తింది. అక్కడే ప్రమాణ స్వీకారం జరుగుతుందా? అన్న అనుమానం కలిగింది. ఒక దశలో విధానసౌధ లోపల కార్యక్రమం నిర్వహించాలని ఆలోచించారు. సాయంత్రంకల్లా వర్షం తగ్గుముఖం పట్టడంతో ప్రాంగణంలోనే ప్రమాణం నిర్వహించారు. భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు రావడంతో విధానసౌధ ఎదుట భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. విధానసౌధ సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మెట్రో స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీతో తీవ్ర గందరగోళం నెలకొంది.
నేతలకు ట్రాఫిక్ చిక్కులు
ప్రత్యేక విమానంలో బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్న సోనియా, రాహుల్‌లు ఎయిర్‌పోర్టునుంచి వస్తుండగా ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జామ్ అయ్యాయి. నివాసం నుంచి విధానసౌధకు బయల్దేరిన జేడీఎస్ జాతీయాధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడకు కూడా ట్రాఫిక్ చిక్కులు తప్పలేదు. బెంగళూరుకు చేరుకున్న తర్వాత సోనియా, రాహుల్ నేరుగా తమ ఎమ్మెల్యేలున్న హిల్టన్ హోటల్‌కు వెళ్లారు. వారందరితోనూ మాట్లాడారు. వారిని అభినందించారు. బలపరీక్ష పూర్తయ్యేంతవరకు ఎమ్మెల్యేలు హోటల్‌లోనే ఉండాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కార్యక్రమానికి గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు.
కన్నడ ప్రజల సాక్షిగా..
గవర్నర్ వజూభాయ్ కుమారస్వామితో ప్రమాణం చేయించారు. సంప్రదాయ దుస్తులైన ధోతీ, తెల్లని షర్టు ధరించిన కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, దళిత నేత పరమేశ్వర ప్రమాణం చేశారు. బుధవారం ఉదయమే కేపీసీసీ చీఫ్‌గా పరమేశ్వర రాజీనామా చేశారు. ఈ సంకీర్ణ సర్కారు శుక్రవారం విశ్వాస పరీక్ష ఎదుర్కొనుంది. ఆ తర్వాతే మిగిలిన మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం అనంతరం కుమారస్వామి కూడా ఒక్కొక్క నాయకుడి దగ్గరకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి వచ్చిన తన తల్లి చెన్నమ్మ పాదాలకు నమస్కారం చేశారు. కుమారస్వామి, డీకే శివకుమార్‌లు చేయిచేయి కలిపి కార్యకర్తలకు అభివాదం చేశారు.
విధానసౌధ ప్రాంగణంలో ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన వేలాదిమంది కార్యకర్తలు
ప్రమాణస్వీకార వేదికపై నుంచి అభివాదం చేస్తున్న పవార్, సోనియా, మాయావతి, రాహుల్, ఏచూరి, కుమారస్వామి, అఖిలేశ్ తదితరులు.
ఆప్యాయంగా పలకరించుకుంటున్న మాయావతి, సోనియా.
కుటుంబ సభ్యులతో కుమారస్వామి
Comments
Please login to add a commentAdd a comment